– గ్రామాలభివృద్ధితోపాటు విద్యార్థులకు సామాజిక విలువలు తెలుస్తాయి
– అల్వాల్ లయోలా అకాడమీ గోల్డెన్ జూబ్లీ వేడుకలో మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: వన్ కాలేజ్-వన్ విలేజ్ భావనతో ప్రతి విద్యాసంస్థ ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని గ్రామీణాభివృద్ధికి తోడ్పడాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. అల్వాల్‌లోని లయోలా అకాడమీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, లయోలా యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బందికి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. విద్య అనేది కేవలం మార్కులకే పరిమితం కాదని, సాంకేతిక జ్ఞానంతోపాటు మానవత్వం, మంచితనం కలిసిన విద్యే దేశానికి అవసరమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల వరకు ఆధునిక విద్య, మానవ విలువలు చేరితే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. లయోలా నుంచి చదివి ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థుల జీవిత కథలను పుస్తకం, డాక్యుమెంటరీ రూపంలో అందుబాటులో ఉంచితే ప్రస్తుత విద్యార్థులకు ప్రేరణగా ఉంటుందని సూచించారు. లక్ష్యంపై దృష్టి పెట్టి యువత కష్టపడి ముందుకు సాగితే జీవితంలో సంతోషం, విజయాన్ని సాధించగలరని చెప్పారు. తన వ్యక్తిగత జీవన ప్రయాణాన్ని ఉదాహరణగా చెబుతూ మారుమూల అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఆదివాసి బిడ్డగా విద్యను కొనసాగించి, న్యాయవృత్తిలోకి వచ్చి, ప్రజాసేవలో నిలిచానని చెప్పారు. శ్రమను గౌరవించడం, కష్టాన్ని ఇష్టంగా స్వీకరించడమే తన విజయానికి కారణమని తెలిపారు. విద్య, జ్ఞానం, విలువలు సమాజాన్ని ముందుకు నడిపిస్తాయని, జ్ఞానాన్ని నేర్చుకొని పదిమందికి పంచాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, తమ సంతోషాన్ని కుటుంబానికి, సమాజానికి పంచాలని, సమాజ సంతోషం కోసం అవసరమైనప్పుడు త్యాగం చేయాలని ఉద్బోధించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





