– అమిత్‌షా పరువు నష్టం కేసులో బెయిల్
న్యూదిల్లీ, ఆగస్టు 6: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Amit sha) పరువుకు భంగం కలిగించేలా వాఖ్యలు చేశారనే కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు జార్ఖండ్‌లోని(Jarkhand) ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు విచారణకు రాహుల్ గాంధీ స్వయంగా చాయిబాసా కోర్టు ముందు బుధవారం హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కోర్టు చుట్టూ భద్రతను పెంచారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని స్థానిక యంత్రాంగం భద్రతా ఏర్పాట్లు చేసింది. రాంచీ నుంచి చాయిబాసాకు రాహుల్ హెలికాప్టర్లో వచ్చారు. రాహుల్ గాంధీ 2018లో జరిగిన ఒక ర్యాలీలో అమిత్‌షా పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ ప్రతాప్ కుమార్ అనే వ్యక్తి పరువు నష్టం కేసు వేశారు. జూన్ 26న ప్రత్యేక కోర్టు ముందు రాహుల్ హాజరు కావాల్సి ఉండగా తన క్లయింట్ ఆరోజు హాజరుకాలేరని, ఆగస్టు 6వ తేదీన హాజరయ్యేందుకు వీలు కల్పించాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. కాగా, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబుసోరెన్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు రాహుల్ మంగళవారం జార్ఖండ్ రాష్ట్రానికి వచ్చారు.





