గేమ్ ఛేంజ‌ర్‌గా ఖ‌మ్మం-దేవ‌ర‌ప‌ల్లి జాతీయ ర‌హ‌దారి

– వ‌చ్చే ఏడాదికి ఇది ఉప‌యోగంలోకి రావాలి

– మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు

ఖమ్మం టౌన్,  ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6 :  ఖమ్మం-దేవరపల్లి జాతీయ రహదారి భవిష్యత్తులో తెలంగాణ, దక్షిణ భారత దేశానికి గేమ్ చేంజర్ గా మారబోతున్నదని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ధంసలాపురం వద్ద ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను శనివారం తనిఖీ చేశారు. గ్రీన్ ఫీల్డ్ హైవే ఆర్ఓబి, ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ  ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. 160 కి.మీ జాతీయ రహదారి పూర్తి కావడం వల్ల గంటన్నర సమయంలో రాజమండ్రి వెళ్ళవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఇక్కడి వారికి ఈ రోడ్డు ఉపయోగక‌ర‌మ‌న్నారు. ఉత్తర దక్షిణ భారత దేశాన్ని కలిపే రహదారిగా తయారవుతుందని అన్నారు.  రైల్వే ఓవర్ బ్రిడ్జి డిజైన్స్ జాప్యం కావడం వల్ల ఆలస్యం జరిగిందన్నారు. ధంసలాపురం ఆరోఓబి నవంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఆర్.ఓ.బికి సంబంధించి హై టెన్షన్ విద్యుత్ లైన్స్ తరలింపు, భూసేకరణ వంటి అన్ని పనులు పూర్తి చేశామని, నవంబర్ నాటికి ఒకవైపు రైల్వే బ్రిడ్జి పూర్తి చేసుకుంటే సత్తుపల్లి-జంగారెడ్డిగూడెం వరకు ఉపయోగపడుతుందని అన్నారు.
కొత్త సంవత్సరంలో ఖమ్మం-దేవరపల్లి జాతీయ రహదారి పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి రావాలన్నారు. రైల్వే శాఖను సమన్వయం చేసుకుంటూ ఆర్ఓబీ త్వరగా పూర్తి చేయాలన్నారు. రైల్వే, కెనాల్, మున్నేరుపై రహదారి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఖమ్మం నుంచి సత్తుపల్లి వరకు జాతీయ రహదారికి సర్వీస్ రోడ్లు వేస్తే రైతాంగానికి ఉపయోగ పడుతుందని, దీనికి కావలసిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. జాతీయ రహదారికి ఇరువైపులా వ్యవసాయ ప్రాంతం అధికంగా ఉందని, నాగార్జున సాగర్ కాల్వ కింద‌ ఆయకట్టు ఉన్నందున 365 రోజులపాటు హార్వెస్టర్ రాకపోకలు ఉంటాయని,  వాహనాలకు ఆటంకం కలగకుండా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలన్నారు.వర్షాలు తగ్గిన నేపథ్యంలో మున్నేరు బ్రిడ్జ్ తో పాటు ధంసలాపురం ఎగ్జిట్ పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. 3500 కోట్లతో ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి నిర్మిస్తున్నామని అన్నారు. జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి చిన్న సమస్యలు ఉంటే కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలనన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, నేషనల్ హైవే పిడి దివ్య, ఆర్ అండ్ బి ఎస్ఇ యాకోబ్, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు,  కార్పొరేటర్లు, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ సైదులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *