Legal Notice: బండికి కేటీఆర్‌ లీగల్‌ నోటీస్‌

– ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు
– రాజకీయ ఉనికి కోసమే ఆరోపణలు
– తమ క్లయింట్‌కు క్షమాపణ చెప్పాలని నోటీసులో పేర్కొన్న న్యాయవాది

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (KTR) కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌కు (Bandi Sanjay Kumar) లీగల్‌ నోటీసు పంపారు. ఫోన్‌ ట్యాపింగ్‌కు(phone tapping) సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, నిరాధారమైనవని, అవి తన ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో చేసినవని కేటీఆర్‌ లీగల్‌ పేర్కొన్నారు. ఈ నెల 8న బండి సంజయ్‌ నిర్వహించిన పత్రికా సమావేశంలో చేసిన ఆరోపణలపై ఈ నోటీసును పంపించారు. ఆ ఆరోపణలు నిరాధారమైనవని, దురుద్దేశ పూరితమైనవని కేటీఆర్‌ తరపు న్యాయవాది ఆ నోటీసులో పేర్కొన్నారు. టెలిఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణల వల్ల కేటీఆర్‌ ప్రతిష్టకు భంగం కలిగిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోపాటు ఆ తర్వాత మంత్రిగా కేటీఆర్‌ అనేక రంగాల్లో అద్భుతమైన సేవలందించారని, అయితే బండి సంజయ్‌ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలతో తన క్లైంట్‌ కేటీఆర్‌ పరువుకి భంగం కలుగుతోందని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో బండి సంజయ్‌ చేసిన ఏ వ్యాఖ్యలకు కూడా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని, ఒక పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా బాధ్యత కలిగిన పదవుల్లో ఉండి మరొక శాసనసభ్యుడిపై అసత్యపూరిత, అడ్డగోలు వ్యాఖ్యలు చేసినందుకు లీగల్‌ నోటీసు ఇచ్చినట్లు అందులో ప్రస్తావించారు. బండి సంజయ్‌ ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదని, తన హోదాను దుర్వినియోగం చేస్తూ ప్రజలలో కేటీఆర్‌ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేవలం రాజకీయంగా వార్తల్లో నిలిచేందుకు బండి సంజయ్‌ పదేపదే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని కేటీఆర్‌ న్యాయవాది తెలిపారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్‌ కేటీఆర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, కేటీఆర్‌, అతని కుటుంబ సభ్యులపై భవిష్యత్తులో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని నోటీసులో డిమాండ్‌ చేశారు. నోటీసు అందిన ఏడు రోజులలోగా ఈ డిమాండ్లను పాటించని పక్షంలో చట్టపరంగా సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆరోపణల వల్ల కలిగిన నష్టానికి బండి సంజయ్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *