ఈ సంఘీభావం మరిచిపోలేనిది

తెలంగాణ నుండి అమెరికా వెళ్ళిన తర్వాత, క్రొత్త దేశం, క్రొత్త మనుషులు, క్రొత్త సంస్కృతి, దానికి తోడు ఉద్యోగంలో ఎన్నో సవాళ్ళ వల్ల చాలారోజులు అంటే దాదాపు సంవత్సరాలుగా ఎలాంటి సాహిత్యం వైపు వెళ్ళలేదు. ఆ తర్వాత ప్రారంభించిన నా సాహిత్య మలిమజిలీలో చాలా విషయాలు నాలోని కథకుని తట్టిలేపాయి. అమెరికా పోయిన చాలామంది భారతీయులు ఇంకా మనదేశంలో వలె పిల్లల చదువుపై వత్తిడి పెట్టడం, అవసరం అయినదానికీ, కానిదానికీ ఇతరులతో పోటీపడటం లాంటి విషయాలపై నేను వేకప్, ధీమాలాంటి కథలు రాసాను.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నాను. ఎన్నో సమావేశాల్లో మాట్లాడటం, దాశరధి, కాళోజీ లాంటి మహాకవులు తొలిదశ ఉద్యమంలో రాసిన ఎన్నోపాటలు, ఉపన్యాసాలు ఉద్యమ సందర్భంగా ఉపయోగించుకున్నాను. తెలంగాణ ఉద్యమ తీరు, వేలాది మంది యువకులు, పెద్దలు, స్రీల బలిదానాలపై “నింగిలోన  వెలుగుతున్న చుక్కలు” అనే పాట  రాసి చాలాసార్లు సమావేశాలలో పాడాను.

తెలంగాణ ఉద్యమం జరిగినన్నీ రోజులు కథలు, కవితల వైపుకి తొంగిచూడలేదు. ప్రతిరోజు తెలంగాణలో జరిగే ఏదో ఒక అంశం కలవరపెట్టేది. మిలియన్ మార్చ్ కు మద్దతుగా అమెరికా పార్లమెంట్ భవనం (క్యాపిటల్ హిల్) ముందు ధర్నాకి ప్రత్యేక అనుమతి తీసుకొని మూడు వందల ఉద్యమకారులతో సంఘీభావం తెలపడం మరిచిపోలేని విషయం. అమెరికాలో నేర్చుకున్న మీడియా కోర్సుల ద్వారా ఎన్నారై ఉద్యమప్రగతిని తెలంగాణ మీడియాకి ఎప్పటికప్పుడు చేరవేసే సంధానకర్తగావ్యవహరించాను. ఆర్టిస్ట్ గా బ్యానర్లు,  ప్లకార్డులు కూడా రాసాను.

మళ్ళీ  కథకునిగా  మారింది తెలంగాణ సాధించుకున్న రెండేళ్లకు. సరిగా సంవత్సరం తర్వాత మొదటి కథాసంపుటి ‘మౌనసాక్షి’ అచ్చు వేసాను.  రెండేళ్లలో ఇంకో కథాసంపుటి ‘అరుగు’, ఆ తర్వాత ‘శ్రీగీతం’ నవల రాసాను. తెలంగాణ రచయితల సంఘం జంటనగరాలశాఖ జూమ్ వేదికగా నిర్వహిస్తున్న ‘సోమవారం కవిసమ్మేళనం’లో చేరిన తర్వాత కవిత్వం రాయడం మొదలుబెట్టాను. త్వరలో కవితా సంపుటి వెయ్యాలనుకుంటున్నాను. తెలంగాణలో పుట్టినవాడిగా ఎన్నోచోట్ల నిర్లక్ష్యానికి,  వివక్షకు గురి అయిన ప్రాంతం కాబట్టి నా రచనల్లో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేట్టు చూసుకుంటాను.  అమెరికా డయాస్పోరా కథలతో పాటు ఇండియాలో కూడా జరిగిన ఎన్నో సంఘటనలు నా కథల్లో భాగమయ్యాయి.

