అండర్‌గ్రౌండ్‌ కేబులింగ్‌పై అధ్యయనం చేయాలి

~ ముందుగా గ్రేటర్‌లో సబ్‌ స్టేషన్లు అప్‌గ్రేడ్‌ చేయాలి
– మూడో డిస్కంపై పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించాలి
– ఇంధన శాఖపై సీఎం రేవంత్‌ సమీక్ష

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 16: గ్రేటర్‌ హైదరాబాద్‌లో అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ కేబులింగ్‌కు ముందుగా కోర్‌ అర్బన్‌ రీజియన్‌లో విద్యుత్‌ సబ్‌ స్టేషన్లను అప్‌గ్రేడ్‌ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో మూడో డిస్కం ఏర్పాటు ప్రతిపాదనల నేపథ్యంలో దానిపై ఇంధన శాఖ రూపొందించిన ప్రాథమిక ప్రణాళికపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓవర్‌ లోడ్‌ సమస్య తలెత్తకుండా లోడ్‌ రీప్లేస్‌మెంట్‌ చర్యలు చేపట్టాలన్నారు. సబ్‌ స్టేషన్‌ సామర్థ్యం కంటే ఒక్క కనెక్షన్‌ కూడా ఎక్కువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైనచోట సబ్‌ స్టేషన్‌ సామర్థ్యాన్ని పెంచుకోవాలని సీఎం సూచించారు. కోర్‌ అర్బన్‌ రీజియన్‌లో ఎక్కడెక్కడ కొత్త విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల అవసరం ఉందో గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అర్బన్‌ ఏరియాలలో విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లలో అధునాతన సాంకేతికను ఉపయోగించాలని, విద్యుత్‌ కేబుల్స్‌తో పాటు ఇతర కేబుల్స్‌ కూడా అండర్‌ గ్రౌండ్‌ కేబులింగ్‌ వ్యవస్థను ఉపయోగించుకునేందుకు వీలుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచనలు చేశారు. బెంగుళూరుతోపాటు ఇతర రాష్ట్రాలలో అండర్‌ గ్రౌండ్‌ కేబులింగ్‌ ప్రాజెక్టులను అధ్యయనం చేయాలని, డిసెంబరులోగా అండర్‌ గ్రౌండ్‌ కేబులింగ్‌ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. వచ్చే రెండున్నరేళ్లలో కోర్‌ అర్బన్‌ రీజియన్‌లో అండర్‌ గ్రౌండ్‌ కేబులింగ్‌ పూర్తి చేయాలని కూడా ఆదేశించారు.
వ్యవసాయం, మేజర్‌, మైనర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌, గ్రామీణ మంచినీటి సరఫరా, జీహెచ్‌ఎంసీ పరిధిలో మంచినీటి సరఫరాకు సంబంధించిన విద్యుత్‌ వినియోగాన్ని కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రస్తుతం ఉన్న రెండు డిస్కంలను మూడు డిస్కంలుగా పునర్విభజన చేయాలని, మూడవ డిస్కంకు సంబంధించి పీపీఏ అలొకేషన్‌, సిబ్బంది విభజన, ఆస్తుల విభజన, బకాయిలు, ఇతర అంశాలపై ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు. కేబినెట్‌ ఆమోదం అనంతరం కొత్త డిస్కం ఏర్పాటుపై ముందుకెళ్లాలని, ఇందుకు వీలైనంత త్వరగా కొత్త డిస్కం ఏర్పాటుకు సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇంధన శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్‌ మిట్టల్‌, సీఎం స్పెషల్‌ సెక్రటరీ అజిత్‌ రెడ్డి, జెన్‌కో సీఎండీ హరీష్‌, సింగరేణి సీఎండీ బలరాం, ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌, ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌ రెడ్డి, రెడ్‌కో చైర్మన్‌ శరత్‌, ఉన్నతాధికారులు హాజరయ్యారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *