- మణిపూర్‌ను దేశంతో అనుసంధానం చేస్తాం
– రూ.7 వేల కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
– మణిపూర్ అల్లర్ల బాధితులకు పరామర్శ
– శాంతియుత వాతావరణంతోనే అభివృద్ధి సాధ్యం
– రెండేళ్ల తరవాత మణిపూర్‌లో పర్యటించిన ప్రధాని మోదీ
– మోదీ రాకతో భారీగా భద్రతా ఏర్పాట్లు
ఇంఫాల్,సెప్టెంబరు13: మణిపుర్ పేరులోనే మణి ఉందని అది దేశానికే మణి వంటిదని, మణిపుర్ దేశానికి ప్రకృతి ఇచ్చిన బహుమతి అని ప్రధాని మోదీ కొనియాడారు. మణిపుర్ ను వేగంగా ప్రగతి పథంలో పయనింపజేస్తాం అని మణిపుర్ కోసం రూ.7 వేల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. మణిపుర్‌ను దేశంతో అనుసంధానం చేసే ప్రాజెక్టులు చేపడుతున్నామని, రైలు, రోడ్డు మార్గాల కోసం మణిపుర్ కు నిధులు కేటాయిస్తున్నామని అన్నారు. భారీ వర్షాల వల్ల హెలికాప్టర్ లో రావడం సాధ్యపడలేదని నరేంద్ర మోదీ తెలిపారు. రోడ్డు మార్గంలో మణిపుర్ కు వొచ్చానని అన్నారు. చాలాకాం తరవాత మణిపుర్ లో మోదీ పర్యటించారు. మణిపుర్ లో అల్లర్ల బాధితులను పరామర్శించారు. ఇంపాల్, చురాచంద్ పుర్ లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మణిపుర్ లో అల్లర్ల బాధిత కుటుంబాల చిన్నారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మణిపుర్ బహిరంగ సభలో మాట్లాడారు. రోడ్డు మార్గంలో వొచ్చేటప్పుడు తనకు తమరు పలికిన స్వాగతం మర్చిపోలేనని, మువ్వెన్నల జెండాలు చేతబట్టి తనకు ఘనంగా స్వాగతం పలికారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. రూ.8 వేల కోట్లతో జాతీయ రహదారుల పనులు వేగంగా కొనసాగుతున్నాయని, మణిపుర్లో రైల్ కనెక్టివిటీ భారీగా పెంచుతున్నామని మోడి పేర్కొన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతుందని చెప్పారు. ప్రస్తుతం మణిపుర్ చేపడుతున్న ప్రాజెక్టులతో మౌలిక సదుపాయాలు, వైద్యసేవలు మెరుగవుతాయని, ఈశాన్య రాష్ట్రాల్లో దశాబ్దాలుగా అనేక వివాదాలు, ఉద్యమాలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెలకొంటోందని, శాంతి స్థాపన ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడించారు. శాంతి స్థాపన ద్వారా తమ భావితరాల భవిష్యత్తు బావుంటుదని, మణిపుర్ ప్రజల వెంట భారత ప్రభుత్వం ఉందని మోదీ స్పష్టం చేశారు. జాతుల మధ్య ఘర్షణలకు కేంద్రమైన చురాచంద్‌పుర్ జిల్లాకు చేరుకున్నారు. అక్కడ బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. హింసాత్మక ఘటనల వల్ల నిరాశ్రయులైన వారితో మాట్లాడారు. 2023లో ఈ ఘర్షణలు చోటుచేసుకోగా.. రెండేళ్ల తర్వాత మోదీ ఆ రాష్ట్రానికి వెళ్లారు. శరణార్థి శిబిరాల్లో ఉన్న చిన్నారులను పలకరించారు. ఈసందర్భంగా ఆయన చిత్రపటాన్ని ఓ చిన్నారి కానుకగా ఇచ్చింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని వారికి హా ఇచ్చారు. తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ‘మణిపుర్ ప్రకృతి ప్రసాదించిన కానుక. ఈ రాష్ట్ర ప్రజలకు తలవంచి నమస్కరిస్తున్నాను. ఇది సాహసవంతులు పుట్టిన నేల. మణిపుర్ లో కొండలు చాలా అందంగా ఉన్నాయి. పేరులో ఉన్న మణికి అర్థం.. ఈశాన్య రత్నమని. ఈ రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకువస్తాం. ఇలాంటి అందమైన ప్రాంతంలో హింస చెలరేగింది. కొత్త ఉషస్సు ప్రారంభం కానుంది. ప్రజలు శాంతి మార్గాన్ని ఎంచుకున్నారు. శాంతి చర్చలు మొదలయ్యాయి. నేను తో ఉన్నాను. కేంద్రం వెంటే ఉంటుందని హా ఇస్తున్నాను. ఈ రాష్ట్రం శాంతికి చిహ్నంగా మారాలని కోరుకుంటున్నాను అని మోదీ అన్నారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా సభకు వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
మెయిటీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న ప్రతిపాదనపై వచ్చిన వ్యతిరేకత 2023లో మణిపుర్‌ను హింసాత్మకంగా మార్చిన సంగతి తెలిసిందే. వారికి రిజర్వేషన్లు ఇవ్వొద్దని ఆదివాసీ తెగలు డిమాండ్ చేశాయి. మెయిటీలకు రిజర్వేషన్లు దక్కితే వారు తమ అటవీ ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు తమకు రావాల్సిన ఉద్యోగాల్లో వాటా తగ్గిపోతుందని వారు ఆందోళన చెందారు. ఆ నిరసనలకు చురాచంద్‌పుర్ కేంద్రమైంది. రాష్ట్రంలోని పలు అటవీ ప్రాంతాలను రిజర్వ్ ప్రాంతాలుగా ప్రకటించడంతో కొండలపై నివాసమున్నవారు ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీసం పునరావాసం కల్పించ కుండా తమను తరలించడంపై నిరసన వ్యక్తంచేశారు. దీనికితోడు రిజర్వేషన్ల అంశం తెర పైకి రావడంతో నిరసనలు ఘర్షణ రూపం దాల్చాయి. ఆ క్రమంలో అమానవీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. మణిపుర్లో చెలరేగిన అల్లర్లలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా కొన్ని వేల మంది నిరాశ్రయు లయ్యారు. పలువురి ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ హింసపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న బీరెన్‌సింగ్ ఈ ఏడాది తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
జాతుల మధ్య హింస చెలరేగిన రెండు సంవత్సరాల తర్వాత శనివారం వెళ్లారు. ఈ పర్యటన దృష్ట్యా మణిపుర్ ప్రభుత్వం కట్టు-దిట్టమైన భద్రతా ఏర్పాట్లు- చేసింది. మిజోరం, మణిపుర్, అస్సాం, పశ్చిమ బెంగాల్, బిహార్లలో మోదీ పర్యటన సాగనుంది.
దేశాభివృద్ధిలో మిజోరం భాగస్వామ్యం కీలకం
గ్యాంగ్‌టక్: దేశాభివృద్ధిలో మిజోరం భాగస్వామ్యం కీలకమని ప్రధాని మోదీ తెలిపారు. కొండమార్గంలో రైలు మార్గం కష్టతరంలో కూడుకున్నదని, సవాల్‌తో కూడిన నిర్మాణాలు అద్భుతమని కొనియాడారు. మిజోరంలో రూ.9 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. వర్చువల్‌గా అభివృద్ధి పనులను పిఎం మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ రైల్వే లైన్లు భారతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానమవుతాయని, పర్యాటక రంగంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉందని తెలియజేశారు. ఏ రాష్ట్రాభివృద్ధికైనా రోడ్డు, రైల్వే, పోరు కనెక్టివిటీ ముఖ్యమని స్పష్టం చేశారు. మిజోరం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, వేగవంతమైన దేశాభివృద్ధిలో మిజోరం యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మిజోరంలో రవాణా సౌకర్యాలు పెంచామని, నూతన రైళ్ల ప్రారంభోత్సవంతో రవాణా సౌకర్యాలు మెరుగుపడుతాయని మోదీ వివరించారు. కష్టతరమైన కొండ ప్రాంతాల్లో రైల్వే సౌకర్యం సంతోషకరమైన విషయమన్నారు. ఇంజినీర్ల నైపుణ్యం, కార్మికుల స్ఫూర్తి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని ప్రశంసించారు. కఠినమైన భూభాగంతో అనేక సవాళ్లను అధిగమించి నిర్మాణం పూర్తి చేశారని మోడీ కొనియాడారు.





