రిటైర్డ్‌ ఉద్యోగుల బెనిఫిట్స్‌ వెంటనే చెల్లించాలి

– టీజీపీజేఏసీ ఆధ్వర్యంలో 17న మహా ధర్నాను జయప్రదం చేయండి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు మార్చి 2024 నుండి అక్టోబర్‌ 2025 వరకు రిటైర్మెంట్‌ బకాయిలు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శులు కె.లక్ష్మయ్య,ఎం.వి. నర్సింహారావులు డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశం లక్ష్మయ్య అధ్యక్షతన బుధవారం జరిగింది. 20 నెలలు గడిచినప్పటికీ ప్రభుత్వం తమకు పెన్షన్‌ తప్ప ఎలాంటి ప్రయోజనాలు చెల్లించడం లేదని, ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ ముఖ్యమంత్రికి, చీఫ్‌ సెక్రటరీకి ఈనెల 10లోగా బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని చెప్పారు. దీంతో ఈనెల 17న హైదరాబాదులోని ఇందిరా పార్కులో మహా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టేందుకు పిలుపునిచ్చామన్నారు. అన్ని జిల్లాల నుండి మార్చి 2024 నుండి రిటైర్డ్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లందరూ తమ కుటుంబాలతో, మరణించిన వారి కుటుంబ సభ్యులు వేల సంఖ్యలో పాల్గొని మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బాధిత సంఘ సభ్యుల పక్షాన రాష్ట్ర రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ బకాయిల సాధన సమితి తరపున పాల్గొన్న ఉమ్మడి వరంగల్‌ జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడు కందుకూరి దేవదాసు మాట్లాడుతూ ప్రభుత్వం తాము జీపీఎఫ్‌లో దాచుకున్న డబ్బులను ఇవ్వకుండా ఇతర పథకాలకు ఉపయోగించుకుని తమను బాధించడం సరైన విధానం కాదని, ప్రభుత్వానికి తగనిదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయంగా రావలసిన జీపీిఎఫ్‌, టీఎస్‌ జీఎల్‌ఐ, జీఐఎస్‌, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌, కమ్యుటేషన్‌, గ్రాట్యుటీ, 2020 పీఆర్సీ బకాయిలు, సర్వీసులో ఉన్నప్పుడు చేసుకున్న సరెండర్‌ లీవులు, డీఏ ఎరియర్స్‌ మొదలగు ప్రయోజనాలు చెల్లించక పోవడంతో మానసిక క్షోభకు గురవుతున్నారని, కొంతమంది అనారోగ్యంతో బాధపడుతూ, మనోవేదనతో అసువులు బాసిన వాళ్లు కూడా ఉన్నారని, నల్గొండ జిల్లాలో ఒక రిటైర్డ్‌ ప్రధానోపాధ్యాయుడు సిలువేరు సత్యనారాయణ బకాయిలు రాలేదని ఆవేదనతో అప్పులు చెల్లించలేని స్థితిలో మతిస్థిమితం కోల్పోయి ఇంటినుండి ఎక్కడికో వెళ్లిపోయారని తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి రిటైర్మెంట్‌ ఉద్యోగులకు న్యాయంగా రావలసిన బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రిటైర్డ్‌ ఉద్యోగుల బెనిఫిట్స్‌ రాక పిల్లల పెండ్లిళ్ళు చేయలేక, ఇండ్లు కట్టుకోలేక, పిల్లల చదువుల కోసం చేసిన అప్పులు చెల్లించలేక, బ్యాంకు ఈఎంఐలు కట్టలేక మానసిక వేదనతో అనేక రోగాల బారినపడి వైద్యం చేయించుకోలేకపోతున్నారని తెలిపారు. బకాయిల సాధన సమితి కో కన్వీనర్‌ భరత సత్యనారాయణ మాట్లాడుతూ ఈనెల 10లోగా రిటైర్మెంట్‌ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ గడువు విధించినప్పటికీ చెల్లించకపోవడంతోనే ఈనెల 17న మహా ధర్నా కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర కమిటీ సభ్యులు సూర్యనారాయణ, సుభాకర్‌ రావు, పుల్లయ్య, ఆర్థిక కార్యదర్శ బైరి నరసయ్య కూడా మాట్లాడారు. బాలరాజు, కె.నరసయ్య గౌడ్‌, విఆర్‌ దేశ్‌పాండే, అంజయ్య, నర్సింహాచారి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *