ఎంజిబిఎస్‌ ‌నుంచి బస్సుల నిలిపివేత

– ఉప్పల్‌, ‌జెబిఎస్‌, ఆరాంఘర్‌ నుంచి సర్వీసులు
– ఎక్స్ ‌వేదికగా ఎండి సజ్జనార్‌ వెల్లడి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27: ‌మూసీ నదికి భారీ వరద కారణంగా ఎంజీబీఎస్‌ ‌ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. దీంతో ఇక్కడి నుంచి బస్సుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ‘ఎక్స్’ ‌వేదికగా ప్రయాణికులకు సూచనలిచ్చారు. ప్రయాణికులు ఎంజీబీస్‌కు రావొద్దని పేర్కొన్నారు. ఎంబీజీఎస్‌ ‌నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి సంస్థ నడుపుతోంది. ఆదిలాబాద్‌, ‌కరీంనగర్‌, ‌మెదక్‌, ‌నిజామాబాద్‌ ‌వైపునకు వెళ్లే సర్వీసులు జేబీఎస్‌ ‌నుంచి నడుస్తున్నాయి. వరంగల్‌, ‌హనుమకొండ వైపునకు వెళ్లేవి ఉప్పల్‌ ‌క్రాస్‌ ‌రోడ్స్ ‌నుంచి వెళ్తున్నాయి. సూర్యాపేట, నల్గొండ, విజయవాడ వైపునకు బస్సులు ఎల్బీనగర్‌ ‌నుంచి నడుస్తున్నాయి. మహబూబ్‌నగర్‌, ‌కర్నూలు, బెంగళూరు వైపునకు వెళ్లే సర్వీసులు ఆరాంఘర్‌ ‌నుంచి వెళ్తున్నాయని అన్నారు. పొరపాటున ఎంజీబీఎస్‌కు ఎవరైనా ప్రయాణికులు వచ్చినా వారిని తరలించేందుకు అవసరమైనన్నీ లోకల్‌ ‌బస్సులు అందుబాటులో ఉంచాం. వారిని ఆయా బోర్డింగ్‌ ‌ప్రాంతాలకు లోకల్‌ ‌బస్సుల్లో తరలించేందుకు సిద్ధంగా ఉన్నాం. వర్షాలు, వరద తగ్గుముఖం పట్టేవరకు ఎంజీబీఎస్‌కు ఎవరూ రావొద్దని విజ్ఞప్తి అని తెలిపారు. చాదర్‌ఘాట్‌, ‌చంచల్‌గూడ, జియాగూడ, నార్సింగి, బండ్లగూడ జాగీరు వద్ద మూసీ ఉధృతి కొనసాగుతోంది. భారీ వర్షాలతో నగరంలో అధికారులు హైఅలర్ట్ ‌ప్రకటించారు. జంట జలాశయాల నుంచి మూసీకి నీటిని వదలడంతో నది పొడవునా భయాందోళనలు నెలకొన్నాయి. వరద నీటితో ముసారాంబాగ్‌, ‌చాదర్‌ఘాట్ ‌వంతెన‌ల‌పై వరద ఉద్ధృతంగా ప్రవహించింది. ముసారాంబాగ్‌ ‌నూతన పైవంతెన నిర్మాణ సామగ్రి కొట్టుకుపోయింది. స్లాబు వేయడం కోసం ఏర్పాటు చేసిన ఇనుమ దిమ్మెలు, వాటి కింద వేసిన పునాదులను వరద ప్రవాహం ఊడ్చేసింది. నదికి ఇరువైపులా పలు కాలనీలు నీట మునిగాయి. అధికారులు వందలాది మందిని సపంలోని పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం అందించారు. మూసానగర్‌, ‌శంకర్‌నగర్‌ ‌బస్తీల్లోని పలు కుటుంబాలు ఇళ్లను ఖాలీ చేయకపోవడంతో పోలీసులు బలవంతంగా వారిని బయటకు తీసుకెళ్లారు. ఈ రెండు వంతెనలపై వాహనాల రాకపోకలు పోలీసులు నిలిపేశారు. మూసారాంబాగ్‌ ‌నుంచి అంబర్‌పేట వైపు వొచ్చే అన్ని వాహనాలను భారత్‌ ‌పెట్రోల్‌ ‌పంప్‌ ‌వద్ద నుంచి గోల్నాక కొత్త వంతెన వైపు మళ్లించారు. ట్రాఫిక్‌ ‌హెల్ప్ ‌లైన్‌ 90102 03626‌కి కాల్‌ ‌చేయాలని హైదరాబాద్‌ ‌సిటీ సంయుక్త పోలీసు కమిషనర్‌(‌ట్రాఫిక్‌) ‌జోయల్‌ ‌డెవిస్‌ ‌శుక్రవారం రాత్రి తెలిపారు. రాజధానిలో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు వరుణుడు తెరపినివ్వలేదు. ఎడతెగని వానతో నగరమంతా బురదమయమైంది. రహదారులపై వరద ప్రవాహం అలాగే కొనసాగింది. కూడళ్లు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి 9గంటల వరకు చాంద్రాయణగుట్టలో 6.1సెం. గరిష్ఠ వర్షపాతం నమోదైంది.

