– పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 23: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారని, ఈ అడ్డంకిని తొలగించడానికి ఆర్డినెన్స్ తెచ్చామని, దాన్ని గవర్నర్ కేంద్రానికి పంపారని సీఎం రేవంత్‌రెడ్డి పీఏసీ సమావేశంలో తెలిపారు. కేసీఆర్ తెచ్చిన చట్టం ప్రకారం బీసీలకు ఒక్క శాతం రిజర్వేషన్ కూడా రాదన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రివర్గంలో ఆమోదించి అసెంబ్లీలో బిల్ పాస్ చేసుకున్నామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు విడిగా మరో బిల్లు తీసుకొచ్చామని చెప్పారు. బీసీలకు మేలు జరగాల్సిందేనని, రాహుల్ గాంధీ మాట నిలబడాలని, 90 రోజులలో రాష్ట్రపతి బిల్లులను ఆమోదించాలన్న అంశంపై సుప్రీమ్ కోర్టులో రాష్ట్ర వాదనలు వినిపించేందుకు ఇద్దరు న్యాయవాదులను నియమించామని చెప్పారు. అందులోనే రాష్ట్రపతి దగ్గర ఉన్న మన బీసీ బిల్లు అంశం ప్రస్తావనకు వస్తుందని, విడిగా సుప్రీం కోర్టుకు వెళ్తే కేసు లిస్ట్ కావడానికి బాగా సమయం పడుతుందని వివరించారు. రాహుల్ గాంధీ, పార్టీ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో కులగణన చేపట్టామన్నారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండి కూటమి అభ్యర్థిగా ప్రకటించినందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిర్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు సీఎం రేవంత్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ పరిరక్షణ కోసం, పౌర హక్కులను కాపాడేందుకు పనిచేశారన్నారు. బీహార్‌లో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఓట్ చోరీ పాదయాత్రకు ఈ నెల 26న తాను హాజరవుతున్నానన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి యూరియా కొరతపై డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. యూరియా ఇచ్చే పార్టీకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తానని కేటీిఆర్ అనడంలోనే వాళ్ల తీరు అర్థం అవుతోందన్నారు. యూరియా కోసం నాలుగుసార్లు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అనుప్రియా పటేల్‌ను కలిశానని చెప్పారు. యూరియా పంపిణీ పైన శేత్రస్థాయిలో మానిటరింగ్‌ను పెంచాలన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





