ప్రమాదంలో భారత ఎన్నికల ప్రక్రియ

– ఎన్నికల సంఘం అత్యున్నతమైన వ్యవస్థ-
– నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు
– రాసింది నేనే.. తీర్పు ఇచ్చిన‌ది సుప్రీంకోర్టు : జస్టిస్‌ ‌సుదర్శన్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌1:‌భారతదేశంలో ఎన్నికల పక్రియ ప్రమాదంలో పడబోతోందని ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ ‌సుదర్శన్‌ ‌రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల సంఘం అత్యున్నతమైన వ్యవస్థ అని ఉద్ఘాటించారు. సోమవారం తాజ్‌ ‌కృష్ణాలో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎం‌పీలతో జస్టిస్‌ ‌సుదర్శన్‌ ‌రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సుదర్శన్‌ ‌రెడ్డి మాట్లాడారు. తాను ఇండియా కూటమి అభ్యర్థిని కాదని.. ప్రతిపక్షాల అభ్యర్థినని సుదర్శన్‌ ‌రెడ్డి నొక్కిచెప్పారు. తాను ఏ పార్టీ సభ్యత్వం స్వీకరించనని స్పష్టం చేశారు. తనపై ఏవేవో ముద్రలు వేస్తున్నారని… అస్సలు బాధగా లేదని చెప్పుకొచ్చారు. తనపై విమర్శలు చేస్తే ఉప రాష్ట్రపతి ఎన్నికల పోటీ నుంచి వెనక్కు తగ్గనని తెలిపారు. తనను విమర్శిస్తే ఈ ఎన్నికల పోటీ నుంచి వెనక్కు తగ్గి సైలెంట్‌ అయిపోతానని కొంతమంది అనుకు న్నారని పేర్కొన్నారు. తనను విమర్శించే వారు తాను ఇచ్చిన తీర్పు ఒక్కసారి చదవాలని సూచించారు. కోర్టు తీర్పుల గురించి మాట్లాడేవారు వాటిని చదివి మాట్లాడాలని కోరారు. అది తన తీర్పు కాదని.. కోర్టు తీర్పు అని ఉద్ఘాటించారు. తన తీర్పును 11 మంది న్యాయమూర్తులు చదివారని అందులో ఒక్క విషయాన్ని కూడా మార్చలేకపోయారని సుదర్శన్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. సల్వా జుడంపై తీర్పు సందర్భంగా హోంమంత్రి అమిత్‌ ‌షా చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడారు. రాజ్యాంగ వ్యవస్థలు మసకబారుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిన అవసరముందన్నారు. వోటు వేసే ప్రతి పౌరుడు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాజకీయ అభిప్రాయాన్ని కలిగి ఉంటారని అన్నారు. నేను ప్రతి ఎన్నికల్లో పాల్గొని నా వోటు హక్కు వినియోగించుకున్నాను. పౌరహక్కులు, సామాజిక న్యాయం, ఆదేశిక సూత్రాల గురించి నేను మాట్లాడుతాను. రాజకీయ ముళ్లకిరీటం ఎందుకు నెత్తిన పెట్టుకున్నారని కొందరూ అడుగుతున్నారు. వాళ్లందరికీ రాజ్యాంగాన్ని పట్టుకొని సమాధానం చెబుతున్నాను. ఉప రాష్ట్రపతి పదవి రాజకీయపరమైన పదవి కాదని సుదర్శన్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. ఐదుసార్లు రాజ్యాంగంపై నేను ప్రమాణం చేశాను. రాజ్యాంగానికి లోబడి ఉండటమే కాదు, కాపాడటం నా బాధ్యతని, ఆదేశిక సూత్రాలను పాటించే వ్యక్తిని నేను అని అన్నారు. ఈ దేశంలోని ప్రజలు ముందు వోటర్లు, తర్వాతనే పౌరులు అయ్యారు. వోటరు లిస్ట్ ‌చిత్తు కాగితం అని కొంతమంది అనుకుంటున్నారు. మాకు ఇష్టం ఉన్న వారి పేరు రాస్తాం, ఇష్టం లేని వాళ్ల పేర్లు రాయమంటే ఎలా అని ప్రశ్నించారు. మెజారిటీ ఉంది చట్టం చేస్తాం అంటే ఎలా..?రాజ్యాంగం మంచి వాళ్ల చేతుల్లో ఉన్నంత వరకే దానికి రక్షణ అని సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *