- సాంప్రదాయం – ఆధునికత మధ్య బతుకమ్మ
- బతుకమ్మ : సాంప్రదాయం నుంచి సంబురాల వైపు – మార్పుల విశ్లేషణ
- రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, కాలమిస్ట్…9440595494
బతుకమ్మ తెలంగాణ స్త్రీల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన పండుగ. ఇది కేవలం పూల పండుగ మాత్రమే కాదు, ప్రకృతిని ఆరాధించే సాంప్రదాయం, పంటలకు నమస్కారం, స్త్రీ శక్తికి వందనం. భాద్రపద అమావాస్య నుంచి తొమ్మిది రోజులపాటు సాగి దసరా నాడు ముగిసే ఈ పండుగలో స్థానిక పూలతో అలంకరించిన బతుకమ్మను స్త్రీలు గుంపులుగా చేరి ఆడుతూ పాడుతూ పూజిస్తారు. గునుగు, తంగిడి, గోరింట, చామంతి, బంతి వంటి ప్రకృతి సిద్ధమైన వన పుష్పాలు, పసుపు, కుంకుమ, గోరింటాకులు అన్నీ జీవన చక్రానికి ప్రతీకలు.
బతుకమ్మ అంటేనే ‘బతుకు అమ్మ’, అంటే ఆరోగ్యం, ఆయుష్షు, కుటుంబ సుఖ సంతోషాల కోసం ప్రార్థించే స్త్రీ శక్తి రూపం. కానీ కాలానుగుణంగా బతుకమ్మ కూడా మార్పులను అనుభవించింది. 2001 తర్వాత ఊపందుకున్న తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో బతుకమ్మ ఒక ప్రతిఘటన వేదికగా నిలిచింది. మహిళలు జై తెలంగాణ నినాదాలతో బతుకమ్మ ఊరేగింపులు నిర్వహించారు. 2010-11లో ఉద్యమం ఉద్ధృతమైనప్పుడు అసెంబ్లీ ముందు, ట్యాంక్ బండ్‌పై, విశ్వ విద్యాలయాల్లో బతుకమ్మలు పెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై, మహిళా సమస్యలపై కూడా బతుకమ్మను నిరసన సాధనగా వినియోగించారు. అలా బతుకమ్మ ఒకవైపు ఆచారం అయితే మరోవైపు ప్రతిఘటనకు ప్రతీక అయింది.
ఆధునిక కాలంలో విద్యాసంస్థల్లో ముందస్తుగా బతుకమ్మ సంబురాలు జరిపే అలవాటు ఏర్పడింది. సెలవుల కారణంగా పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు ముందుగానే బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నాయి. ఇది విద్యార్థుల పాల్గొనుటకు సులభత కలిగిస్తున్నా అసలు వాతావరణం, పూల సేకరణ, పొలాల దగ్గర గుంటల్లో బతుకమ్మ వదిలే ఆచారం అనుభవంలోకి రావడం లేదు. పిల్లలు పుస్తకాలలో రాసుకున్న పాటలు పాడుతారు కాని అసలు సమిష్టి గానం, పల్లె గీతాల మాధుర్యం ఆ అనుభవంలో ఉండదు.

మరోవైపు బతుకమ్మ పండుగ కేవలం గృహాల పరిమితిలోనూ, గ్రామాల గుంపులలోనూ కాకుండా, ఉద్యమ వేదికల మీద నిరసన రూపంలో కూడా నిలిచింది.
పట్టణాల్లో బతుకమ్మ ఆధునికతతో కొత్తరంగులు దాల్చింది. డిజే సౌండ్స్, సినిమా పాటలు, రీమిక్స్ బీట్లు సంప్రదాయ బతుకమ్మ పాటల స్థానాన్ని దక్కించు కుంటున్నాయి. గుజరాత్ దాండీయా, కోలాటాలు కూడా బతుకమ్మ సంబురాల్లో కలుస్తున్నాయి. పెద్ద మైదానాల్లో స్టేజ్ ప్రోగ్రామ్‌లు, లైట్లు, మైకులు, రికార్డులు ఈ పండుగను ప్రదర్శనాత్మక ఈవెంట్‌గా మార్చేశాయి. ముఖ్యంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ బతుకమ్మ సంబురాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించ బడుతూ రాష్ట్ర గుర్తింపుగా నిలుస్తున్నాయి. లక్షలాది మహిళలు చేరే ఈ ఉత్సవం తెలంగాణను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసింది. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, గల్ఫ్ వంటి దేశాల్లో ప్రవాస తెలుగు మహిళలు కూడా బతుకమ్మ సంబురాలను నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా డిజే మ్యూజిక్, లైట్లు చేరినా బతుకమ్మ తెలంగాణ గుర్తింపును నిలబెట్టే ప్రయత్నమే అవుతోంది. కాని ఈ మార్పులు సంప్రదాయాన్ని మసక బారుస్తున్నా యనేది వాస్తవం.
మరోవైపు గ్రామీణ తెలంగాణలో ఇప్పటికీ పంటల బతుకమ్మ, వనాల బతుకమ్మ, బావుల దగ్గర వదిలే ఆచారం యథా తథంగా కొనసాగుతోంది. అక్కడ పూల సువాసనలు, బతుకమ్మ పాటల మాధుర్యం, స్త్రీల సమూహ గానం అసలు పండుగలోని ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తాయి. కానీ పట్టణాల్లో కాంతులు, శబ్దాలు, మైకులు సంప్రదాయ శాంతతను కోల్పోయేలా చేస్తున్నాయి. బతుకమ్మలో ఈ మార్పులకు కారణాలు అనేకం. పట్టణీకరణ వల్ల స్థానిక పూల కొరత, వేదికల కొరత ఏర్పడింది. మీడియా, సోషల్ మీడియా ప్రభావం వల్ల బతుకమ్మను ఎంటర్టైన్మెంట్గా చూపుతున్నారు.
రాజకీయ పార్టీలు తమ ఇమేజ్ బిల్డింగ్ కోసం బతుకమ్మను వినియోగిస్తున్నాయి. యువత డిజే కల్చర్, మోడ్రన్ మ్యూజిక్‌కి ప్రాధాన్యం ఇస్తుంది. ప్రభుత్వం అధికారిక ఉత్సవాలు నిర్వహించటం వల్ల అసలు పల్లె ఆచారాలు మరుగున పడే ప్రమాదం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన ట్యాంక్ బండ్ బతుకమ్మ సంబురం గ్లోబల్ దృష్టి ఆకర్షించింది. బతుకమ్మ ఇలా ఒకవైపు ఉద్యమాలకు బలం ఇచ్చింది, మరోవైపు సంబురాలకు కొత్త రూపం ఇచ్చింది. కానీ ఈ పండుగ తన అసలు స్వరూపాన్ని కోల్పోకుండా ఉండాలంటే మూలాలను మరువ కుండడం అవసరం. స్థానిక పూలను కాపాడడం, సంప్రదాయ పాటలను ప్రోత్సహించడం, గ్రామీణ ఆచారాలను కొనసాగించడం, ఆధునికతతో పాటు సంప్రదాయాన్ని నిలబెట్టడం అత్యవసరం.
బతుకమ్మ రోడ్డెక్కి ఉద్యమాలకు బలం ఇచ్చింది, సంబురాలకు కొత్త రూపం ఇచ్చింది. కానీ భవిష్యత్తులో బతుకమ్మను తెలంగాణ సాంస్కృతిక వారసత్వంగా నిలబెట్టాలంటే ‘మూలాలను గుర్తు చేసుకుంటూ, ఆచరణ సాధ్యం చేయడం అనివార్యం. బతుకమ్మ తెలంగాణ స్త్రీల గర్వకారణం, ప్రకృతికి కృతజ్ఞత, పంటలకు నమస్కారం. అందుకే బతుకమ్మను భవిష్యత్ తరాలకు సరైన రూపంలో అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. బతుకమ్మను భవిష్యత్ తరాలకు సరైన రూపంలో అందించాలంటే…బతుకమ్మ సాంప్రదాయ జానపద పాటలను ప్రోత్సహించడం, స్థానిక పూలను కాపాడటం, వాడడం, పల్లె ఆచారాలను కొనసాగించడం, ఆధునికతతో పాటు సాంప్రదాయాన్ని నిలబెట్టడం అవసరం, అనివార్యం.





