తెలంగాణా రాజకీయాలలో బిసి ట్రంప్ కార్డు!?

“ఒకవేళ బిసి వాదం రిజర్వేషన్లు సాధించినప్పటికీ బిసి కులాల మధ్య ఉన్న వైరుధ్యాలు ఏబిసిడి మాదిరిగా మరికొన్ని వెనుకబడిన ఉప కుల ఉద్యమాలు ముందుకు రావనే గ్యారెంటీ ఏమీ లేదు..ఒక రకంగా లేని అవకాశాలు కోసం సమాజాన్ని విభజించడానికి,చేసిన వాగ్దానాలు మరిపించడానికి పాలక పక్షాలు జవసత్వాలు ఓనకూర్చే,ఆడే ఎత్తుగఢల క్రీడనే ఈ రకమైన వాదాలు,ఉద్యమాలకు బలాన్ని ఇస్తుంది. నిజంగా సమాజంలో వర్ణ వివక్ష అనబడే పునాదులు పోవడానికి అస్థిత్వ ఉద్యమాలు తోడ్పడాలేకాని,వాటిని మరింత బలోపేతం చేసే దిశగా ఉండరాదు.అది భవిష్యత్తు తరాలకు అనర్థదాయకం. కనుక కుల సమీకరణలు,కుల వివక్షత,వాటి ఉనికి సమాజంలో ఉన్నంత వరకు ఈ ఉద్యమాలు పాలకవర్గాలు, ప్రతిపక్షాలు తదితరుల చేతిలోఅవన్నీ రాజకీయ ఆయుధాలే? ఇప్పుడు తెలంగాణా లో నడుస్తున్న బీసీ వాదం కూడా ఒక రకంగా అలాంటి రాజకీయ ట్రంప్ కార్డు నే!?”

తెలంగాణ రాజకీయ యవనిక పై నిధులు, నియామకాలు, నీళ్ళు నినాదం సైడ్ ట్రాక్ పట్టింది. అధికారపక్షానికి అది ప్రస్థుతం అవసరం కూడా!?బిసి ట్రంప్ కార్డును జేబులో పెట్టుకొని ప్రతి రాజకీయ పక్షం వ్యూహం ప్రతివ్యూహాలు పన్ను కొంటున్నాయి. వివక్షాపూరిత సమాజం విస్తరిస్తున్న మనదేశంలో వివక్ష అనేపదం రాజకీయ పక్షాల జేబులో ఆయుధం అయ్యింది..ఆకాడికి వస్తే తెలంగాణా రాష్ట్రం లో ఆంద్రప్రదేశ్ కంటే కాస్తా కుల వివక్షత తక్కువే! ఈ మధ్యకాలంలో తెలంగాణాలో ఉన్నా మేధావులు నుండి గ్రామస్థాయి నాయకుల వరకు కులం ట్రంప్ కార్డు వాడుతున్నారు. యస్సీ రిజర్వేషన్ బిల్లుతో మూడు దశాబ్దాల వైరం మాల,మాదిగల మధ్య కొంత తగ్గిపోయింది. ఇక ఇప్పుడు బిసీల వంతు మొదలైంది. ఈ వర్ణ వివక్ష కనబడేది రెండు రకాలు. .మోదటిది అగ్రవర్ణాలు, అట్టడుగు వర్ణాలు మధ్య వివక్షా రూపం అయితే,రెండవది అణగారిన వర్ణాలలోనే ఉన్న అంతర్గత వివక్ష. మొదటిది  వర్గపోరాటంలో అంతర్గత రూపం అయితే,రెండవది అణగారిన వర్గాల మద్యకుల వైవిధ్యం. ఈ రెండు అంశాలు తెలంగాణా లో కూడా కొన్ని సంఘటనల్లో చూశాం.

