– ఎన్వోసీల జారీలో అలసత్వంపై సీఎం ఆగ్రహం
– ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అనుమతులివ్వాలని ఆదేశం
హైదరాబాద్: బహుళ అంతస్తుల భవనాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి అనుమతుల జారీ విషయంలో జాప్యంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎండీఏ పరిధిలో బిల్డ్ నౌ కింద పనుల అనుమతుల విషయంపై సోమవారం సాయంత్రం సమీక్షించారు. బహుళ అంతస్తుల భవనాలు, గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణం, ఇతర అనుమతుల విషయంలో ఉద్దేశపూర్వకంగా కొందరు అధికారులు అలసత్వం చూపుతున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. అనుమతుల జాప్యంలో ఆలస్యానికి కారకులను గుర్తించి వారిని సరెండర్ చేయాలని హెచ్ఎండీఏ కార్యదర్శి ఇలంబర్తిని ఆదేశించారు. ముఖ్యంగా నీటి పారుదల శాఖ విభాగం అధికారులపై పలు ఆరోపణలు వస్తున్నాయని… వాటిని ఎంతమాత్రం సహించేది లేదని సీఎం హెచ్చరించారు. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులు, నాలాల, ఇతర నీటి వనరులకు సంబంధించి లైడార్ సర్వేను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. సమగ్రమైన వివరాలున్నప్పుడు మాత్రమే వివాదాలకు తావుండదన్నారు. ఈ విషయంలో జీహెచ్ఎంసీ, హైడ్రా, ఇరిగేషన్ అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ త్వరగా అనుమతులు మంజూరు చేయాలని సీఎం హెచ్ఎండీఏ సెక్రటరీని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమీక్షలో హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





