– యువ కళాకారులు ప్రతిభను చాటండి
– సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఆధ్వర్యంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిర్వహిస్తున్న బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ బ్రోచర్, పోస్టర్లను రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కళారూపాలు, ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై వీడియోలను రూపొందించి యువ కళాకారులు తమలోని సృజనాత్మకతను ప్రపంచానికి చాటే ఈ మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పోటీలో పాల్గొని బహుమతులు గెలుచుకోవాలని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజును మంత్రి అభినందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళేందుకు, యువ కళాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు ఈ పోటీ సరైన వేదిక కానుందని పేర్కొన్నారు. బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ పోటీ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమం (మహిళలకు ఉచిత బస్సు, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ తదితరాలు), తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలపై షార్ట్ ఫిలిమ్స్, పాటల పోటీలు ఉంటాయి. షార్ట్ ఫిలిమ్స్ నిడివి 3 నిమిషాలకు, పాటల వ్యవధి 5 నిమిషాలకు మించి ఉండకూడదు.
పోటీలకు సంబంధించిన అర్హతలు:
పోటీలో పాల్గొనే వారందరూ 40 ఏళ్ళ లోపు వయసు కలిగి ఉండాలి. 4కె రిజల్యూషన్ కలిగి ఉండాలి. షార్ట్ ఫిల్మ్స్/ వీడియో సాంగ్స్ ఏవైనా ఈ పోటీలలో సూచించిన థీమ్లపైనే ఉండాలి. మీరు చేసిన వీడియోలు గతంలో ఎక్కడా ప్రదర్శించి ఉండకూడదు. బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ కోసమే చిత్రీకరించినవై ఉండాలి. పోటీల్లో ఎంపికైన థీమ్స్కు ప్రథమ బహుమతి రూ.3 లక్షలు, ద్వితీయ బహుమతి రూ.2 లక్షలు,
తృతీయ బహుమతి రూ.లక్ష, కన్సొలేషన్ బహుమతి రూ.20 వేలు (అయిదుగురికి) ఇవ్వడంతోపాటు విజేతలందరికీ ప్రశంసా పత్రం, జ్ఞాపిక ప్రదానం చేస్తారు. నిర్దేశిత గడువులోగా వచ్చిన ఎంట్రీలను నిపుణులతో కూడిన జ్యూరీ వీక్షించి వివిధ కేటగిరీలలో ఎంపికలు పూర్తి చేస్తుంది. ఎంట్రీలను youngfilmmakerschallenge@gmail.comకు లేదా వాట్సాప్ నెంబర్ 8125834009కు పంపాలి. ఎంట్రీలను పంపించేందుకు తుది గడువు సెప్టెంబరు 30.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