    ఇప్పుడు తెలంగాణా అంతటా మారుమ్రోగుతున్న వాదం బిసి వాదం. ఈబిసి వాదం చుట్టే రాజకీయ పక్షాలు చక్కేర్లు కొడుతున్నాయి.పరుగెడుతున్నాయి.దీనివలన సమాజంలో సగభాగం ఉన్న బిసి ప్రజలకు అందాల్సిన ఆరు గ్యారెంటీలు మరుగున పడుతున్నాయి. బిసి కులగణన నుండి మొదలైన బిసి వాదం రాజ్యాధికారం నినాదం వైపు మరలుతుంది. ఎవరి వాటావారికి దక్కడం న్యాయ బద్దమే. బహుజనులు అదికారంలోకి రావడాన్ని ఎవరూ కాదనలేని సత్యం.బిసి రాజ్యాధికారం సహజసిద్ధమైన  కోరిక నే ? కానీ, ఇప్పుడు ఉద్దేశ్యపూర్వకంగానే రాజకీయ రంగు పులమబడి ముందుకు వస్తుంది. బిసి వాదం అనబడే ప్రక్రియ తెలంగాణాలో ఉన్నప్పటికీ ఆవాదానికి” పిల్లి మెడలో గంట కట్టింది “మాత్రం.ఆర్.కృష్ణయ్య అని చెప్పవచ్చును. అయితే ఇక్కడ యస్సీ రిజర్వేషన్లు కోరిన మందకృష్ణ, బిసి నాయకుడు ఆర్ . కృష్ణయ్య కుల ఉద్యమం ప్రయాణంలో సారూప్యత ఉన్నా,చాలా తేడా ఉంది. మందకృష్ణ మాదిగ రాజకీయాలును ఉపయోగించుకొని కులపోరాటం చేస్తే.. ఆర్ కృష్ణయ్య కులం నుపయోగించి రాజకీయ ప్రస్థానం కొనసాగించాడు.

తెలంగాణాలో బిసి వాదానికి ప్రతినిధిగా ముందు కొచ్చిన ఆర్.కృష్ణయ్య అందివచ్చిన అన్ని రాజకీయ అవకాశాలు తమ బిసి కార్డు నుంచి పొందగలిగారు. స్వతంత్ర్యంగా బిసిల పై జరిగే వివక్షపై పత్రికా ప్రకటనలు ద్వారా ముందు కొచ్చిన ఆర్.కృష్ణయ్య తొలుత టిడిపి కి సపోర్టు చేయడం ద్వారా తెలంగాణాలో శాసనసభలో అడుగు పెట్టారు. అటు తర్వాత అదే స్థానం నుండి ఓడిపోయారు. కొంతకాలం తర్వాత జగన్ తన రాజకీయ అస్త్రంగా ఆయనను వాడుకొని రాజ్యసభకు పంపించారు. అయితే ఆంధ్రాలో కూటమి రాజకీయ బాగస్వామి అయిన బిజేపి జగన్ ను రాజ్యసభలో బలహీన పర్చే వ్యూహం లో భాగం అయిన రాజ్యసభ రాజీనామా అస్త్రంలో ఆయన తొలి భాగస్వామి అయ్యారు. తరువాత కేంద్రం లో అధికారంలో ఉన్న బిజెపి పక్షాన రాజ్యసభ కు వెంటనే ఎంపిక అయ్యారు. ఇప్పుడు బిజేపి గూటిలోనే ఉన్న ఆర్.కృష్ణయ్య బలం, బలహీనత కూడా బిసి వాదమే..! బిసి వాదం ద్వారా ఎంతోమంది ప్రజలకు ఆయన మేలు చేశాడో తెలియదు కానీ,ఆయన మాత్రం కులవాద గోడను పట్టుకొనే రాజకీయ పీఠాలపై ఎగబాకాడు. పైగా పాలకవర్గాలతోనే కొనసాగుతూ వచ్చారు.

   ఇక రెండో అంశం కాంగ్రెస్ అంతర్గత రాజకీయ వ్యూహం తెలంగాణా లోబిసి వాదం ఉద్దేశ్యపూర్వకంగానే ముందుకు తెచ్చింది. కాంగ్రేస్ లో అధికార నిచ్చెన మెట్ల వివాదం ,ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను మరుగునపెట్టి, మభ్యపెట్టడం లో భాగంగా కాంగ్రెస్ ఇప్పుడు బిసి వాదం హస్త లాఘవం గా వాడు కొంటుంది. తొలుత పిసిసి అద్యక్ష పదవిరేసులో మహేష్ కుమార్ గౌడ్ ను నియమించడం ద్వారా తన రాజకీయ సంకేతం వెళ్ళడించగా, అటు తర్వాత బిసిగణన పేరుతో హడావిడి చేసి ఆశలు పుట్టించింది. పైగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం బిసి రిజర్వేషన్ వ్యూహాత్మకంగా ప్రకటించడం, 50శాతం రిజర్వేషన్ మించ కూడదని రాజ్యాంగ సూచికను సైతం దాటి ప్రభుత్వం ఆర్డినెన్సు తేవడం ఒక రాజకీయ ఎత్తుగడ గానే కాంగ్రెస్ వ్యూహం పన్నింది. ఆ వ్యూహం ద్వారా ప్రతిపక్షాలను కాస్త ఇరకాటంలో పెట్ట గలిగింది కూడా! బిసి రిజర్వేషన్ కు చట్టబద్దత కల్పించాల్సిన బాధ్యత కేంద్రం లోని బిజేపిపైనెట్టి ఆ పార్టీని ఇరుకున పెట్ట గలిగారు. 9వ షెడ్యూల్ లో చేర్చకుండా బిసి రిజర్వేషన్ 42శాతం అమలు అసాధ్యం..! బిజేపి పార్టీ మైనారిటీ లను బిసిల జాబితా నుండి తొలగించాలంటే మెలిక పెట్టింది.

ఇప్పటికిప్పుడు కాంగ్రెస్, బిజేపి డిమాండ్లు అమలు సాధ్యం కాని స్థితి! దానితో బిజెపి లేవనెత్తిన తెలంగాణలో బిసి ముఖ్యమంత్రి లాంటి నినాదాలు సంక్రాంతి మబ్బుల్లా తేలిపోయాయి. ఇక రాష్ట్రంలో ఉన్న బిజెపి ఎంపి లు  బిసిలు ఎక్కువ సంఖ్యలో గెలిచారు. అయితే వారెవరికీ బిజేపి అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టకుండా బిజేపి లోని అగ్రవర్ణానికి చెందిన రామచంద్ర రావు కు అత్యున్నత మైన తెలంగాణా బిజేపి అధ్యక్ష పీఠం కట్టబెట్టి సెల్ఫ్ గోల్ వేసుకుంది.  దానికి కారణం లేకపోలేదు తెలంగాణాలో బిజేపి లేవనెత్తిన ఆశలు ,బిసి వాదం వికటించి బిసి పార్లమెంటు సభ్యులే బహిరంగంగా దూషించుకునే స్తాయికి వెళ్ళింది. పుండుమీద కారంచల్లిన విధంగా సీనియర్ బిజేపి నేత బండారు దత్తాత్రేయ గవర్నర్ గా తొలగింపు, మరో బిసినేత రాజా సింగ్ రాజీనామా అంశం ఉండనే ఉంది.  ఆర్.కృష్ణయ్య బిసి కార్డు ప్రయోగం ఇరు రాష్ట్రాలలో ప్రయోజనం సంగతి ఏమో కాని ఇప్పుడు అదే వాదం ఆపార్టీకి ప్రాణసంకటంగా మారింది.

   కాంగ్రేస్ తనదైన బిసి వ్యూహం ద్వారా ఒకరకంగా తెలంగాణా బిజేపి దూకుడుకు అడ్డుకట్ట వేసింది.ఇక తెలంగాణాలో మరో ప్రతిపక్షం బి ఆర్ ఎస్ బిసి వాదాన్ని  అందుకొనే నైతికత లేక,ప్రభుత్వ పక్షంతో పోటీ పడలేకపోతుంది.కనీసం దానిపై స్పష్టత ఇవ్వలేని స్థితిలో ఉంది.కారణంలేకపోలేదు.. తెలంగాణా ఉద్యమం మొదలైన నాటినుండి కీలక బిజేపి నేతలందరికీ ఆపార్టీ చెల్లుచీటీ ఇచ్చింది. ఆలెనరేంద్ర, విజయశాంతి,మధుసూధనాచారి, ఈటల రాజేందర్, స్వామి గౌడ్, ఇత్యాది జాబితా చాలా ఉంది. వీరందరినీ సాగనంపడమో.. ప్రాదాన్యత లేకుండా చేసి శ్రీనివాస్ గౌడ్, తలసానిశ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళను తెచ్చుకున్నా పెద్ద ఫలితం కనపడలేదు. అయితే చిత్రంగా బి ఆర్ ఎస్  శాసనమండలి సభ్యురాలు, మాజీమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కుటుంబం లో వచ్చిన విభేదాలతో అసమ్మతి రాగంగా బిసి రాగం అందుకొంది. బిసి వాదం ద్వారా ఎదిగి దాని ద్వారానే రాజకీయాలు చేయాలను కొంటున్న , కాంగ్రెస్ నుండి బహిష్కరణ వేటుకు గురైన తీన్మార్ మల్లన్న కు చిర్రెత్తుకొచ్చింది. దానితో ఆయన మీడియాలో కవిత పై చేసిన వ్యాఖ్యలు ఘర్షణ, కాల్పులు వరకు వెళ్ళాయి. ఇవన్నీ తెలంగాణా లో తలెత్తుతున్న భవిష్యత్తు రాజకీయ కుల చిత్రపటానికి ముందస్తు గజిబిజి గీతలు మాత్రమే..!

     ఇక ప్రదానం గా తెలంగాణా లో బిసి వాదం విషయంలో ప్రొ.కంచె అయిలయ్య తాత్విక పునాదులు వేశారు. ఆయన యూనివర్సిటీ లో వెలిగించిన ఈ కులదీపం నక్సలైట్ ఉద్యమంతో పాటు వామపక్ష ఉద్యమాల్లో వర్గపోరాటమా?వర్ణ పోరాటమా? ఏది ముందు అనే చర్చ సైతం పార్టీలో ఉనికిని అతలాకుతలం చేసిపారేసింది. ఇక తెలంగాణా సాహిత్య రంగంలో కూడా రాజకీయ నిచ్చెన మెట్లు ఎక్కాలను కున్న చాలామంది మేదావులు బిసి వాదాన్నితల కెత్తుకున్నారు. బియస్ రాములు, జూలూరి గౌరీశంకర్,నారగోని లాంటి కవులు రచయితలు స్త్రీవాద, మైనారిటీ వాద అస్థిత్వ వాద సాహిత్యం మాదిరిగా బిసి వాద సాహిత్యం కొరకు ప్రయత్నాలు చేసినప్పటికీ సఫలం కాలేక పోయారు. తెలంగాణా రాష్ట్రంలో ఉన్న ఉద్యమాలు,వర్గపోరాటాలు, వామపక్ష భావజాలం తదితర సైద్దాంతిక పునాదులు అందుకు అవకాశం కల్పించడం లేదు.. ఇంకా అలాంటి ప్రయత్నాలు అక్కడక్కడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.ప్రభుత్వరంగ సంస్థలు అన్నీ కేంద్ర ప్రభుత్వం నష్టాలు పేరుతో కార్పోరేట్ సంస్థలకు తెగ నమ్ముతున్న దశలో ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోతున్న దిశలో,ఇక ఔట్ సోర్సింగ్, కన్సాలిడేటెడ్ ఉద్యొగం ప్రక్రియ లాంటి శ్రమ దోపిడి జరుగుతున్న నేపథ్యంలో , ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులపై భారీ కోతలు విధించడం, ఇత్యాది ఉపాధి అవకాశాలు ఉద్దేశ్య పూరితంగా కోత విధిస్తున్నారు.

ఇట్లాంటి సమయంలో ఈ కుల వాదనలు, ఉద్యమాలు పెద్దగా సామాన్య ప్రజలకు ఉపయోగపడేవి కావు..ఒరిగేదిలేదు.ఒకవేళ బిసి వాదం రిజర్వేషన్లు సాధించినప్పటికీ బిసి కులాల మధ్య ఉన్న వైరుధ్యాలు ఏబిసిడి మాదిరిగా మరికొన్ని వెనుకబడిన ఉప కుల ఉద్యమాలు ముందుకు రావనే గ్యారెంటీ ఏమీ లేదు..ఒక రకంగా లేని అవకాశాలు కోసం సమాజాన్ని విభజించడానికి,చేసిన వాగ్దానాలు మరిపించడానికి పాలక పక్షాలు జవసత్వాలు ఓనకూర్చే,ఆడే ఎత్తుగఢల క్రీడనే ఈ రకమైన వాదాలు,ఉద్యమాలకు బలాన్ని ఇస్తుంది. నిజంగా సమాజంలో వర్ణ వివక్ష అనబడే పునాదులు పోవడానికి అస్థిత్వ ఉద్యమాలు తోడ్పడాలేకాని,వాటిని మరింత బలోపేతం చేసే దిశగా ఉండరాదు.అది భవిష్యత్తు తరాలకు అనర్థదాయకం.   కనుక కుల సమీకరణలు,కుల వివక్షత,వాటి ఉనికి సమాజంలో ఉన్నంత వరకు ఈ ఉద్యమాలు పాలకవర్గాలు, ప్రతిపక్షాలు తదితరుల  చేతిలోఅవన్నీ రాజకీయ ఆయుధాలే? ఇప్పుడు తెలంగాణా లో నడుస్తున్న బీసీ వాదం కూడా ఒక రకంగా అలాంటి రాజకీయ ట్రంప్ కార్డు నే!?—–

ఎన్.తిర్మల్
(సీనియర్ జర్నలిస్టు, రచయిత, సామాజిక కార్యకర్త), 
సెల్:9441864514, 
ఇమెయిల్: thirmal.1960@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *