యాంత్రీకరణ గర్జనలో… కులవృత్తుల విలాపం!

“కులవృత్తులకు ప్రోత్సాహం లేకపోవడం, సరైన రుణాలు, మార్కెట్లు లభించకపోవడం, పనిముట్ల ఆధునీకరణకు సహాయం అందకపోవడం, వృత్తి పని వారిని కౌశల్ శిక్షణలో భాగం చేయకపోవడం.. ఇవన్నీ వారి వృత్తులను క్రమంగా మునిగిపోయే పాత పడవలా మార్చేశాయి. ఏళ్ల తరబడి పెట్టిన శ్రమ, నైపుణ్యం, కళాప్రతిభ… ఇవన్నీ ఒక్కరోజులో కోల్పోయినట్లుగా వృత్తికారుల పరిస్థితి మారిపోయింది. వారి పిల్లలు ఆ వృత్తి చేయాలనుకోకపోవడం లేదంటే దానికి మార్గం, మార్కెట్, గౌరవం ఏదీ మిగల్లేదు. ఫలితం.. గ్రామం తన జీవనాధారాన్ని కోల్పోయింది. వృత్తివాడు తన వృత్తిని కోల్పోయాడు. ఒకప్పుడు పల్లె అన్నదే ఉత్పత్తి, వ్యాపారం, శ్రమకు ప్రతీక. నేడు పల్లె అన్నదే నిరాశ్రయ ఉద్యోగార్ధుల నిలయం.”

-కాలగిరి శ్రీనివాస్ రెడ్డి 
ప్రజాతంత్ర విలేఖరి

రెండు దశాబ్దాల క్రితం వరకు భారతదేశం లోని గ్రామాలు స్వయం సమృద్ధికి నిలువుటద్దంగా నిలిచేవి. గ్రామం అనగానే రైతు మాత్రమే కాదు. వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, మేదరి, మంగలి, చాకలి, మాదిగ, విశ్వబ్రాహ్మణ, చేనేత, దర్జీ, శిల్పి, గీత కార్మికుడు. ఇలా ప్రతి వృత్తి గ్రామ జీవనానికి అంతర్భాగం. వివిధ రకాల పంటలు పండించడం రైతుకు ఎంత అవసరమో, అదే రీతిగా పంట పెరగడానికి పనిముట్లు తయారు చేసే కమ్మరి కూడా అవసరం, కుండలు చేసే కుమ్మరి, నాగలి చేసే వడ్రంగి, బుట్టలు చేసే మేదరి కూడా అవసరమే. వృత్తులన్నీ పరస్పర ఆధారితంగా, పరస్పర గౌరవంతో, పరస్పర అవసరాలతో నడిచేవి. ఇలా ఒకే గ్రామంలో “వృత్తి సమాజాలు” కలిసి జీవించడం వల్ల గ్రామం ఒక్క ఆర్థిక వ్యవస్థగా కాకుండా, జీవంతో నిండిన సంస్కృతి కేంద్రంగానూ నిలిచేది. కానీ నేడు… ఆ వృత్తులలో సగం చరిత్ర పుస్తకాల పుటల్లోకి చేరాయి. మిగతావి అంతమవ్వడానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైపోయింది.

ప్రభుత్వాల నిర్లక్ష్యమే కులవృత్తుల అంతరించడానికి అసలు కారణం 
స్వాతంత్ర్యానంతరం ఆధునికీకరణ పేరుతో గ్రామీణ కులవృత్తుల జీవనోపాధిని నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. కులవృత్తులకు ప్రోత్సాహం లేకపోవడం, సరైన రుణాలు, మార్కెట్లు లభించకపోవడం, పనిముట్ల ఆధునీకరణకు సహాయం అందకపోవడం, వృత్తి పని వారిని కౌశల్ శిక్షణలో భాగం చేయకపోవడం.. ఇవన్నీ వారి వృత్తులను క్రమంగా మునిగిపోయే పాత పడవలా మార్చేశాయి. ఏళ్ల తరబడి పెట్టిన శ్రమ, నైపుణ్యం, కళాప్రతిభ… ఇవన్నీ ఒక్కరోజులో కోల్పోయినట్లుగా వృత్తికారుల పరిస్థితి మారిపోయింది. వారి పిల్లలు ఆ వృత్తి చేయాలనుకోకపోవడం లేదంటే దానికి మార్గం, మార్కెట్, గౌరవం ఏదీ మిగల్లేదు. ఫలితం.. గ్రామం తన జీవనాధారాన్ని కోల్పోయింది. వృత్తివాడు తన వృత్తిని కోల్పోయాడు. ఒకప్పుడు పల్లె అన్నదే ఉత్పత్తి, వ్యాపారం, శ్రమకు ప్రతీక. నేడు పల్లె అన్నదే నిరాశ్రయ ఉద్యోగార్ధుల నిలయం. వడ్రంగి చెక్కతో పోరాడినా మార్కెట్‌ లోహంగా దూసుకొచ్చింది… అతని చెక్క పనిని యంత్రాల కత్తులు మింగేశాయి. కుమ్మరి మట్టి చక్రాన్ని తిప్పినా.. జీవన చక్రం మాత్రం అతడిని తిరగనీయలేదు. మాదిగ చెప్పులు కుట్టినా.. తన పిల్లలకి జత కట్టే భవిష్యత్తు మాత్రం కుట్టుకోలేకపోయాడు. పాడుగాని చెప్పులు అమ్మకానికి లేక, పాఠశాల ఫీజులు చెల్లించలేక పోయాడు.
కమ్మరి ఇనుముతో పోరాడినా.. యంత్రీకరణ అగ్నికీలలు అతని పొయ్యిని ఆరబెట్టేశాయి. పరికరాల గర్జన, అతని సుత్తి శబ్దాన్ని మింగేసింది. మేదరి బుట్టలు అల్లినా, ప్లాస్టిక్ ప్రపంచం అతని కళాత్మక బుట్టలను నేల చూపించింది. బుట్టల బలం ఉంది, మార్కెట్ బలం లేకపోయింది. చేనేతకారుడు నూలు నేసినా.. జీవితపు నూలు మాత్రం అతనికి జారిపోయింది. కోట్లలో తిరిగే ఫ్యాషన్‌కి అతని శిల్పం కనిపించలేదు. విశ్వబ్రాహ్మణులు రాగి, కంచు కళను గీసినా, దుకాణాల్లో స్టీల్ మెరుపు, వారి కళలను నీడలలోకి నెట్టింది. రాగి పాత్రల సౌందర్యం నిలిచినా, వారు నిలవలేకపోయారు. గీతకార్మికుడు రోజంతా చెమటతో గీత వేసినా… అతని జీవన రేఖ మాత్రం ఎదగలేదు. ఒకప్పుడు గ్రామం మొత్తానికి రజకులే గౌరవం. వారి చేతిలో ఉడకబెట్టిన బట్టలు తళతళా మెరిసేవి. కానీ నేడు? వాషింగ్ మెషిన్ ఓ బటన్ నొక్కగానే రజకుల నైపుణ్యం విలువ కోల్పోయింది. మంగలి కూడా అదే వృత్తుల వలే కాలం చేతికి చిక్కిపోయాడు. బట్టతలపై జుట్టు తగ్గినట్టే అతని వృత్తిపై ఆదాయం కూడా తగ్గిపోయింది. ఇది ఒక కులవృత్తిదారుడి వ్యక్తి కథ కాదు..ఈ దేశపు సామాజిక వ్యవస్థ కూలిపోవడానికి దారితీసే సంకేతం. ఇవన్నీ నేడు జ్ఞాపకం మాత్రమే.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పతనానికి కారణం ఒకటే.. ఉత్పత్తి గ్రామంలో జరగడం లేదు.  స్వాతంత్ర్యానంతరం నడక తప్పిపోయిన అభివృద్ధి మోడల్‌ గ్రామీణ వృత్తుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది. కొన్నేళ్లుగా ఒక ప్రమాదకర ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామాల్లో వృత్తి పని చేసిన చేతులు, పట్టణాల్లో పని కోసం పరిగెడుతున్నాయి. ఎందుకు? ఎందుకంటే గ్రామంలో ఉత్పత్తి కేంద్రాలు లేవు. వ్యవసాయాన్ని మినహాయిస్తే ఒక్క పరిశ్రమ లేదు. చేనేత, చెప్పుల తయారీ, మట్టి పనులు, చెక్క పనులు, వ్యవసాయ పనిముట్లు, వెదురు బుట్టలు ఇవి అన్నీ ప్రత్యేక పరిశ్రమలుగా ఎదగగలుగుతాయి. కానీ అవి ఎదగడానికి కావలసింది ప్రభుత్వ ప్రోత్సాహకాలు , జీవనోపాధి రుణాలు, మార్కెట్ లింకులు, ఎగుమతి అవకాశాలు, డిజిటలైజ్డ్ మార్కెట్ పద్ధతులు. ఇవి ఏదీ అందకపోవడంతో వృత్తులు కుప్పకూలిపోయాయి.
చైనా, వియత్నాం, దక్షిణ కొరియా.. వీళ్ల విజయ రహస్యం ఏమిటి?
ఈ దేశాలు తమ గ్రామాల్లో “కుటీర పరిశ్రమల నెట్‌వర్క్” నిర్మించాయి. ఒక గ్రామంలో వుడ్ క్రాఫ్ట్, మరో గ్రామంలో టెక్స్టైల్, ఇంకో గ్రామంలో మొబైల్ అసెంబ్లింగ్… ఇలా చిన్న పరిశ్రమలను గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసి ప్రపంచ మార్కెట్లోకి ఎగుమతులు చేశారు. భారతదేశం కూడా ఇదే మార్గం తీసుకోవాల్సి ఉంది. మన గ్రామాల్లో శక్తి ఉంది. నైపుణ్యం ఉంది. పని చేసేందుకు ఇష్టపడే యువత ఉంది. కానీ లేనిది… ఒకే ఒక్కటి అవకాశం.
గ్రామీణ పరిశ్రమలతోనే గ్రామాలు మళ్లీ బలపడతాయి..
నేటి యువత పట్టణాల వైపు పరిగెత్తకుండా అడ్డుకోవాలంటే ఒక్కటే మార్గం.. గ్రామాల్లోనే జీవనోపాధి అవకాశాలు సృష్టించడం. దానికి ప్రభుత్వం వెంటనే తీసుకోవాల్సిన చర్యలు గ్రామ పరిశ్రమ క్లస్టర్లు, మొబైల్ అసెంబ్లింగ్, లెదర్ ఉత్పత్తులు, చేనేత, కుండలు, చెక్క పనులు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు, చిన్న యాంత్రిక తయారీ యూనిట్లు, ఏర్పాటు చేస్తే వేలాది ఉద్యోగాలు సృష్టించవచ్చు.
కులవృత్తులకు పునర్జీవం ఇవ్వాలి..
కేవలం పాత వృత్తులను బ్రతికించడం కాదు. వాటిని ఆధునికీకరించాలి.  ఉదాహరణకు.. విశ్వబ్రాహ్మణులకు ఆధునిక యంత్రాల భాగాలు, మాదిగలకు డిజైన్ లెదర్ ఇండస్ట్రీ, కుమ్మరులకు ఎగుమతి నాణ్యత మట్టి కళలు, వడ్రంగి మాడ్యులర్ ఫర్నిచర్ తయారీ, తదితర కుల వృత్తులకు ప్రోత్సాహం అందించాలి. యువత ఎదగాలంటే నైపుణ్యం అవసరం కనుక కార్పెంట్రీ, ఎలక్ట్రానిక్స్, టైలరింగ్, అగ్రో ప్రాసెసింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఇవి గ్రామాల్లోనే నేర్పించాలి. ప్రత్యేక గ్రామ స్టార్టప్ ఫండ్ ఏర్పాటు చేస్తే కొత్త వ్యాపారాలు పుట్టుకొస్తాయి.
అభివృద్ధి కార్పొరేషన్లు కాగితాల మీదే పని చేస్తే ప్రయోజనం ఏముంది?
వివిధ కులవృత్తుల అభివృద్ధి కోసం స్థాపించిన కార్పొరేషన్లు కేవలం రుణాల పేరుతో ఫైళ్లను నడపడం తప్ప గ్రామస్థాయిలో మార్పు తీసుకురాగల కార్యక్రమాలు చేపట్టడం లేదు. గ్రామాల్లో వృత్తులు నిలబడాలంటే.. క్షేత్రస్థాయిలో కార్యాచరణ జరగాలి. లబ్ధిదారులకు నేరుగా ఫలితాలు చేరాలి. వడ్రంగికి యంత్రాలు అందిస్తే అతను పరిశ్రమకు యజమాని కాగలడని అధికారులకు నమ్మకం ఎందుకు లేదు? కుమ్మరికి మార్కెట్ యాక్సెస్ ఇస్తే అతను ఎగుమతిదారుడవడని ఎవరు చెప్పారు?  మాదిగకు ఆధునిక శిక్షణ ఇస్తే అతను షూ బ్రాండ్ నిర్మించలేడని ఎందుకు అనుకున్నారు? గ్రామాల్లో పరిశ్రమలు స్థాపించాలి. లేకపోతే ప్రతి కులవృత్తుల చరిత్ర మ్యూజియంలో పెట్టే వస్తువుగా మారిపోతుంది. గ్రామాలను కాపాడాలంటే వృత్తులను కాపాడాలి. గ్రామం నిలబడితేనే దేశం నిలబడుతుంది. భారత అభివృద్ధి కథ గ్రామం నుంచే మొదలవుతుంది. కానీ గ్రామం జీవించేది వృత్తులు జీవించినప్పుడు మాత్రమే.
వృత్తులు కేవలం ఉపాధి కాదు. అవి కళ, అవి సంస్కృతి, అవి స్వాభిమానము, అవి జాతి  మూలాలు. ఈ మూలాలు బలంగా ఉన్నప్పుడు దేశం నిలుస్తుంది. మూలాలు ఎండిపోతే… చెట్టు ఎంత పెద్దదైనా ఒక దెబ్బకి పడిపోతుంది. ఇప్పటికైనా మేల్కొందాం…గ్రామీణ భారతావనికి కంకణం కట్టుకుందాం. ఇది కేవలం ప్రభుత్వాలకే కాదు. ఈ దేశం భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రతి హృదయానికి ప్రశ్న. పల్లెల్లో కమ్మరి కొలిమి వెలగాలన్నా, కుమ్మరి చక్రం తిరగాలన్నా, సాలెల మగ్గం బట్ట నెయ్యాలన్నా, వడ్రంగి పెద్ద బాడిస మొద్దు చెక్కలన్నా, ఆరిపోయిన సాకలి పొయ్యిలు వెలగాలన్నా, ఇప్పుడే చర్యలు తీసుకోవాలి. లేదా కొద్ది సంవత్సరాల్లో మనం కోల్పోయేది కేవలం వృత్తులు కాదు… మన మూలాలు. మన గుర్తింపు. .మన భవిష్యత్తు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *