ఎడ్యుకేషన్‌ ‌పాలసీపై కమిటీ ఏర్పాటు

– అధ్య‌క్షుడిగా కేశ‌వ‌రావును నియ‌మించిన ప్ర‌భుత్వం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 1: ‌తెలంగాణ ఎడ్యుకేషన్‌ ‌పాలసీపై రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తెలంగాణ ఎడ్యుకేషన్‌ ‌పాలసీ రూప‌క‌ల్ప‌న‌కు కమిటీని సోమవారం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారుడు కె.కేశవరావును నియమించింది. ఆయనతో సహా ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ తన నివేదికను అక్టోబ‌ర్ 30వ తేదీ నాటికి ప్రభుత్వానికి సమర్పించనుంది.  విద్యా శాఖ సెక్రటరీ యోగితా రాణా కమిటీ మెంబర్‌ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, విద్యా ళికమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి, సీఎస్‌ రామకృష్ణారావు, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ బాలకృష్ణారెడ్డిని సభ్యులుగా నియమించింది. మరో సభ్యుడిని ఎంపిక చేసే స్వేచ్ఛను కమిటీ చైర్మన్‌కు కల్పించింది. ఈ కమిటీ జాతీయ విద్య పాలసీ 2020ని రాష్ట్రానికి అనుకూలంగా అమలు చేసే అంశంపై అధ్యయనం చేయాల‌ని, జాబ్‌ మార్కెట్‌కనుగుణంగా స్కిల్స్‌ పెంచేందుకు ఎడ్యుకేషన్‌ ఫ్రేమ్‌ వర్క్‌ను రూపొందించాలని సూచించింది. ఇందులో డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌, ఇన్నోవేషన్‌, ఎంట‌ర్‌ప్రెన్యూర్‌ షిప్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోనేందుకు పెద్ద పీట వేయాలని సూచించింది.
ఇక విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య పరిశోధన సహకారం ఏర్పాటుకు అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని స్పష్టం చేసింది. పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలు, టెక్నికల్‌, ఒకేషనల్‌, ప్రొఫెషనల్‌ కోర్సులను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం.. సమానత్వం సాధించేందుకు తీసుకురావాల్సిన సంస్కరణలపై సలహాలు ఇవ్వాలని ఈ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *