ఎవరైనా నేరం రుజువయ్యే వరకు అమాయకుడే అనే సూత్రం, ఒక కేసులో విచారణ ఎదుర్కొంటున్న ప్రతి నిందితుడికి వర్తిస్తుంది. ప్రాసిక్యూషన్ ఎటువంటి సందేహాలకు తావులేని రీతిలో సాక్ష్యాలను ప్రవేశపెట్టిన ప్పుడు మాత్రమే నేరారోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తిని ప్రామాణిక చట్టపరమైన విధానం ద్వారా శిక్షించ వొచ్చునని పై సూత్రం స్పష్టం చేస్తున్నది. సులభమైన రీతిలో చెప్పాలంటే ఒక వ్యక్తిపై చేసిన నేరారోపణ రుజువయ్యే వరకు శిక్షించడానికి వీల్లేదు. ఇక్కడ ‘అమాయకుడు’ అన్న భావన ఈ విధానంలో అత్యంత కీలక మైన అంశం. అంటే నేరం రుజువయ్యే వరకు నిందితుడిని అమాయకుడుగా పరిగణించాలని అర్థం. పైన వివరించిన అర్థం రెండు సందర్భాల్లో పరస్పర విరుద్ధంగా కనిపించడం గమనార్హం. మొదటి సందర్భంలో ఒక వ్యక్తిపై అవినీతి ఆరోపణలు రుజువైన తర్వాత చట్టపరమైన విధానం ప్రకారం శిక్షించడం. ఇక రెండ సందర్భంలో ఒక వ్యక్తిపై ఎటువంటి నేరారోపణ రుజువు కాకముందే శిక్షించడం. మొదటి సందర్భానికి నేరం రుజువయ్యే వరకు ఎవరైనా అమాయకుడే అన్న సూత్రం వర్తిస్తుంది. ఇక రెండవ సందర్భంలో ఒక వ్యక్తిపై చట్టపరంగా దోషారోపణ నిరూపణ కాకుండానే వ్యవస్థ అతగాడిని శిక్షిస్తుంది.
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఒకవేళ ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని ద్వేషించి నట్లయితే పైన పేర్కొన్న రెండో సందర్భం ఆ వ్యక్తికి ఆపాదించబడే అవకాశముంది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఒకవేళ పార్లమెంట్ ఉభయసభల ఆమోదం పొందితే, కేంద్రానికి అదనపు అధికారాలు సమకూరుతాయి. అంటే తనకు వ్యతిరేకంగా ఉన్నాడన్న నెపంతో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా మంత్రిని తక్షణం పదవినుంచి తొలగించే అధికారం కేంద్రానికి ఉంటుంది . ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు తీవ్ర నేరారోపణలతో 30రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉన్నట్లయితే నేరం రుజువు కాకపోయినా అతగాడిపై తొలగింపు వేటు పడుతుంది! మరింత సులభంగా చెప్పాలంటే ఒక మంత్రి ఐదేళ్ల పాటు శిక్షపడే ఒక కేసుకు సంబంధించి 30రోజుల పాటు కటకటాల వెనుక గడిపితే, అతని పదవినుంచి తొలగించడం ఖాయమవుతుంది.
ఇది అధికారంలో ఉన్న ప్రధానమంత్రికీ వర్తిస్తుంది. అటువంటి సందర్భాల్లో ప్రధానిని తొలగించే అధికారం రాష్ట్రపతికి ఈ చట్టం పొందుపరిచింది. (కేంద్ర దర్యాప్తు సంఘాలకు ప్రధాని స్థాయి పదవిలో ఉన్న నాయకుడిపై దర్యాప్తు జరిపే ధైర్యం ఉంటుందా ? అన్నది వేరే మాట!). ప్రస్తుతానికి ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపినప్పటికీ, ఈ బిల్లుపై సమీక్షించేందుకు విపక్షాలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ప్రవేశపెట్టడానికే ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందనేది నిష్టుర సత్యం. ప్రస్తుతం ప్రతిపక్షాలు దీన్ని ‘నల్లచట్టం’ గా పేర్కొంటూ తీవ్ర స్థాయిలో నిరసన తెలుపున్నాయి.
నాగరికులైన వ్యక్తులెవరూ అవినీతిపరులను శిక్షించకూడదని ఎట్టిపరిస్థితుల్లో అనబోరు. చట్టపరంగా అటువంటి అవినీతి నిరూపితమైనప్పుడు అందుకు పాల్పడినవారిని తప్పకుండా శిక్షించాల్సిందే! కానీ నిష్పక్షపాత విచారణలో అతనిపై ఆరోపణలు నిరూపించబడే వరకు అతడిని ‘అమాయకుడి’గానే పరిగణించాలి. రాజకీయ నాయకులు ప్రజాజీవితంలో అవినీతికి పాల్పడతారన్న అభిప్రాయం బలంగా వుంటోంది. అటువంటి నాయకులు కండబలం, ధనబలంతో వ్యవస్థలో ఉన్న లోపాలను అనుకూలంగా మలచుకొని, తమపై జరిపే అవినీతి విచారణను అడ్డుకుంటూ శిక్ష పడకుండా తప్పించుకునే సందర్భాల్లో వారిపై ఈ చట్టాన్ని ప్రయోగించడం సముచితమే కానీ అధికారంలో ఉన్న పార్టీ విపక్ష నేతలను వేధింపులకు గురిచేయడానికి ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయబోదన్న గ్యారంటీ లేదు. ‘నిష్పాక్షిక విచారణ’ అనేది ప్రజాస్వామ్య మనుగడకు అత్యంత కీలకం! మరి ప్రస్తుతం కేంద్రం తేవాలనుకుంటున్న ఈ చట్టం దీన్ని పూర్తిగా పక్కన పెట్టేదిగా కనిపిస్తోందనేది విపక్షాలను వేధిస్తున్న ప్రశ్న.
ఐదేళ్లు శిక్షపడే కేసుల్లో విచారణ సందర్భంగా 30రోజులు జైల్లో ఉన్న నాయకుడిని శిక్షించడానికి వీలు కల్పిస్తున్న ఈ చట్టం, కేంద్ర ప్రభుత్వానికి నిరంకుశాధికారాన్ని కట్టబెడుతోంది. నిజం చెప్పాలంటే విపక్షాలపై యుద్ధం ప్రకటించడానికి అధికార పక్షానికి ఇదొక అస్త్రం కాగలదు. అటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రులు లేదా మంత్రులను శిక్షించడానికి కేంద్రానికి ఈ చట్టం అపరిమిత అధికారాన్ని కట్టబెడుతోంది. ఫలితంగా వారు ‘నిష్పాక్షిక విచారణ’ ను ఎదుర్కొనే అవకాశాన్ని కోల్పోతారు. అంతేకాదు తనకు గిట్టని విపక్ష నాయకులపై దర్యాప్తు సంస్థల చేత తప్పుడు ఆరోపణలు సృష్టించి వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా కేంద్ర ప్రభుత్వం చేయగలదు! అంతేకాదు ‘వోటు చోరీ’ విషయంపై సంఘటితమవుతున్న విపక్షాల నోరు మూయించడానికి ఈ నయాభారత్ నాయకత్వం ప్రయోగిస్తున్న కొత్త అస్త్రంగా దీన్ని భావించాల్సి వొస్తుంది. విశ్వగురు, అవినీతిని ఎట్టి పరిస్థితిలో సహించ బోమంటూ గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర నాయకత్వం, ప్రతిపక్షాలను అడ్డుకోవడానికి చేస్తున్న కొత్త ప్రయోగంగా కూడా దీన్ని పరిగణించాలి!
ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకొని వారిపై తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా వివిధ రాష్ట్రాల్లో అధికారం లో ఉన్న ప్రతిపక్ష ప్రభుత్వాలను అస్థిరం చేయడానికి పన్నిన కుట్రగా విపక్షాలు, విమర్శకులు ఈ చట్టాన్ని పరిగణిస్తున్నారు. 2014 నుంచి విపక్ష నాయకులను అరెస్ట్ చేయడానికి దర్యాప్తు సంస్థలను విచ్చలవిడిగా వినియోగించడం జరుగుతూ వొస్తోందన్న విపక్షాల ఆరోపణలను తేలిగ్గా కొట్టిపారేయడానికి వీల్లేదు. ఈ పరిస్థితుల్లో కొత్త చట్టం అమల్లోకి వొస్తే బీజేపీ యేతర పార్టీల ప్రభుత్వాల స్థిరత్వం గాల్లో దీపం చందంగా మారుతుంది. ఎటువంటి విచారణ, కోర్టుల నేర నిర్ధారణకు సంబంధం లేని రీతిలో ఉన్న ఈ బిల్లు చట్టబద్ధమైతే అది కచ్చితంగా ‘సంఘీ డిక్రీ’ కాగలదని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.
ALSO READ: పార్టీలో తుఫాన్… అయినా మౌనం వీడని కెసిఆర్
ఇదిలావుండగా ‘వోటు చోరీ ‘నుంచి దేశ ప్రజల దృష్టి మరలిచేందుకే ఈ బిల్లును కేంద్రం ముందుకు తీసుకొచ్చిందనేది కొందరి అభిప్రాయం. 7/11 రైల్లో బాంబు పేలుడు కేసుకు సంబంధించి నిందితులు సుదీర్ఘకాలం విచారణ ఖైదీలుగా జైల్లో మగ్గారు. ఎంతోకాలం విచారించిన తర్వాత వారిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ బిల్లు ఎంతో సచ్ఛీలమైందిగా, న్యాయబద్ధమైనదిగా భావించినా, రాజకీయ నాయకుల విషయానికి వొచ్చేసరికి, విపక్షాల వారిని వేధించే అవకాశాలే ఎక్కువ! అవినీతిపట్ల ఎంతమాత్రం క్షమించని వైఖరిని అనుసరిస్తూ, ధర్మాన్ని వ్యవస్థాపితం చేయాలనుకుంటున్న తరుణంలో, విపక్షాలు ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా అవినీతికి రక్షణగా నిలబడుతున్నాయని కేంద్రం ప్రచారం చేసుకోవొచ్చు. కేంద్రం ఎంతగా ప్రచారం చేసుకున్నా, విపక్షాలను వేధించడానికి ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయబోదన్న గ్యారంటీ ఏమైనా ఉన్నదా? ఈ కోణంలో చేస్తున్న విపక్షాల వాదనను కూడా తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి. అంతేకాదు, బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్న బలమైన ప్రతిపక్ష నాయకులను విచారణల పేరుతో వేధింపులకు గురిచేసి, చివరకు వారు బీజేపీలో చేరిన తర్వాత సచ్ఛీలురన్న ముద్రవేసి, వారికి ‘మనశ్శాంతి’ని కలిగించి, ప్రతిపక్షాలను మరింత బలహీన పరచే వ్యూహంలో ఈ తాజా బిల్లు భాగం కాకూడదనేం లేదు. అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం తమ ప్రత్యర్థులపై విచారణ సంస్థలను ప్రయోగించి ఒత్తిడి సృష్టించే ప్రక్రియ ఎంతవరకు సమంజసమన్న దానిపై ఇప్పటికే దేశంలో చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో కేంద్రం తాజాగా తీసుకొస్తున్న చట్టం కేంద్రం అధికార కోరలకు మరింత పదును చేకూర్చగలదు. ఆవిధంగా ప్రజాస్వామ్యం క్రమంగా నిరంకుశ రూపాన్ని సంతరించుకునే దిశగా పయనించడం వర్తమాన చరిత్ర చెబుతున్న సత్యం!





