“ఈ మార్పులో భాగమవుతున్న మాజీ కార్యకర్తలు గౌరవం పొందాల్సిన జీవితం వారి హక్కు. లీగల్ అవుతున్న వారిని స్వాగతించాలి. అవమానం కాదు.. ఆత్మగౌరవం ఇవ్వాలి. అనుమానం కాదు. మళ్లీ జీవించడానికి బలం ఇవ్వాలి. చట్టబద్ధ జీవితంలోకి అడుగు పెట్టిన వారిని ‘మాజీలు’గా కాక… ‘మళ్లీ మనవాళ్లుగా’ చూడాలి. సమాజం, ప్రభుత్వం, మీడియా ఈ ముగ్గురూ కలిసి “సరెండర్” అనే పదాన్ని వాడడం మానేసి, వారిని తిరిగి మంచిగా జీవించాలనుకునే పౌరులుగా మనం స్వాగతించాలి..”

ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా ఒక పెద్ద మార్పు ఆవిర్భవిస్తోంది. దశాబ్దాల తరబడి అడవుల్లో, అనిశ్చితి మధ్య, తీవ్ర పరిస్థితుల్లో జీవించిన మావోయిస్టు నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు ఒకే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. లొంగిపోవడం కాదు… లీగల్ అవ్వడం. ఇది కొన్ని వ్యక్తుల నిర్ణయం మాత్రమే కాదు. ఒక యుగానికి ముగింపు, మరో యుగానికి ఆరంభం అనే సంకేతం. అడవుల నీడలో దాగి ఉన్న కొందరు కాదు… వందల సంఖ్యలో, అనేక రాష్ట్రాలలో ఒకేసారి భారీగా మావోయిస్టులు చట్టబద్ధ జీవితం వైపు అడుగులు వేస్తున్నారు.
ఉద్యమం తగ్గిపోవడానికి స్పష్టమైన కారణాలు..
సాయుధ పోరాటం ఒకప్పుడు పేదల ఆకాంక్షలను ప్రతిబింబించినా, కాలక్రమేణా అది ప్రజల జీవన వాస్తవాలకు దూరమైపోయింది. అదే సమయంలో ప్రభుత్వ అభివృద్ధి పనులు, సాంకేతిక, విద్యా అవకాశాలు, మద్దతు విధానాలు, మరియు సాయుధ ఉద్యమంపై సామాన్య ప్రజలు విసుగు విసుగు చెందటంతో ఈ పోరాటం ఒంటరిగా మారింది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీలో ఉన్నవారు కూడా “ఇది ఇక సమాజాన్ని మార్చే మార్గం కాదనే” స్పష్టమైన అవగాహనకు వచ్చారు.
అడవుల నుండి బయటకు వచ్చిన వారి నిర్ణయం ధైర్యవంతమైనదే, పార్టీ నుంచి బయటకు రావడం ఎప్పుడూ సులభం కాదు. ప్రాణాలకు ప్రమాదం, పాత సహచరుల తప్పుడు దారి, సమాజంలో అపనమ్మకం, ఇవన్నీ ఎదుర్కొనే ధైర్యం చాలా మందిలో కనబడింది. వారు వదిలింది ఒక గ్రూపు మాత్రమే కాదు.. తమ యవ్వనం, కుటుంబాలు, స్వప్నాలు, స్వేచ్ఛ. అలాంటి వారు మళ్లీ జీవితాన్ని పునఃప్రారంభించడమే గొప్ప విషయం.
సమాజం, ప్రభుత్వం.. గౌరవంతో ముందుకు రావాల్సిన సమయం
ఈ కార్యకర్తలు తమ కమ్యూనిస్టు ఆలోచనలు, ప్రజలతో పనిచేసిన అనుభవాన్ని చట్టబద్ధ మార్గాల్లో ఉపయోగిస్తే, గ్రామాల అభివృద్ధికి, సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటాలకు, వెనుకబడిన వర్గాల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి అవి మంచి బలం అవుతాయి. వారు నేర్చుకున్న విలువలను, అనుభవాన్ని చట్టబద్ధంగా వినియోగిస్తే గ్రామాలు, ప్రజలు, బలహీన వర్గాల పరిస్థితి మెరుగుపడడానికి అది చాలా ఉపయోగపడుతుంది. వారు ప్రజలకు దూరంలో ఉన్న శత్రువులు కాదు. ప్రజల నుంచే వచ్చినవారు. ప్రజల వద్దకేకే తిరిగి చేరుతున్నారు.
ఉద్యమం చివరి దశ.. ఒక కొత్త శాంతియుగం ప్రారంభం
మావోయిస్టు ఉద్యమం క్షీణించడం అనేది కేవలం ప్రభుత్వ విజయం కాదు. ఇది ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్న సంకేతం, అభివృద్ధి పథకాల ప్రభావం, హింసపై సామాన్య ప్రజల అసహనం, మరియు చివరకు సంభాషణ, ప్రజాస్వామ్యమే శాశ్వత మార్గం అనే స్పష్టమైన అవగాహన. ఈ మార్పులో భాగమవుతున్న మాజీ కార్యకర్తలు గౌరవం పొందాల్సిన జీవితం వారి హక్కు. లీగల్ అవుతున్న వారిని స్వాగతించాలి. అవమానం కాదు.. ఆత్మగౌరవం ఇవ్వాలి. అనుమానం కాదు. మళ్లీ జీవించడానికి బలం ఇవ్వాలి. చట్టబద్ధ జీవితంలోకి అడుగు పెట్టిన వారిని ‘మాజీలు’గా కాక… ‘మళ్లీ మనవాళ్లుగా’ చూడాలి. సమాజం, ప్రభుత్వం, మీడియా ఈ ముగ్గురూ కలిసి “సరెండర్” అనే పదాన్ని వాడడం మానేసి, వారిని తిరిగి మంచిగా జీవించాలనుకునే పౌరులుగా మనం స్వాగతించాలి.





