~ రూ.2.32 కోట్లు పలికిన రాజేంద్రనగర్ గణేశ్ లడ్డూ.
– బాలాపూర్ లడ్డూ రూ.35 లక్షలు
– మైహోమ్ భూజాలో రూ.51 లక్షలు
– రూ.99కే 333 కిలోల లడ్డూ దక్కించుకున్న విద్యార్థి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: రాష్ట్రంలో వినాయకుడు అంటే ఖైరతాబాద్ గణేశ్, లడ్డూ అంటే బాలాపూర్ వినాయకుడి ప్రసాదమే ఎవరికైనా గుర్తుకొస్తాయి. అయితే ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలు కూడా లడ్డూ వేలం పాటలతో ప్రధాన ఆకర్షణగా మారుతున్నాయి. పైగా ఈసారి వేలంపాటల్లో అన్నీ రికార్డు బ్రేకులే. మూడు రోజుల క్రితం రాయదుర్గం హై హోం భూజాలో జరిగిన వేలంలో లడ్డూ రూ.51 లక్షలు పలికింది. తరచి చూస్తే ఇలాంటి విశేషాలెన్నో. దశాబ్దాలుగా బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంలో రికార్డు స్థాయిలో ధర పలుకుతూండగా ఈసారి మాత్రం రాజేంద్రనగర్‌లో జరిగిన గణేశుడి లడ్డూ వేలంపాట చరిత్రను తిరగరాసింది. ఏకంగా రూ.2.32 కోట్లకు వేలం పాట పలికి రికార్డుగా నిలిచింది. రాజేంద్రనగర్ పరిధిలోని గణపతి లడ్డూ వేలంపాట ఆల్‌టైం రికార్డుగా నిలిచింది. శుక్రవారం రాత్రి బండ్లగూడ కీర్తి రిచ్మండ్లో జరిగిన వేలంపాటలో పది కేజీల లడ్డూకు రూ.2 కోట్ల 30 లక్షల ధర పలికింది. దీనిని బాల గణేశ్ టీం దక్కించుకుంది. ఇదే విల్లాలో గతేడాది జరిగిన వేలం పాటలో రూ.1.87 కోట్లకు పోయింది. సుమారు రెండున్నర గంటలపాటు వేలం పాట సాగడం గమనార్హం. మొత్తం 80 విల్లాల యజమానులు నాలుగు గ్రూపులుగా విడిపోయి 500కి పైగా బిడ్లతో ఈ వేలంలో పాల్గొన్నారు. 42 ఎన్టీవోలను నిర్వహించే ఆర్.వి.దివ్యా చారిటబుల్ ట్రస్టుకు ఈ డబ్బును విరాళంగా ఇవ్వబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పూర్తిగా వలంటీర్లతో నడిచే ఈ ట్రస్ట్ ద్వారా పదివేల మందికి సాయం అందుతోందన్నారు.
రూ.35 లక్షలకు బాలాపూర్ లడ్డూ
ఈ ఏడాది బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలం పాట ఎంతో ఉత్కంఠగా కొనసాగింది. 21 కిలోల లడ్డూ రూ.35 లక్షల ధర పలికింది. గత ఏడాదికంటే సుమారు రూ.5 లక్షలు ఎక్కువ. కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ గౌడ్ ఈ లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు. గతేడాది రూ.30.01 లక్షలకు బాలాపూర్‌కు చెందిన బీజేపీ రాష్ట్ర నాయకుడు కొలన్ శంకర్ రెడ్డి దక్కించుకున్నారు. గత ఆరేళ్లుగా బాలాపూర్ లడ్డూను దక్కించుకోవాలని చూస్తున్నానని స్వామివారు ఇప్పుడు కరుణించారని దశరథ గౌడ్ పేర్కొన్నారు.
రూ.99కే గణేశ్ లడ్డూ దక్కించుకున్న విద్యార్థి
కొత్తపేటలో శ్రీ ఏకదంత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లడ్డూ కోసం లక్కీ డ్రా నిర్వహించారు. సుమారు 760 టోకెన్లు వియ్రించారు. ఈ లక్కీ డ్రాలో స్థానిక బీబీఏ విద్యార్థి సాక్షిత్ గౌడ్ విజేతగా నిలిచారు. 333 కిలోల లడ్డూని ంకేవలం రూ.99కే దక్కించుకోవడం విశేషం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





