– కేంద్ర కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రాకు తుమ్మల వినతి
న్యూదిల్లీ,సెప్టెంబర్ 15: రాష్ట్ర అవసరాలకు సరిపడ యూరియా వీలైనంత త్వరగా కేటాయించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు న్యూదిల్లీలో కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రాని కలిసి కోరినట్లు వెల్లడించారు. దేశీయ యూరియా ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేనందున విదేశాల నుండి దిగుమతి అయ్యే యూరియాలో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని కార్యదర్శి తెలిపారు. దిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ రైతులకు సరిపడ యూరియాను ఈ పది రోజుల్లో సరఫరా చేయాలని, వివిధ కారణాలతో యూరియా దిగుమతి ఆశించిన స్థాయిలో లేదని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘ప్రస్తుతం రాష్ట్రంలో సాగులో ఉన్న వరి, మొక్కజొన్న, పత్తి వంటి ప్రధాన పంటలకు యూరియా అత్యవసరం. ముఖ్యంగా ఈ 15 రోజులు వ్యవసాయ సీజన్లో కీలకమైనవి. ఈ సమయంలో రైతులకు ఎరువులు అందుబాటులో లేకపోతే పంటలు తీవ్రంగా దెబ్బతింటాయి. అందువల్ల యూరియా సరఫరా నిరంతరంగా కొనసాగేలా చూడాలని కేంద్రాన్ని కోరాం’ అని తెలిపారు. అలాగే అంతకుముందు నెలల్లో ఏర్పడిన యూరియా లోటును పూడ్చే విధంగా ఈ నెలలో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని కోరామని చెప్పారు. రానున్న పది రోజుల్లో మరో లక్ష మెట్రిక్ టన్నులు సరఫరా చేయాలని కోరగా ఈ వారంలో 80 వేల మెట్రిక్ టన్నులను సరఫరా చేస్తామని రజత్ కుమార్ మిశ్రా చెప్పారన్నారు. ఓడల ద్వారా 40 వేల మెట్రిక్ టన్నులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసిందని మంత్రి అన్నారు. ఈ యూరియా త్వరలోనే రాష్ట్రానికి చేరుకుంటుందని, దీంతో రైతుల కష్టాలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో సెప్టెంబర్ మొదటి 15 రోజులలోనే 1,04,000 మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి సరఫరా చేసినట్లు అవుతుందని మంత్రి వివరించారు. మిగతా మొత్తం కూడా పంపించడానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని మంత్రి చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