చదువుపట్ల పిల్లల అభిరుచులను పక్కకుపెట్టి తెలుగురాష్ట్రాల్లో కోచింగ్ సెంటర్లలో పిల్లలను ఎలా రుద్దుతారో,  అమెరికాలో కూడా తెలుగువారు వారి పిల్లల చదువుపట్ల ఇలానే ప్రవర్తించే తీరు, దాన్నివల్ల  ఎంతమంది చిన్నారులు చితికి పోయారో తెలుసుకున్న తర్వాత రాసిన కథ ‘వేకప్’ ఒకరు పెద్ద ఇల్లు కొన్నారని, హైఎండ్ కార్ కొన్నారని, స్తోమత లేకపోయినా పోటీలుపడి కొనుక్కుని చితికిపోయిన కొన్ని జీవితాలు చూసిన తర్వాత రాసిన కథ ‘ధీమా’. రూపాయల్లో అన్నీ పంచుకుని సంతోషంగా సాగిన స్నేహం, అమెరికాకు వచ్చిన తర్వాత తోటిమిత్రుడు సహాయం కోరినప్పుడు డాలర్లలో ఆలోచించిన ఆ స్నేహబంధం ఎలా దూరమయ్యిందో “ఫ్రెండ్స్” కథలో వివరించాను.

అంతేకాకుండా ఇక్కడి మంచు ఇబ్బందులని యమధర్మరాజు అమెరికా వస్తే ఎలా ఉంటుందో ఊహించి రాసాను. హాస్యప్రధానంగా సాగినకథ. అమెరికా అయినా, ఇండియా అయినా నమ్మించి మనుషులు ఎలా మోసం చేస్తారనే విషయాన్ని మన నరకమే మన స్వర్గం’ కథలో రాసాను. కేవలం గ్రీన్ కార్డు కోసం అమెరికా పౌరసత్వం ఉన్న  అమ్మాయిలని నమ్మించి,  ప్రేమించి, పెళ్లి చేసుకుని,  ఒకసారి గ్రీన్ కార్డు రాగానే పూర్తిగా నమ్మి జీవితాన్ని అర్పించిన ఆ అమ్మాయిని మోసం చేసి, తల్లితండ్రుల మాటలను కాదనలేక మళ్ళీ ఇండియా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లాంటి సంఘటనలను చూసిన తర్వాత “నయా వంచన” కథ రాసాను.

భార్యాభర్తలిద్దరూ సంపాదనలో పడి అమెరికాలో పుట్టిన పసిబిడ్డలని వారి తల్లితండ్రులతో ఇండియాకి పంపి ఎలా ఆ చిన్నారుల మురిపాలను, ముద్దుచేష్టలను  కోల్పోతున్నారనే అంశాన్ని ‘పిలుపు’ కథగా, తర్వాత లఘుచిత్రంగా తీసినప్పుడు, ఆ చిత్రం స్పూర్తితో దూరంగా ఉన్న చిన్నారులని  తల్లిదండ్రులు తిరిగి తమ దగ్గరకు తెచ్చుకున్న సంఘటనలు ఎన్నో.  ‘పిలుపు’ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అమెరికాలో జరిగే ఎన్నో సంఘటనలను, ఎన్నారైలకు ఉపయోగపడే ఎన్నో విషయాలను చిన్నచిన్న అంశాలుగా వీడియోలు ప్రచురించాం! నా మనసుని తట్టిలేపిన అంశాన్ని పట్టి అది కథ, కవిత, నవల లేదా సినిమాలాంటి ఏదో ఒకరూపంలోకి మార్చడానికి ప్రయత్నిస్తుంటాను.  నా ప్రతి ప్రయత్నానికి మద్ధతు తెలిపే మిత్రులెందరో! చాలామంది మిత్రుల ఆర్ధిక సహకారంతో ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫీచర్ ఫిలిం ‘ఆటాడిన పాట’ ప్రముఖ నటులు నటించిన ఈ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

-వేణు నక్షత్రం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *