సిరిసిల్ల ఇంజినీరింగ్ విద్యార్థుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి

– క‌ళాశాల‌కు శాశ్వ‌త భ‌వ‌నాల నిర్మాణం ప్రారంభించాలి
– రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కోరిన వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 6: సిరిసిల్లలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. తమ హయాంలో ప్రారంభించిన ఈ కాలేజీకి అవసరమైన శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టే దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వేములవాడలోని డిగ్రీ కాలేజీలో కొనసాగుతున్న ప్రస్తుత తాత్కాలిక తరగతి గదులకు తాళం వేయడంతో విద్యార్థుల ఇబ్బందులపై పత్రికల్లో వచ్చిన వార్తను ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేటీఆర్ వెంటనే రంగంలోకి దిగారు. జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ కిషన్ కుమార్ రెడ్డి, సాంకేతిక విద్యా కమిషనర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చూడాలని, త్వరగా శాశ్వత భవనాలకు అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించాలని సూచించారు. అంతవరకు ప్రస్తుతం నడుస్తున్న తీరుగానే స్థానిక అగ్రహారంలోని డిగ్రీ కాలేజీ అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే కాలేజీతో అవసరమైన ఒప్పందం చేసుకొని పెండింగ్‌లో వున్న‌ అద్దె బకాయిలను చెల్లించేలా చూడాలని కోరారు. సానుకూలంగా స్పందించిన టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ వెంటనే పెండింగ్ బకాయిలను చెల్లించడంతోపాటు విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కొత్త భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు డిగ్రీ కాలేజీలో తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే, కాలేజీ కమిషనర్ నుంచి తాత్కాలిక వసతి పొడిగింపు ఉత్తర్వులు రానందున డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ తరగతి గదులకు తాళం వేశారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న అంశాన్ని తెలుసుకున్న కేటీఆర్ వెంటనే ఈ అంశంలో తగిన అనుమతులు, ఆదేశాలు స్థానిక డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ కు ఇవ్వాలని సూచించారు. ఈ అంశంలో వందలాది విద్యార్థుల సమస్యలపై వేగంగా స్పందించి ఉన్నతాధికారులతో మాట్లాడిన కేటీఆర్ కు విద్యార్థులు, తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *