మొదటికొచ్చిన డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా వ్యవహారం

– రీ వెరిఫికేషన్‌లోనూ గందరగోళమే
– స్పోర్ట్స్‌ అథారిటీ అధికారుల తీరుపై మొదట్నుంచీ అనుమానాలు
అధికారులతో సమావేశంలో మంత్రి ఆగ్రహం!

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26 : డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా టీచర్ల నియామకాల్లో జరిగిన అక్రమాలు, నిర్లక్ష్యం, తప్పిదాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొదటిసారి కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పోర్ట్స్‌ కోటా టీచర్ల నియామకాలు చేపట్టిన నేపథ్యంలో స్పోర్ట్స్‌ అథారిటీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అందివచ్చిన అవకాశాన్ని సొమ్ము చేసుకున్న స్పోర్ట్స్‌ అథారిటీ సిబ్బంది తమ తప్పును కప్పించుకునేందుకు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు. మొదటిసారి ఫిజికల్‌ వెరిఫికేషన్‌ చేయకుండా అభ్యర్థులను ఖరారు చేశారు. అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టి చేతులు దులుపుకున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌లో జాతీయస్థాయి క్రీడాకారులు మాత్రమే స్పోర్ట్స్‌ కోటా టీచర్‌ ఉద్యోగాలకు అర్హులని స్పష్టంగా ప్రకటించినా ఆ నిబంధనలు అతిక్రమించి రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొన్నవారికి ఉద్యోగాలు కట్టబెట్టారు. దీంతో జాతీయ క్రీడాకారులకు అన్యాయం జరగడంతో స్పోర్ట్స్‌ అథారిటీ అధికారులతోపాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ క్రీడాకారుల ఆవేదనను విన్న స్కూల్‌ ఎడ్యుకేషన్‌ సిబ్బంది స్పోర్ట్స్‌ అథారిటీ ఇచ్చిన జాబితా ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చామని చేతులు దులుపుతున్నారు. దీంతో అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో విచారణ చేపట్టిన కోర్టు మొట్టకాయలు వేసింది. దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందిన వారి వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో రాష్ట్ర ప్రభుత్వం రీ వెరిఫికేషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియని ఆసరా చేసుకుని స్పోర్ట్స్‌ అథారిటీ అధికారులు మరిన్ని తప్పులు చేశారు. నిజానికి డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో అభ్యర్థులందరూ వారి అర్హత సర్టిఫికెట్లతోపాటు ఫాం-2, ఫాం-3 ఫాం-4 సర్టిఫికెట్లను సమర్పించారు. జాతీయ స్థాయి క్రీడాకారులు ఫామ్‌-2 సర్టిఫికెట్లు సమర్పిస్తే వారిని కాదని రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొన్న ఫామ్‌-2 సమర్పించిన వారిని అర్హులని స్పోర్ట్స్‌ అథారిటీ నిర్ణయించింది. దీని ఆధారంగా సుమారు 24 మంది అభ్యర్థులు ఉద్యోగాలు పొందారు. ఈ తప్పును కప్పిపుచ్చుకునేందుకు రీ వెరిఫికేషన్‌ ప్రక్రియలో స్పోర్ట్స్‌ అథారిటీ అధికారులు రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొన్న వాళ్లందరినీ ఫాం-2 తీసుకురావాలని సూచించారు. ఉద్యోగావకాశం రావడంతో గతంలో దరఖాస్తు చేసుకున్న సమయంలో ఫాం-2ను సమర్పించని రాష్ట్రస్థాయి క్రీడాకారులందరూ డబ్బులు ఖర్చు పెట్టుకుని ఫాం-2ను ఫిజికల్‌ వెరిఫికేషన్‌ సమయంలో ఇచ్చారు. దీంతో జాతీయ క్రీడాకారులతోపాటు రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొన్న క్రీడాకారులందరూ ఫాం-2 సమర్పించారు కాబట్టి వీళ్లందరూ అర్హులేనని స్పోర్ట్స్‌ అథారిటీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌కు జాబితాను పంపింది. ఈ వివరాలను గమనించిన స్కూల్‌ ఎడ్యుకేషనల్‌ అధికారులు తలలు పట్టుకున్నారు. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా టీచర్ల నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఫాం-2కు అర్హుడు కాకుండా ఫాం-3 వారు ఇప్పుడు ఫాం-2కి ఎలా అర్హులయ్యారని స్పోర్ట్స్‌ అథారిటీ అధికారులను నిలదీశారు. ఇక్కడ పడిన చిక్కుబడి ఇప్పటివరకు వీడలేదు. పైగా కిందిస్థాయి సిబ్బంది ఏమి చెబితే స్పోర్ట్స్‌ అథారిటీ వీసీ, ఎండి దాన్నే సమర్థించడం స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న అంశం కాకుండా కొత్త అంశాన్ని తీసుకురావడంతో లీగల్‌ సమస్యలు వస్తాయని స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అధికారులు స్పోర్ట్స్‌ అథారిటీ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. దీంతో మూడోసారి రీ వెరిఫికేషన్‌ జరిగింది. ప్రభుత్వ పెద్దలు ఈ రీవేరిఫికేషన్‌ ప్రక్రియలు త్వరగా పూర్తిచేయాలని ఒత్తిడి చేసినా కూడా సుమారు ఏడు నెలల పాటు పెండిరగ్‌లో పెట్టి చివరికి గతంలో ఇచ్చిన లిస్టునే మళ్లీ పంపారు. జీఏడి, స్పోర్ట్స్‌ అథారిటీ, లీగల్‌ సెల్‌, స్కూల్‌ ఎడ్యుకేషన్‌.. ఇలా అన్ని విభాగాల వారు కూర్చుని చర్చించినా కూడా స్పోర్ట్స్‌ అథారిటీ అధికారులు చేసిన తప్పునే మళ్లీ చేశారు. జాతీయ క్రీడాకారుల లిస్టుతోపాటు రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొన్న వారి వివరాలతో 95మంది ఉద్యోగాలకు అర్హులేనంటూ లిస్టును పంపడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది.

క్రీడల శాఖ మంత్రి ఆగ్రహం

దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందిన వారి వివరాలను ఎక్కడా వెల్లడిరచకపోవడంతో వారితో కుమ్మక్కైన వ్యవహారం బయటకు రావడంలేదు. ఇది దొంగ సర్టిఫికెట్‌.. వాటిని పరిశీలించండి అంటూ క్రీడా సంఘాలు సమర్పించిన లేఖలను సైతం స్పోర్ట్స్‌ అథారిటీ సిబ్బంది పరిగణనలోకి తీసుకోకుండా దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందిన వారిని కాపాడే యత్నం చేయడంతో రీ వెరిఫికేషన్‌ ప్రక్రియల్లో అక్రమాలు జరిగాయనే నిర్ధారణకు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అధికారులు వచ్చారు. ఇదే విషయాన్ని మరోసారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఉన్నతాధికారులు ఈ విషయాన్ని క్రీడల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌, వీసీ, ఎండీలతోపాటు సిబ్బందితో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. గతంలో ఫాం-3, ఫాం-4 సమర్పించిన వారు ఇప్పుడు ఎలా ఫాం- 2కి అర్హులయ్యారు? నిజానికి అప్పుడే వాళ్ళు ఫాం-2కి అర్హత అయ్యుంటే ప్రభుత్వ ఉద్యోగం కోసం వారు దాన్ని ఎందుకు సమర్పించుకోలేకపోయారు? ఉద్యోగావకాశాలను ఎందుకు కోల్పోతారు? ఇప్పుడు ఫాం-2కి వారు ఎలా అర్హత సాధించారని అధికారులను నిలదీసినట్లు తెలిసింది. ఫాం-2 మళ్లీ తీసుకోవాలని అవకాశం ఇవ్వడానికి గల కారణాలేంటంటూ వారిని ప్రశ్నించినట్లు సమాచారం. దరఖాస్తులో పెట్టిన వారిని పరిగణనలోకి తీసుకోకుండా ఫాం-2 తీసుకురమ్మని ఎలా మీరు సూచించారు.. వారి దగ్గర నుంచి నేరుగా ఫాం-2ను ఎలా తీసుకున్నారని నిలదీసినట్లు సమాచారం. అక్రమార్కుల బండారాన్ని బయటపెట్టాల్సిన స్పోర్ట్స్‌ అథారిటీ అధికారులు ఎందుకు వారిని కాపాడే యత్నం చేస్తున్నారని, అన్ని వివరాలు కావాలని గట్టిగా అడిగినట్లు తెలుస్తోంది. ఒకవేళ తప్పు చేయకపోతే నిబంధనల మేరకే అయితే స్కూల్‌ ఎడ్యుకేషన్‌ వారు ఎందుకు దీన్ని ఆపుతున్నారు.. స్పోర్ట్స్‌ అథారిటీ సక్రమంగా చేస్తే లీగల్‌ సెల్‌ దీనికి అభ్యంతరం ఎందుకు వ్యక్తం చేస్తుంది.. నోటిఫికేషన్‌ ప్రకారం వెరిఫికేషన్‌ ప్రక్రియ ఉండాలి.. కానీ సొంత నిర్ణయాలతో ప్రభుత్వాన్ని అభాసుపాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట. సమస్య వెంటనే పరిష్కారమయ్యేలా ఫైల్‌ని మార్చి పంపాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగం చేస్తున్నవారు వారి ఉద్యోగాన్ని కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున పైరవీలు మొదలు పెట్టారని పలువురు ఆరోపిస్తున్నారు. మొదట జరిగిన చిన్న తప్పును సాకుగా చూపిస్తూ స్పోర్ట్స్‌ అథారిటీ అధికారులు క్యాష్‌ చేసుకునే పనిలో ఉన్నారు. బేర సారాలతో అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టిన స్పోర్ట్స్‌ అథారిటీ ఈ వ్యవహారం బయటపడకుండా ఉండేందుకు సమస్యను తప్పుదారి పట్టిస్తున్నదని స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అధికారులు వాపోతున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *