దిల్లీ పేలుడు ఘటనలో 12కు చేరిన మృతుల సంఖ్య

– హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరో ముగ్గురి మృతి
– సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా కారు గుర్తింపు

న్యూదిల్లీ, నవంబర్‌1 1: ‌దిల్లీ నగరాన్ని కుదిపేసిన ఎర్రకోట పేలుడు ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్‌ ‌వద్ద జరిగిన ఈ భయానక పేలుడులో 9మంది అక్కడికక్కడే మృతిచెందగా, చికిత్స పొందుతున్న వారిలో మరో ముగ్గురు హాస్పిటల్‌లో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరణాల సంఖ్య 12కు చేరింది. ప్రస్తుతం తీవ్ర గాయాలతో 17 మంది లోక్‌ ‌నాయక్‌ ‌జయప్రకాశ్‌ ‌నారాయణ్‌ ‌హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఎర్రకోటకు అతి సమీపంలో కారులో సంభవించిన భారీ పేలుడుతో దిల్లీ ఉలిక్కిపడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 12 మంది చనిపోయారు. అనేకమంది గాయపడ్డారు. పలువురు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నాయి. నిందితుడికి సంబంధించిన వీడియోలు కూడా వెలుగులోకి వొచ్చాయి. పేలుడుకు కారణమైన ఐ20 కారుకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు వెలుగులోకి వొచ్చాయి. ఆ కారు నడుపుతోన్న వ్యక్తి డాక్టర్‌ ఉమర్‌ ‌మహ్మద్‌ అని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు రోజులుగా దేశవ్యాప్తంగా ఛేదిస్తోన్న ఉగ్ర కుట్రల్లో భాగంగా అరెస్టయిన వారిలోనూ వైద్యులు ఉండటం కలకలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు మంత్రులు, అధికారులు దీనిని ఉగ్ర ఘటనగా పేర్కొన్నప్పటికీ చట్టవిరుద్ధ కార్యకలాపాల కింద దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వెల్లడించారు. అయితే భయంతో ఉమర్‌ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. నిషేధిత జైషే మహ్మద్‌, అన్సార్‌ ‌గజ్‌వత్‌ ఉల్‌ ‌హింద్‌ ఉ‌గ్ర సంస్థలతో సంబంధం ఉన్న 8 మందిని అరెస్టు చేసినట్లు జమ్మూకశ్మీర్‌ ‌పోలీసులు సోమవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. వీరిలో ముగ్గురు వైద్యులు అదీల్‌ అహ్మద్‌, ‌ముజమ్మిల్‌ ‌షకీల్‌, ‌షాహిన్‌ ఉన్నారు. వారిలోని మహిళా డాక్టర్‌ ‌షాహిన్‌ ‌సోమవారం లఖ్‌నవూలో అరెస్టు కాగా ఆమె కారు నుంచి ఏకే-47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కశ్మీర్‌, ‌హరియాణా, ఉత్తర్‌‌ప్రదేశ్‌, ‌కేంద్ర ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో అమ్మోనియం నైట్రేట్‌, ‌పొటాషియం నైట్రేట్‌ ‌సహా సల్ఫర్‌తో కూడిన 2,900 కిలోల పేలుడు పదార్థాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూకశ్మీర్‌ ‌పోలీసులు తెలిపారు. మరోపక్క గుజరాత్‌లో భారీ ఉగ్ర కుట్రకు ప్రయత్నించిన సయ్యద్‌ అహ్మద్‌ ‌మొహియుద్దీన్‌తో పాటు మరో ఇద్దరు ఐసిస్‌ ‌సానుభూతిపరులను గుజరాత్‌ ఏటీఎస్‌ ‌పోలీసులు అరెస్ట్ ‌చేసిన సంగతి తెలిసిందే. సయ్యద్‌ అహ్మద్‌ ‌మొహియుద్దీన్‌ ‌కూడా ఒక డాక్టర్‌ ‌కావడం గమనార్హం. ఈ పరిణామాల వేళ ఉమర్‌ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. తన సహచరుల అరెస్ట్, ‌బాంబు తయారీలో వాడే పేలుడు పదార్థాల స్వాధీనంతో నిరాశ చెందిన అతడు ఈ పేలుడుకు పాల్పడి ఉండొచ్చన్న కోణాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. డాక్టర్‌ ఉమర్‌ ‌మహమ్మద్‌ ‌కుటుంబ సభ్యులు సహా ఆరుగురిని జమ్మూ కాశ్మీర్‌ ‌పోలీసులు అరెస్ట్ ‌చేశారు. వారిలో ఉమర్‌ ‌తల్లి షనా భానో, సోదరులు ఆషిక్‌ అహ్మద్‌, ‌జాహ్‌ అహ్మద్‌, అలాగే ప్లంబర్‌ అమిర్‌ ‌రషీద్‌, ‌ప్రభుత్వ ఉద్యోగి అర్‌ ‌రషీద్‌ ‌మిర్‌, ‌బ్యాంకు సెక్యూరిటీ గార్డ్ ‌తారీఖ్‌ ‌మాలిక్‌ ఉన్నారు. పోలీసుల సమాచారం ప్రకారం ఫరీదాబాద్‌ ఆయుధాల కేసులో పరారీలో ఉన్న ఉమర్‌ ఉ‌గ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉండి, ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీల ద్వారా కారు కదలికలను పోలీసులు గుర్తించారు.

సందర్శకులకు ఎర్రకోట మూసివేత

ఎర్రకోట సమీపంలో సోమవారం రాత్రి కారు పేలుడు ఘటన నేపథ్యంలో ఎర్రకోటను బంద్‌ ‌చేశారు. రాబోయే మూడు రోజులపాటు సందర్శకులకు ఎర్రకోట బంద్‌ ఉం‌టుందని అధికారులు చెప్పారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇం‌డియా దీనిపై ప్రకటన చేసింది. కారు బాంబు పేలుడు జరిగిన ప్రదేశంలో ప్రస్తుతం ఫోరెన్సిక్‌ ఇన్వెస్టిగేషన్‌ ‌జరుగుతున్నది. అయితే ప్రజలు భారీ స్థాయిలో గుమికూడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎర్రకోటను బంద్‌ ‌చేస్తున్నట్లు ఏఎస్‌ఐ ‌ప్రకటించింది. కారు పేలుడుకు, ఫరీదాబాద్‌ ‌టెర్రర్‌ ‌మాడ్యూల్‌కు లింకు ఉన్నట్లు ప్రాథమిక విచారణ ద్వారా వెల్లడవుతున్నది. పేలడు కోసం డిటోనేటర్లు వాడినట్లు అనుమానిస్తున్నారు. అమోనియం నైట్రేట్‌ ‌రసాయనం వాడి ఉంటారని భావిస్తున్నారు. . రెడ్‌ఫోర్ట్ ‌మెట్రో స్టేషన్‌ను కూడా మూసివేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *