– దమ్ముంటే ఏదైనా గ్రామం వెళ్లి చెప్పండి
– ఉప ముఖ్యమంత్రి భట్టికి కేటీఆర్ సవాల్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13: ఆరు గ్యారెంటీలను దాదాపు అన్నిటినీ అమలు చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెబుతున్నారని, దమ్ముంటే ఇదే మాట ఏదైనా గ్రామానికి వెళ్లి ప్రజలకు చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. ఆ గ్రామం నుంచి వీళ్లని ప్రజలు తరిమి వేయకుంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. ఆరు గ్యారెంటీలలో దాదాపు అన్నీ అమలు చేశామన్న భట్టి విక్రమార్క ప్రకటనపై ఒక ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ, భట్టి వంటి కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారెంటీ కార్డులను దాచుకోండి.. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అన్ని హామీలను నెరవేరుస్తాం అని ప్రజలను మభ్యపెట్టిన విషయాన్ని గుర్తుచేస్తూ ఇప్పుడు వంద రోజులు కాదు.. రెండేళ్లు గడిచిపోయినా ఒక్క హామీని కూడా అమలు చేయని ప్రభుత్వం దాదాపు అన్నీ చేశామంటూ చెప్పడం ప్రజలను మోసగించడమేనని కేటీఆర్ మండిపడ్డారు. ఆరు గ్యారంటీల అమలు విషయంలో, ఇచ్చిన 420 హామీల అమలుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారంపై ప్రజలు అసలు నిజం అర్థం చేసుకున్నారని, అందుకే గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను తరిమేస్తున్నారని అన్నారు.





