By-election: ఉప ఎన్నికలో ల‌బ్దిపొందేందుకే..

– గుడిని కూల్చిన గూండాలను అరెస్టు చేయరేమి?
– రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందనడానికి ఇదే నిదర్శనం
– రామచందర్‌రావు హౌస్‌ అరెస్టుపై బండి ఆగ్రహం

దిల్లీ, ఆగస్టు 12: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో (jubileehills by-election) ఒక వర్గం వారిని మెప్పించేందుకు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తారా అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ (Bandi Sanjay) రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావును రాష్ట్ర ప్రభుత్వం హౌస్‌ అరెస్ట్‌ (గృహ నిర్బంధం) చేయడంపట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్‌ పెద్దమ్మ గుడివద్ద హిందూ సంఘాలు నిర్వహించే కుంకుమార్చన కార్యక్రమానికి వెళ్లే కార్యక్రమం లేకపోకపోయినా రామచందర్‌రావును అడ్డుకోవడంపై తగదన్నారు. పార్లమెంటు సమావేశాల్లో బిజీగా ఉన్న సంజయ్‌ ఈ విషయం తెలిసిన వెంటనే తీవ్రంగా స్పందించారు. అయినా పెద్దమ్మ గుడికి హిందువులు వెళితే తప్పేంది? రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అని ప్రశ్నించారు. భాగ్యనగర్‌లో హిందూ సంఘాలను, బీజేపీ కార్యకర్తలందరినీ అరెస్టు చేయడం మూర్ఖత్వమేనని పేర్కొన్నారు. పథకం ప్రకారమే కాంగ్రెస్‌ వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. పెద్దమ్మ గుడిని కూల్చిన గూండాలను అరెస్టు చేయకుండా శాంతియుతంగా పూజలు నిర్వహించే హిందూ సంఘాల నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. ఒక వర్గం ఓట్ల కోసం హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటోందన్నారు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పే రోజులు రాబోతున్నాయని బండి సంజయ్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *