నాలో గడ్డకట్టిన సముద్రాలు ఆవిరి అవుతున్న ఇనుప కోటలు కరిగి ప్రవహిస్తున్న పర్వతాలు శిలాజీకరణం చెందిన అడవులు ఎన్నో ఉన్నాయి. నాలో మౌనం వెనుక దాగిన ఆగ్రహం హాహాకారంలో మరుగున పడ్డ నివేదనం నిశ్చలతలో నిక్షిప్తమైన దిక్కారం ఆవేశం అడుగున మమకారం నివురుగప్పి ఉంది.

ఓ మనిషీ! “హాల్ కైసా హై జనాబ్ కా, క్యా ఖయాళ్ హై ఆప్ కా?!” ఏమనుకుంటున్నావు, ఎలా కనిపిస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, ఏం ప్రదర్శిస్తున్నావు, ఏం అనుభూతిస్తున్నావు, ఏమి వ్యక్తీకరిస్తున్నావు, ఏమి కావాలనుకున్నావు, ఏమి చూపిస్తున్నావు, ఏ మోహానికి ఏ ముఖాన్ని తొడుక్కున్నావు, ఏ ముఖానికి ఏ దాహాన్ని ఆపాదిస్తున్నావు?

ఓ నరుడా! “ఇన్ ఆంఖో కీ మస్తీ కే మస్తానే హజారో హై?!” కళ్ళల్లో నింగిని పెట్టుకుని రెటీనా వెనుక సాగరాలను దాస్తున్నావా, పెదాలపై మెరుపులద్దుకొని నాలుకపై కారుమబ్బులను మోస్తున్నావా, చెంపలపై లేత చిగుళ్ళు చూపిస్తూ గొంతులో ఎడారులను సాగు చేస్తున్నావా, చెవిరెమ్మలపై కోకిలను వాల్చి కర్ణభేరిలో ఉరుములను పొదుగుతున్నావా?

ఏమైతేనేం, నేను అణువులోని అంతరిక్షాన్ని. తనువులోని అనుభవాన్ని నీ AI మస్తిష్కానికి అందిస్తాను! నేను మనసును అల్లుకున్న మృత్తికను. ఆస్థికలు పాడే గీతికను నీ perplexity పై జల్లుతాను! నేను జడంలోని చలనాన్ని, అజడంలోని చేతనాన్ని, జగడంలోని చరణాన్ని, జడాజడంలోని దిగంత ఝంఝాని నీ VR గుండెలపై పేలుస్తాను!
నన్ను నేను నీకు సమర్పిస్తాను. రెండు ‘నేను’లను సమంగా నీకు అర్పిస్తాను
-డాక్టర్ మామిడి హరికృష్ణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *