– వోటర్ నమోదుపై దాఖలైన కేసు కొట్టివేత
న్యూదిల్లీ,సెప్టెంబర్11: కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీకి దిల్లీ కోర్టులో ఊరట లభించింది. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందే 1980లో వోటర్‌గా రిజిస్టర్ చేసుకున్నారని ఆరోపిస్తూ దిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆమె ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించారని, ఆ వ్యవహరంలో ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 1983లో సోనియాకు భారత పౌరసత్వం వచ్చింది. 1980 నాటి వోటర్ జాబితా అంటూ గత నెల భాజపా నేత అమిత్ మాలవీయ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. గాంధీ కుటుంబ సభ్యులైన ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, మేనకా గాంధీతోపాటు సోనియా పేరును చేర్చారని పేర్కొన్నారు. అప్పటికీ ఆమె ఇంకా ఇటలీ పౌరసత్వం కలిగి ఉన్నారని రాసుకొచ్చారు. అయితే దానిపై విమర్శలు రావడంతో 1982లో వోటర్ జాబితా నుంచి ఆమె పేరు తొలగించారని, 1983లో మళ్లీ కనిపించిందని వెల్లడించారు. అప్పుడు కూడా పౌరసత్వం రావడానికన్నా ముందే మళ్లీ జాబితాలోకి పేరు చేరిందని విమర్శించారు. రాజీవ్‌ను వివాహమాడిన తర్వాత పౌరసత్వం రావడానికి 15 ఏళ్లు ఎందుకు పట్టిందని ఇక్కడ ప్రశ్నించడం లేదు. ముందే వోటర్ జాబితాలో ఆమె పేరు కనిపించడం ఎన్నికల పక్రియ దుర్వినియోగం కాకపోతే ఇంకేంటని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే దాఖలైన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. పిటిషనర్ వికాస్ త్రిపాఠి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది పవన్ నారంగ్ బుధవారం వాదన వినిపించారు. ముందుగా పౌరసత్వ పరిమితిని పూర్తి చేయాలని, తర్వాత వారు ఆ ప్రాంత నివాసి అవుతారని పేర్కొన్నారు. 1980లో రేషన్ కార్డు లేదా పాస్‌పోర్ట్ నివాస పత్రంగా ఉండి ఉంటుందని అన్నారు. ఆమె భారతీయ పౌరురాలైతే 1982లో ఆమె పేరును ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. అప్పుడు ఎన్నికల సంఘం రెండు పేర్లను తొలగించిందని, ఒకటి విమాన ప్రమాదంలో మరణించిన తర్వాత సంజయ్‌గాంధీది, మరొకటి సోనియాగాంధీదని ఆయన అన్నారు. ఎన్నికల సంఘం తప్పును గుర్తించిందని, వోటర్ల జాబితా నుండి ఆమె పేరును తొలగించాలని ప్రయత్నించిందని నారంగ్ అన్నారు. 1980 సెప్టెంబర్ 4న న్యూదిల్లీ నియోజకవర్గం వోటరు జాబితాలో ఆమె చేర్చారని, అనంతరం 1982లో తొలగించారని అన్నారు. భారత పౌరసత్వం పొందిన తర్వాత 1983లో తిరిగి నమోదు జరిగిందన్నారు. 1983లో సోనియా భారత పౌరసత్వం పొందారనే ఆరోపణపై దర్యాప్తు కోసం పోలీసులకు ఆదేశాలివ్వాలని కోరుతూ బిఎన్‌ఎస్ సెక్షన్ 175(4) కింద ఈ పిటిషన్ దాఖలు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





