నేపాల్ దేశంలో అనూహ్య సంక్షోభం

“అంతర్జాతీయ వేదికలపై కూడా నేపాల్ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. భారతదేశం ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ శాంతియుత పరిష్కారం కోరింది. చైనా సరిహద్దు భద్రత కోసం నేపాల్‌లో స్థిరత్వం అవసరమని స్పష్టం చేసింది. అమెరికా, యూరోపియన్ యూనియన్ నిరసనకారుల స్వేచ్ఛను గౌరవించాలని, బలప్రయోగం ఆపాలని హెచ్చరించాయి. ఐక్యరాజ్యసమితి అవసరమైతే మానవహక్కుల కమిషన్ ద్వారా విచారణ జరిపేందుకు సిద్ధమని ప్రకటించింది. సార్క్ దేశాలు ఈ సంక్షోభం ప్రాంతీయ శాంతి భద్రతపై ప్రభావం చూపకుండా చర్చలు జరపాలని సూచించాయి.”
నేపాల్ చరిత్రలో 239 ఏళ్లపాటు కొనసాగిన రాచరిక పాలన దేశ రాజకీయాలను ఒకే వంశాధిపత్యం కింద కట్టిపడేసింది. ఆ కాలంలో రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య అవకాశాలు లేకపోవడంతో ప్రజల వాణి నిశ్శబ్దంలో నలిగిపోయింది. 2008లో రాజ్యాన్ని అధికారికంగా రద్దు చేసి ప్రజాస్వామ్య గణతంత్రాన్ని ప్రకటించడంతో కొత్త దశ ఆరంభమైనప్పటికీ, గత 27 ఏళ్ల ప్రజాస్వామ్య ప్రయాణం మాత్రం స్థిరత్వాన్ని అందించలేక పోయింది. ప్రధానులు వరుసగా మారిపోవడం, కూటమి ప్రభుత్వాలు కూలిపోవడం, అంతర్గత విభేదాలు పెరగడం ప్రజల్లో తీవ్ర నిరాశను కలిగించాయి. కేవలం రెండు దశాబ్దాల్లోనే 13 కంటే ఎక్కువ ప్రధానులు పదవిలోకి వచ్చి వెళ్లడం రాజకీయ అస్థిరతకు బలమైన సాక్ష్యం.
మావోయిస్టు తిరుగుబాట్లు, వర్గపోరాటాలు, సైన్యపు పాత్రపై అనుమానాలు ఈ సంక్షోభాన్ని మరింత పెంచాయి. ప్రజా ఉద్యమాల సమయంలో సైన్యం కీలక పాత్ర పోషించినప్పటికీ, తాజాగా జరిగిన సంఘటనల్లో ప్రభుత్వ భవనాలు, పార్లమెంట్, జైళ్లపై దాడులు జరుగుతున్నా సైన్యం ప్రేక్షకపాత్రలో మిగిలిపోవడం విశ్లేషకుల సందేహాలకు కారణమైంది. కేవలం 34 గంటల వ్యవధిలో ప్రభుత్వం కూలిపోవడం వెనుక బాహ్య శక్తుల పరోక్ష ప్రమేయం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. గత 27 ఏళ్లలో ప్రభుత్వం 28 సార్లు మారడం ఒక భయానక రాజకీయ అస్థిరతకు ప్రతీక. ప్రజాస్వామ్యం పేరుతో ఏర్పడిన ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోవడం వల్ల రాజకీయ వ్యవస్థపై నమ్మకం క్షీణిస్తోంది.
ఆర్థిక రంగంలోనూ ఈ అస్థిరత తీవ్ర ప్రతికూలతను మిగిల్చింది. స్థూల ఉత్పత్తి పెరుగుదల నిలకడగా కొనసాగక పోవడం, నిరుద్యోగం పెరగడం, లక్షలాదిమంది యువకులు విదేశాలకు వలస వెళ్ళడం సమస్యలను మరింత తీవ్రతరం చేశాయి. పెట్టుబడులు నిలిచిపోవడం, అభివృద్ధి ప్రాజెక్టులు అర్థాంతరంగా ఆగిపోవడం ప్రజలకు మరో భారం అయ్యింది. అంతే కాకుండా నేపాల్ భూభౌగోళిక పరిస్థితి, భారతదేశం – చైనా వ్యూహాత్మక పోటీలు కూడా ఈ సంక్షోభంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇరు దేశాలు తమకు అనుకూలమైన శక్తులను మద్దతు ఇస్తూ నేపాల్ అంతర్గత రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సోషల్ మీడియా వేదికలను నియంత్రించే ప్రయత్నం మరింత భగ్గుమన్నది. సెప్టెంబర్ తొలి వారంలో ప్రభుత్వం 26 సోషల్ మీడియా యాప్‌లను నిషేధించగా, ఇప్పటికే అసంతృప్తితో ఉన్న యువత పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టింది. కాఠ్మాండు సహా అనేక ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. పోలీసులు లాఠీచార్జీలు, టియర్‌గ్యాస్, రబ్బరు బుల్లెట్లు వాడగా నిరసనలు మరింత హింసాత్మక మయ్యాయి. ప్రభుత్వ భవనాలు, జైళ్లపై దాడులు జరిగి, ఖైదీలు తప్పించుకోవడం పరిస్థితిని మరింత కల్లోలంలోకి నెట్టింది. ఈ ఘర్షణల్లో 20 నుండి 30 మంది వరకు ప్రాణాలు కోల్పోగా, 600 నుండి 1000 మందికి పైగా గాయపడ్డారు. వందలాది మంది అరెస్టయి వ్యాపారం, రవాణా, ప్రజా జీవనం పూర్తిగా స్థంభించి పోయింది.
ఈ పరిణామాల మధ్య ప్రధానమంత్రి కె.పీ. శర్మ ఓలి రాజీనామా చేయవలసి వచ్చింది. అలాగే చాలామంది ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయడం, కొందరు నేపాల్ నుంచి క్షణాల్లో తప్పించుకు వెళ్లడం యాదృచ్చికంగా కాక, అనివార్యంగా జరిగాయి. మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సుషీలా కర్కీని మధ్యంతర ప్రధానిగా నియమించాలని ప్రజలు డిమాండ్ చేశారు. పరిస్థితులు అదుపు తప్పడంతో నేపాల్ ఆర్మీ కీలక భవనాల భద్రతను స్వాధీనం చేసుకుని కాఠ్మాండు వీధుల్లో సైనిక గస్తీలు పెంచింది.
ఈ ఉద్యమం కేవలం సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా మాత్రమే కాక, అవినీతికి వ్యతిరేకంగా వ్యవస్థ మార్పు కోసం జరుగుతున్న పోరాటంగా పరిణమించింది. ముఖ్యంగా యువతలో రాజకీయ నాయకత్వం అవినీతిపరమైందన్న భావన బలపడింది. పారదర్శకత లేకపోవడం, ఎన్నికల ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందన్న ఆరోపణలు పెరిగాయి. అందువల్లే ఈ ఉద్యమాన్ని 2006లో జరిగిన “జన ఆందోళన్”తో పోలుస్తున్నారు. ఆ సమయంలో రాజు గ్యానేంద్ర పాలనను ప్రజలు కూలదోయగా, ఇప్పుడు అదే తరం మరోసారి మార్పు కోసం వీధుల్లోకి రావడం చరిత్రాత్మకంగా భావించబడుతోంది.
అంతర్జాతీయ వేదికలపై కూడా నేపాల్ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. భారతదేశం ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ శాంతియుత పరిష్కారం కోరింది. చైనా సరిహద్దు భద్రత కోసం నేపాల్‌లో స్థిరత్వం అవసరమని స్పష్టం చేసింది. అమెరికా, యూరోపియన్ యూనియన్ నిరసనకారుల స్వేచ్ఛను గౌరవించాలని, బలప్రయోగం ఆపాలని హెచ్చరించాయి. ఐక్యరాజ్యసమితి అవసరమైతే మానవహక్కుల కమిషన్ ద్వారా విచారణ జరిపేందుకు సిద్ధమని ప్రకటించింది. సార్క్ దేశాలు ఈ సంక్షోభం ప్రాంతీయ శాంతి భద్రతపై ప్రభావం చూపకుండా చర్చలు జరపాలని సూచించాయి.
భవిష్యత్తులో నేపాల్ ముందున్న సవాళ్లు విస్తారమైనవే. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసి పారదర్శక ఎన్నికలు జరపడం అత్యవసరం. నిరసనల్లో జరిగిన ప్రాణనష్టం, పోలీసు దౌర్జన్యాలపై న్యాయపరమైన విచారణ తప్పనిసరి. యువత అభిప్రాయాలను గౌరవిస్తూ వారిని పాలనా ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం అవసరం. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం, ప్రజల నమ్మకాన్ని తిరిగి సాధించడం కీలకం. ఈ క్రమంలో పొరుగు దేశాలు, అంతర్జాతీయ సమాజం సహకరించాల్సిన అవసరం ఉంది.
ఈ సంక్షోభం నేపాల్‌లో తరాల మార్పుకు సంకేతం. ఇది కేవలం ఒక ప్రభుత్వ పతనం కాదు; ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలనే, అవినీతిని నిర్మూలించాలనే, యువతకు కొత్త భవిష్యత్తును అందించాలనే సామాజిక ఆకాంక్షను ప్రతిబింబిస్తోంది. సైన్యం తాత్కాలిక భద్రతా బాధ్యతలు చేపట్టినా ప్రజాస్వామ్య వ్యవస్థ పునరుద్ధరణే ఈ ఉద్యమానికి తుదిలక్ష్యం. అంతర్జాతీయ సహకారం, ముఖ్యంగా భారతదేశం మద్దతుతో నేపాల్ మరోసారి స్థిరమైన ప్రజాస్వామ్యాన్ని సాధించాలి.
రామ కిష్టయ్య సంగన భట్ల 
సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్…
9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *