సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకం

  • గురువులే జాతి నిర్మాతలు
  • కేయూ లా కళాశాల రిటైర్డ్‌ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి

హన్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర : ఉపాధ్యాయులే జాతి నిర్మాతలని, స‌మాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కేయూ లా కళాశాల రిటైర్డ్‌ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ హన్మ‌కొండ (Rotary Club Hanamkonda)  ఆధ్వర్యంలో కిషన్‌పురలోని వాగ్దేవి కళాశాల ఆడిటోరియంలో ఆదివారం క్లబ్ అధ్యక్షులు బేతి రవీందర్ రెడ్డి అధ్యక్షతన ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్ర‌దానోత్స‌వం జ‌రిగింది. ముఖ్యఅతిథిగా విజయలక్ష్మి హాజ‌రై మాట్లాడుతూ తన చిన్ననాటి పాఠశాల స్మృతులను గుర్తు చేసుకుంటూ కష్టపడి చదువుకుంటే భవిష్యత్తులో ఉన్నత స్థితిలో ఉంటామని అన్నారు. ఉపాధ్యాయులకు రోటరీ క్లబ్ ప్ర‌తినిధులు జాతి నిర్మాతలు అనే బిరుదుతో సత్కరించడం చాలా హర్ష‌ణీయ‌మ‌ని అన్నారు.
క్లబ్ అధ్యక్షులు బేతి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, ఉత్తమ ఉపాధ్యాయులను జాతి నిర్మాతలు అనే పేరుతో సత్కరించడం త‌మ‌కు గ‌ర్వంగా ఉంద‌న్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న తీరు అనిర్వచనీయమ‌ని, ఉపాధ్యాయుల కృషితోనే ఎంతో మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలు చేరుతార‌ని తెలిపారు. ఎటువంటి పక్షపాతాలు లేకుండా ప్రతీ విద్యార్థిని తమ లక్ష్యాలను చేరేలా గురువులు ఒక నిచ్చెనలా నిలబడడం, కరిగిపోతున్న కొవ్వొత్తిలా ఉంటూ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతుంటార‌ని చెప్పారు.
రోటరీ క్లబ్ జిల్లా 3150 పూర్వపు గవర్నర్ డాక్టర్ శరత్ బాబు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్ప‌ద‌ని కొనియాడారు. త‌న వ‌ద్ద‌కు కూడా ఒక విద్యార్థి తన పీజీ త‌ర‌గ‌తుల‌ కోసం ఒక నెల ట్రైనింగ్ కోసం వ‌చ్చాడ‌ని, చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఆ అబ్బాయి కనిపించి త‌న శిక్ష‌ణ తీసుకొని ఉన్నత స్థానానికి చేరుకున్న‌ట్లు చెప్పాడ‌ని గుర్తు చేసుకున్నారు. విద్యార్థులు ఎదిగితే గురువుల‌కు అంత‌కు మించిన సంతృప్తి ఉండ‌ద‌ని అన్నారు. తాను కొరియా దేశం వెళ్ళినప్పుడు అక్కడ టీచర్ కు ఇచ్చే విలువ త‌న‌ను ఆశ్చర్యానికి గురిచేసింద‌ని తెలిపారు. అక్కడివారిని అడిగినప్పుడు వారి దేశంలో అందరికంటే ఎక్కువగా టీచర్ల‌కు ఎక్కువ శాలరీ ఉంటుందని, కొన్ని దేశాలలో టీచర్ల‌కు అత్యంత ప్రాధాన్య‌మిస్తారని తెలిపారు.
కార్యక్రమంలో క్లబ్‌ కార్యదర్శి గంగోజుల నరేష్, కోశాధికారి మిరియాల విజయ్ కుమార్, అవార్డ్స్ కమిటీ మెంబెర్స్, దారం శ్రీనివాస్, మాదాల సతీష్ కుమార్, పాశం సంజీవ రెడ్డి, అసిస్టెంట్ గవర్నర్ సందసాని నరేష్, సభ్యులు రాజీ రెడ్డి, ఇంద్రసేన రెడ్డి, రమేష్, సమీర్, శారు ప్రభాకర్ రెడ్డి, హరిప్రసాద్, గోలి రవికుమార్, మంద వేణు, నోముల ప్రసాద్,సత్యప్రకాశ్, కుమారస్వామి, అవార్డు గ్రహీతలు వారి బంధుమిత్రులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *