పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత

నవంబర్ 6…అంతర్జాతీయ పర్యావరణ దోపిడీని నిరోధించే దినోత్సవం
అంతర్జాతీయ పర్యావరణ దోపిడీ అనేది ఒక దేశం లేదా సంస్థ తన ఆర్థిక లాభం కోసం సహజ వనరులను దోచుకోవడం, దుర్వినియోగం చేయడం. ఇది ప్రధానంగా అడవుల నరికివేత, ఖనిజ సంపదను పెద్ద స్థాయిలో తవ్వుకోవడం, నీటి వనరులను అతిగా వినియోగించడం వంటి రూపాలలో ఉంటుంది. ఈ దోపిడీ వల్ల స్థానిక జీవజాలం, స్థానిక జనాభా తీవ్రంగా ప్రభావితం అవుతుంది. తక్కువ అభివృద్ధి చెందిన దేశాలు లేదా అభివృద్ధి చెందుతున్న దేశాలు, తమ పర్యావరణం మరియు వనరులను పరిరక్షించడానికి తగిన విధానాలను అనుసరించలేక పోతున్నాయి. ఇది ఆ దేశాల పర్యావరణాన్ని తీవ్ర స్థాయిలో నాశనం చేస్తోంది.
ప్రపంచం మొత్తం పర్యావరణ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. గ్లోబల్ వార్మింగ్, వాయు కాలుష్యం, నీటి ప్రదూషణ, జీవవైవిధ్యం నష్టం వంటి అనేక సమస్యలు మన జీవన విధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమస్యలకు ప్రధాన కారణం అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న పర్యావరణ దోపిడీ. ఒక దేశం లేదా సంస్థ తన ఆర్థిక ప్రయోజనాల కోసం ఇతర దేశాల సహజ వనరులను దోపిడీ చేయడం, తద్వారా స్థానిక ప్రజల జీవన విధానాలపై ప్రతికూల ప్రభావం చూపడం, పర్యావరణ దోపిడీకి ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఈ సమస్యను అరికట్టేందుకు మరియు పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట దినాన్ని పాటిస్తారు. ఈ సందర్భంలో అంతర్జాతీయ పర్యావరణ దోపిడీ అంటే ఏమిటి, దాని ప్రభావాలు, నివారణ చర్యలు, మన బాధ్యతలు వంటి అంశాలను పరిశీలించడం అవసరం.
అడవుల నరికివేత, భారీ పరిశ్రమల నెలకొల్పటం, రసాయనాల వాడకం వంటివి అనేక జంతువుల, వృక్షజాలం నివాసాలను ధ్వంసం చేస్తాయి. వీటి వల్ల అనేక జీవజాతులు అంతరించి పోతాయి. జీవవైవిధ్యం కనుమరుగవడం వల్ల పర్యావరణ సమతుల్యతలో గణనీయమైన మార్పులు వస్తాయి. పరిశ్రమల నుంచి ఉద్గారాలు, వ్యవసాయ రసాయనాలు, మరియు ఇతర వ్యర్థ పదార్థాలు నదులు, సముద్రాలు, వాయు మండలాన్ని కలుషితం చేస్తాయి. ఇది పర్యావరణానికి మాత్రమే కాకుండా, మన ఆరోగ్యానికీ ప్రమాదకరం. దీని వలన వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, భూసమర్థవంతత తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
వనరులను అతిగా వినియోగించడం, చెట్లను నరికివేయడం, గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలను పెంచడం వలన వాతావరణంలో వేడి పెరుగుతోంది. దీని కారణంగా గ్లోబల్ వార్మింగ్ అనే సమస్య పెరిగి వాతావరణంలో అతివృష్టి, కరువు వంటి ప్రతికూల మార్పులు చోటు. చేసుకుంటున్నాయి.వాతావరణ మార్పు వల్ల వరదలు, కరువులు, అగ్ని ప్రమాదాలు వంటి సహజ వైపరీత్యాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఈ ప్రక్రియలతో పర్యావరణ నాశనం తక్షణమే కనిపించక పోయినా, దీర్ఘకాలంలో వీటి ప్రతికూల ప్రభావం పెద్ద స్థాయిలో ఉంటుంది. కాలుష్యం వల్ల మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. వాయు కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు, నీటి కాలుష్యం వల్ల నీటి ద్వారా వ్యాప్తిచెందే వ్యాధులు ప్రబలుతున్నాయి. శరీరంలో విష పదార్థాలు చేరటం వల్ల కేన్సర్, జన్యు వ్యాధులు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి.

అంతర్జాతీయ పర్యావరణ దోపిడీని అరికట్టడానికి ప్రయత్నాలు జరిగాయి. పర్యావరణ పరిరక్షణ కోసం పలు అంతర్జాతీయ ఒప్పందాలు కుదిరాయి. టోక్యో ప్రోటోకాల్, పారిస్ ఒప్పందం వంటి ఒప్పందాలు ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు దేశాలు ఒక ప్రణాళికను అనుసరిస్తున్నాయి. ఈ ఒప్పందాలు పర్యావరణ పరిరక్షణకు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందిస్తున్నాయి. ప్రతి దేశం పర్యావరణ పరిరక్షణ కోసం స్వంత చట్టాలను రూపొందిస్తోంది. వనరులను అధికంగా వినియోగించే సంస్థలపై నియంత్రణ విధించేలా చట్టాలు అమలు చేస్తున్నాయి. కాలుష్య నియంత్రణ, వనరుల పరిరక్షణ, రక్షణాత్మక చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలు చట్టాలను రూపొందిస్తున్నాయి.
పర్యావరణ అవగాహన కార్యక్రమాలు:
పర్యావరణ పరిరక్షణపై ప్రజలలో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు మరియు ఇతర సంస్థలు జాగృతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. పర్యావరణ సమస్యలను ప్రజలకు వివరించడం, అవగాహన కల్పించడం వల్ల ప్రజలు తమ జీవనశైలిని సవరించు కోవడానికి ఆసక్తి చూపిస్తారు. శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా సౌరశక్తి, పవనశక్తి వంటి పునరుత్పాదక ఇంధనాలను వినియోగించడాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ వనరులు పర్యావరణానికి హానికరమైన కర్బన ఉద్గారాలను తగ్గించడంలో సహాయ. పడతాయి.
ప్రతి వ్యక్తి పర్యావరణ పరిరక్షణలో తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి. వాహనాలను తక్కువగా వినియోగించడం, పునర్వినియోగ పదార్థాలు ఉపయోగించడం, నీటి వనరులను ఆదా చేయడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చు. పర్యావరణానికి మేలు చేసే మొక్కలను నాటి, వాటిని సంరక్షించడం ద్వారా వాయు కాలుష్యం తగ్గించవచ్చు. పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులను ఎంచుకోవడం, ప్లాస్టిక్ వంటి పదార్థాల వాడకాన్ని తగ్గించడం, మన పరిసరాల్లోని వారికి పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరించడం చేపట్టాలి. అంతర్జాతీయ పర్యావరణ దోపిడీ ఒక తీవ్రమైన సమస్యగా మనముందుంది. దీనిని అరికట్టడానికి ప్రభుత్వాలు, సంస్థలు, మరియు ప్రజలు కలిసి కృషి చేయాలి. పర్యావరణాన్ని కాపాడడంలో ప్రతి ఒక్కరి బాధ్యత అత్యంత కీలకం. మనం పర్యావరణాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన జీవనం అందించ గలుగుతాం.
 రామ కిష్టయ్య సంగన భట్ల…
   9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *