“అసలు పాకిస్తాన్ జట్టుతో ఆడటం ఎంతమాత్రం నైతికం కాదనే స్థాయి నుంచి, భారత జట్టు ప్రదర్శించిన ఆధిపత్యం, సాధించిన విజయం ఒక జాతీయస్థాయి సెంటిమెంట్ దశకు చేరుకోవడం తాజా పరిణామం. ఫలితంగా బీజేపీ నాయకత్వం ఈ విజయాన్ని దేశభక్తితో, ప్రజల సెంటిమెంట్‌ను, టీమ్‌ను ముడిపెట్టి మరింత ముందుకెళుతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అంతేకాదు ఈ ఆటను కేవలం ఆటకోసం కాకుండా దేశం కోసం ఆడారన్న ప్రచారాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించగలదు..”
క్రీడలు కూడా కొన్ని సందర్భాల్లో రాజకీయ అస్త్రంగా మారుతాయన్న సత్యాన్ని వర్తమాన రాజకీయాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. ఎంతో జాగ్రత్తగా నిర్మించిన చిత్రాల్లో కూడా కథాకథన శైలి విరుద్ధంగా కొనసాగినప్పుడు వీక్షకులను అది గందరగోళానికి గురిచేస్తుంది. ఇందుకు గొప్ప ఉదాహరణ 2015లో విడుదలైన అమెరికన్ చిత్రం “సిండ్రిల్లా “. (1950 డిస్నీ సంస్థ దీన్ని యానిమేషన్ చిత్రంగా విడుదల చేయగా, 2015లో ఒక రొమాంటిక్ ఫ్యాంటసీ చిత్రంగా రీమేక్ చేసారు.) ఇందులో ఫెయిరీ గాడ్‌మదర్ తన ఇంద్రజాలంతో సిండ్రిల్లాకు ఒక గుర్రాలు పూనిన శకటంతోపాటు, అద్భుతమైన ఒక గౌను, కాళ్లకు వేసుకోవడానికి ఒక గ్లాస్ చెప్పులను ఇస్తుంది. అయితే ఇవన్నీ సరిగ్గా అర్థరాత్రి సమయానికి మాయమైపోతాయని, ఇచ్చే ముందే ఫెయిరీ గాడ్‌మదర్ స్పష్టం చేస్తుంది.
విచిత్రమేమంటే రాకుమారుడు తన భార్యను ఎన్నుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశంలోని అందరు కన్యలతో పాటు పాల్గొన్న సిండ్రిల్లా, అర్థరాత్రి సమయం కావడంతో అక్కడినుంచి వేగంగా నిష్క్రమించే క్రమంలో ఎడమ కాలు గ్లాస్ చెప్పు ఊడిపోతుంది. ఇక్కడ విచిత్రమేమంటే ఫెయిరీ గాడ్‌మదర్ హెచ్చరిక ప్రకారం సిండ్రిల్లాకు ఇచ్చిన అన్నీ మాయమైపోతాయి కానీ, కాలి చెప్పు అలాగే ఉండిపోతుంది. ఈ లాజిక్ వీక్షకుడికి అర్థంకాదు. కానీ కథ నడవాలంటే ఈ ట్విస్ట్ అవసరం. దీనిపైనే మిగిలిన కథ ఆధారపడుతుంది. ఈ లాజిక్కును పట్టించకోకుండా ఉంటేనే వీక్షకుడు సినిమాను ఎంజాయ్ చేయగలుగుతాడు. ఎందుకంటే రాకుమారుడు సిండ్రిల్లాను గుర్తుపట్టేది కేవలం ఈ చెప్పు ద్వారానే!
ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే ప్రస్తుతం ఆసియా క్రికెట్ కప్ పోటీల్లో, పాకిస్తాన్ జట్టుతో భారత్ జట్టు తలపపడటంపై సర్వత్రా వ్యక్తమైన వ్యతిరేకత, ఆగ్రహావేశాలు సరిగ్గా ఈ సినిమాలోని సన్నివేశాలను పోలివుండటాన్ని గుర్తించడంవల్ల! పహల్గాం దాడి బాధితులకు ఈ ఆటకు సంబంధం ఉన్నదా లేదా అన్న లాజిక్ ఇక్కడ పనిచేయదు! ఆసియా కప్‌లో భారత్ జట్టు, పాక్ జట్టుతో ఆడటంపై మన విపక్షాలు, పహల్గామ్ దాడి బాధిత కుటుంబాలు ముక్తకంఠంతో తమ నిరసనను తెలియజేశాయి. అయితే ఈ క్రీడకు, పహల్గామ్ దాడికి ఏమిటి సంబంధమన్న ప్రశ్నను వారు ఎంతమాత్రం పట్టించుకోలేదు! తటస్థ పరిశీలకులు, ఔత్సాహిక క్రీడాభిమానులు మాత్రం, భౌగోళిక రాజకీయాలను ఈవిధంగా ఆటలకు ముడిపెట్టడంలో ఔచిత్యమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రెండు అంశాల మధ్య ఉన్న తేడాను విస్మరించడమే ఇటువంటి అహేతుక నిరసనలకు కారణమనేది వారు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. ఒకపక్క బీసీసీఐ, మరోపక్క భారత ప్రభుత్వం ఈ క్రీడా ఈవెంట్‌లో, ఇరుదేశాల జట్లమధ్య పోటీ ఒక అనివార్య భాగమని చెబుతున్నప్పటికీ, విపక్షాలు, పహల్గాం బాధిత కుటుంబాలు ఎంతమాత్రం ఖాతరు చేయలేదు. పహల్గాం దాడిలో త్యాగాలు చేసి అమరులైన వారి ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా? అంటూ వారు ప్రశ్నించడం గమనార్హం. ఇక విపక్షాలైతే రక్తం, క్రికెట్ కలిసి ముందుకెళ్లడం ఎలా సాధ్యం? ట్రంప్, డబ్బుకు ప్రభుత్వం లొంగిపోయిందా? అని ప్రశ్నించాయి. ఇక బాధిత కుటుంబాల వారైతే, దాడి తీవ్రతను, తదనంతర పరిణామాలను ప్రభుత్వం, బీసీసీఐలు మరచిపోయాయంటూ విరుచుకు పడ్డారు.
పహల్గాం దాడి బాధిత కుటుంబాల్లో వ్యక్తమవుతున్నా ఆవేదనను వారి కోణంలో అర్థం చేసుకోవచ్చు. మరి విపక్షాలకేమయింది? క్రికెట్‌కు, పహల్గాం దాడికి లింక్ పెట్టే వీరి వెకిలి రాజకీయం వివేకంతో కూడినదంటే ఎవ్వరూ అంగీకరించరు. క్రికెట్‌ను, రాజకీయాలతో ముడిపెట్టం ద్వారా ఎంతోకొంత లబ్డి పొందవచ్చునని భావించిన విపక్షాలకు చివరకు తాము తీసుకున్న గోతిలో తామే పడ్డామన్న సత్యం బోధకు వచ్చింది. సంక్లిష్టమైన రాజకీయ జిత్తులతో క్రీడలను, రాజకీయాలతో ముడిపెట్టాలనుకునే వ్యూహం ఘోర తప్పిదమని వాటికి తెలిసొచ్చుండాలి. ఎందుకంటే ఈ పోటీలో భారత్ జట్లు పాకిస్తాన్ జట్టుపై ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. పాకిస్తాన్‌పై అద్భుతమైన ఆధిపత్యాన్ని మనదేశం సాధించిందన్న సంగతిని క్రీడారంగ నిపుణులు స్పష్టం చేశారు. ఇదే సమయంలో భారత క్రికెట్ కెప్టెన్, ఈ ఘనవిజయాన్ని ఆపరేషన్ సింధూర్‌లో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన సైనిక దళాలకు అంకితమని చెప్పడమే కాకుండా, పహల్గామ్ దాడిలో బాధిత కుటుంబాలకు తమ సంఘీబావాన్ని ప్రకటించారు. ఈవిధంగా క్రీడా రంగ నిపుణులు, క్రికెట్ కెప్టెన్ చేసిన వ్యాఖ్యలు, ఒక క్రీడా ఈవెంట్ శక్తివంతమైన రాజకీయ ప్రకటనగా పనిచేస్తుందనేది, ఒక ఆటలో విజయం రాజకీయంగా ఎంత ప్రభావశీలతను కలిగివుంటుందనేది చాలా స్పష్టంగా తెలియజెప్పాయి.
అంతకుముందు విపక్షాలు ఆట ప్రవృత్తిని ఎంతమాత్రం అర్థం చేసుకోకుండా, అన్ని అంశాలను పెడచెవిన పెట్టి అడ్డదిడ్డంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వాటినే శూలంలా పొడుస్తున్నాయి. మొత్తంమీద ఈ విపక్షాలు చేసిన ఈ రాజకీయం, అధికార బీజేపీకి అనుకోని సానుకూలతను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్‌కు గట్టి బుద్ధి చెప్పామంటూ ప్రభుత్వం చెబుతూ వస్తున్న అంశాలు రాజకీయంగా మరింత బలంగా ప్రజల్లోకి వెళ్లడం తథ్యం. అంతేకాదు క్రికెట్‌లో వోడించడం ద్వారా పాకిస్తాన్ కు మరోసారి గట్టిబుద్ధి చెప్పామని దేశ ప్రజలు భావించడం సహజం కూడా! ఈ విజయం బీజేపీకి తాను అనుసరిస్తున్న జాతీయవాదాన్ని మరింత బలీయంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశాన్ని కల్పిస్తోంది. ముఖ్యంగా ఒకవైపు సైనికంగా, క్రీడాపరంగా పాకిస్తాన్‌ను మట్టికరిపించడం, రెండోవైపు అంతర్జాతీయంగా క్రీడా నియమాలను గౌరవిస్తూ, తన కఠినమైన దౌత్యవిధానంతో పాక్‌ను అన్నివైపులనుంచి సమర్థవంతంగా కట్టడి చేస్తున్నామన్న అంశాన్ని భాజపా ప్రభుత్వం ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లగలదు.
ఇదే సమయంలో దేశంలో జాతీయ భావాలను మరింత పటిష్టమైన రీతిలో వ్యాప్తిచేయగలదు కూడా! విచిత్రమేమంటే, అసలు పాకిస్తాన్ జట్టుతో ఆడటం ఎంతమాత్రం నైతికం కాదనే స్థాయినుంచి, భారత జట్టు ప్రదర్శించిన ఆధిపత్యం, సాధించిన విజయం ఒక జాతీయస్థాయి సెంటిమెంట్ దశకు చేరుకోవడం తాజా పరిణామం. ఫలితంగా బీజేపీ నాయకత్వం ఈ విజయాన్ని దేశభక్తితో, ప్రజల సెంటిమెంట్‌ను, టీమ్‌ను ముడిపెట్టి మరింత ముందుకెళుతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అంతేకాదు ఈ ఆటను కేవలం ఆటకోసం కాకుండా దేశం కోసం ఆడారన్న ప్రచారాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించగలదు. ఆటను బాయ్‌కాట్ చేయడం కంటే, క్షేత్రస్థాయిలో పోటీపడి ప్రత్యర్థిని మట్టి కరిపించడం ప్రజల్లో చాలా శక్తివంతమైన ప్రభావశీలతను కలిగిస్తుంది. అందువల్ల పాకిస్తాన్‌తో ఆటను బహిష్కరించాలన్న విపక్షాల వాదం ఎంతమాత్రం వివేచనతో కూడినది కాదని ఇప్పుడు స్పష్టమైంది.
పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడటం, విజయం సాధించడంతో అప్పటివరకు దీన్నొక వివాదంగా మలచాలనుకున్న విపక్షాల ఆలోచనలు తల్లక్రిందులయ్యాయి. క్రికెట్ మ్యాచ్ ఆడటం, విజయం సాధించడం, తర్వాత కెప్టెన్ ప్రకటన ఇవన్నీ ప్రజల హృదయాల్లో బలమైన జాతీయవాదాన్ని, భావోద్వేగాన్ని దృఢంగా నాటాయనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. సైనిక, క్రీడాపరమైన విజయాలను తమ జాతీయవాదాన్ని మరింత వేగంగా బలంగా ప్రజల హృదయాల్లో ఏవిధంగా నాటుకునేలా, విస్తరింపజేసేలా ఎట్లా వుపయోగించుకోవాలో సమర్థవంతమైన బీజేపీ నాయకత్వానికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. శక్తివంతమైన కాంతి కళ్లపై పడినప్పుడు కుందేలు ఏవిధంగా నిశ్చేష్టురాలిగా వుంటుందో, ఇప్పడు విపక్షాలు కూడా సరిగ్గా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి!
– శామ్ సుందర్