న‌దీ గ‌ర్భంలో నివాసాలు:  హైడ్రా క‌మిష‌న‌ర్‌

మూసీ నది వరద ప్రభావిత ప్రాంతాలను, ముఖ్యంగా చాదర్‌ఘాట్, మూసారంబాగ్, ఎంజీబీఎస్ ప్రాంతాలను కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పరిస్థితిపై స్పందిస్తూ ముఖ్యంగా మూసీ నదీ పరివాహక ప్రాంతంలోని ఆక్రమణలు, ప్రజల తరలింపు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వరదకు ప్రధాన కారణం నదీ గర్భంలో నివాసాలన్నారు. ప్రస్తుతం నీరు ప్రవహిస్తున్న ప్రాంతం నిజమైన మూసీ నదీ గర్భం (రివర్ బెడ్). ఇక్కడ చాలామంది ప్రజలు ఇళ్లను నిర్మించుకున్నారన్నారు. మూసీ ఎంతవరకు విస్తరించిందో ఇప్పుడు మనం చూస్తున్నాం. వరద నీరు ముంచెత్తిన ప్రాంతాలను డ్రోన్ ద్వారా వీడియోలు తీశాం. ఇది నది ప్రవహించే మార్గమ‌న్నారు. ఇక్కడ చాలా సంవత్సరాలుగా నివసిస్తున్న ప్రజలను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించ‌డం ఒక్క‌టే శాశ్వత పరిష్కారమ‌న్నారు. ప్రభుత్వం వారికి ప్రత్యామ్నాయ వసతి, ఇతర పరిహారం అందించడానికి ప్రయత్నం చేస్తోంది కాబట్టి ప్రజలు ఇక్క‌డినుండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి ఇదే సరైన సమయమ‌న్నారు. ప్రస్తుతానికి ప్రాణ నష్టం లేదా ఎవరి ప్రాణాలకు ప్రమాదం జరిగినట్టు సమాచారం లేదు. అయితే కొన్ని ఆస్తులకు నష్టం జరిగింది. మూడు కాలనీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయ‌న్నారు. ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి వరద వచ్చినప్పుడు హైడ్రా, డీఆర్ఎఫ్  సిబ్బంది చేపట్టిన సహాయక చర్యలను ఆయన అభినందించారు. వరదలో చిక్కుకున్న ప్రజలకు డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ చేయించారు. నదీ గర్భంలో ఆక్రమణలను తొలగించడం హైడ్రా లక్ష్యం కాదని, అది మహానగరపాలక సంస్థ, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్  పరిధిలోని అంశమని గతంలో కూడా కమిషనర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం వరద వల్ల ఏర్పడిన విపత్తు సమయంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *