స్థానిక ఎన్నికల్లో ఎవరి ధీమా వారిదే

స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ ‌విడుదలకాగానే గెలుపుపై రాజకీయ పార్టీలన్నీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో తమ జండాకు ఎదురులేదని బిఆర్‌ఎస్‌ ‌పార్టీ చెబుతుంటే, ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ‌పరాభావాన్ని ఎదుర్కోక తప్పదని కాంగ్రెస్‌ ‌విమర్శిస్తోంది. అంతేకాదు ప్రజల ఆశీర్వాదం తమకే ఉంటుందని ఆ పార్టీ నొక్కి చెబుతున్నది. కాగా దిల్లీ ఎన్నికలే కాదు.. గల్లీ ఎన్నికల్లోనూ విజయం తమదేనని బిజెపి అంటోంది. దాదాపు పందొమ్మిది నెలలుగా ఎదురు చూస్తున్న స్థానిక ఎన్నికల ప్రక్రియ సోమవారం ఎన్నికల షెడ్యూల్‌ ‌ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో వేడి రాచుకుంది. ఇంతకాలం మాటలతో పోట్లాడుకుంటున్న ఈ పార్టీలు వోటింగ్‌ ‌ద్వారా ప్రత్యక్ష పోరాటానికి సిద్దమైనాయి. ఈ ఎన్నికల రణక్షేత్రంలో దిగేందుకు ఆయా పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి.

గత శాసనసభ ఎన్నికల్లో తమకు విజయాన్ని చేకూర్చిన అభివృ‘ద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోనే ఈ ఎన్నికలబరిలో దిగేందుకు కాంగ్రెస్‌ ‌పథకరచన చేస్తున్నది. ఆ పథకాల ఫలితాలను గత రెండేళ్ళుగా ప్రజల అనుభవంలో ఉన్న విషయాన్ని మరోసారి వారికి గుర్తు చేసేందుకు కాంగ్రెస్‌ ‌సిద్దమైంది. అయితే కాంగ్రెస్‌వి విఫల పథకాలంటూ గ్రామీణ ప్రాంత ప్రజలకు అర్థమయ్యేరీతిలో ప్రచారానికి బిఆర్‌ఎస్‌ ‌రంగం సిద్దంచేస్తున్నది. కాంగ్రెస్‌ ఎన్నికలముందు ప్రకటించిన పథకాలేవీ అమలుపర్చలేకపోయిందంటూ ఇప్పటికే విస్తృత ప్రచారం చేస్తున్న బిఆర్‌ఎస్‌ ‘ ‌కాంగ్రెస్‌ ‌బాకీ కార్డు’ ఉద్యమాన్ని చేపడుతున్నది. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు సంబంధించి  420 హామీలను ఈ కార్డులో పొందుపరచి, గత రెండు సంవత్సరాలుగా ఈ పథకాలు అమలు పర్చకపోవడంవల్ల ప్రజలకిచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఎంత బకాయి పడిందన్నది ప్రజలకు తెలియజేసే విధంగా కార్డులను ఇంటింటికి పంచేందుకు బిఆర్‌ఎస్‌ ‌సిద్దపడింది.

బాకీ కార్డుల ప్రచారం కాంగ్రెస్‌పై బ్రహ్మాస్త్ర ప్రయోగంగానే బిఆర్‌ఎస్‌ ‌వర్గాలు భావిస్తున్నాయి. పైగా నిన్న మొన్నటివరకు వ్యవసాయ రంగంలో ఏర్పడిన యూరియా సంక్షోభం, వర్ణుడు బీభత్సానికి రాష్ట్ర రాజధాని నగర కల్లోల పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ఉన్న నగరాన్ని చక్కదిద్దుకోలేకపోతున్న కాంగ్రెస్‌ ‌ఫ్యూచర్‌సిటీపై దృష్టి పెట్టడాన్ని బిఆర్‌ఎస్‌ ‌తీవ్రంగా ఆక్షేపిస్తున్నది. అయితే కాంగ్రెస్‌ అదే రీతిలో ఎదురు దాడిచేస్తోంది. గత ప్రభుత్వ పది సంవత్సరాల పాలనలో రాష్ట్రం ఆర్థికంగా విద్వంసమైందని, అందుకే తామిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వొస్తున్నామని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నది. అన్నిటికన్నా మిన్నగా తాము బీసీలకు 4 2శాతం రిజర్వేషన్లను కల్పించడమన్నది ఈ ఎన్నికల్లో తమకు ఘన విజయాన్ని చేకూరుస్తుందన్న నమ్మకాన్ని కాంగ్రెస్‌ ‌వ్యక్తంచేస్తున్నది. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని మరో ప్రధాన పార్టీ బిజెపి ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్ధులను పోటీకి నిలుపుతుందని, అందుకు గెలుపు గుర్రాలనే ఎంపిక చేస్తామంటోంది.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను వర్తించే విధంగా జీఓ  జారీ చేయాలని తమ పార్టీ మొదటినుండీ డిమాండ్‌ ‌చేస్తున్నదని, అయితే అందులో పదిశాతం ముస్లింలకు రిజర్వేషన్‌ ఉం‌డరాదన్నదే తాము చెబుతూ వొస్తున్నామంటున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు స్థానిక సమరంలో ఈసారి బిజెపి కొత్త చరిత్రను లిఖించబోతున్నదంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో తేల్చుకోవాలని సిపిఐ, ఎంఐఎం తో పాటు కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ బీసీ రాజ్యాధికార పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. సిపిఐ కాంగ్రెస్‌ ‌తో స్నేహ సంబంధాలు కలిగి, తమకు బలమున్న ప్రాంతాల్లో తమ పార్టీ అభ్యర్దులను నిలబెట్టాలనుకుంటోంది.

కాగా ఎంఐఎం పార్టీ చూపు ప్రధానంగా నల్లగొండ, ఆదిలాబాద్‌, ‌మహబూబ్‌నగర్‌, ‌నిజామాబాద్‌ ‌జిల్లాలపై ఉంది. మరోపక్క బిఆర్‌ఎస్‌ ‌నుండి బహిష్కృతురాలయిన  కల్వకుంట్ల కవిత ఇంకా పార్టీ ఏర్పాటు చేయకపోయినా తన జాగృతి నాయకులను ఇండిపెండెంట్లుగా పోటీ చేయించే ఆలోచనలో ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఈ పార్టీల ఆలోచనలన్నీ అక్టోబర్‌ ఎనిమిదవ తేదీపైనే ఉన్నాయి. రిజర్వేషన్‌లకు సంబందించిన కేసుపై ఆరోజు తీర్పు రానుండగా, ఎలాంటి తీర్పు వెలువడుతుందోనని  ఎన్నికల్లో పోటీచేసేందుకు ఉత్సాహపడుతున్న బిసీ అభ్యర్దుల్లో ఉత్కంఠ  నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *