ఆ ఆపరేషన్‌లు చరిత్ర సృష్టించాయి

– ఆపరేషన్‌ సిందూర్‌, ఆపరేషన్‌ మహదేవ్‌లకు వెంకయ్య నాయుడు ప్రశంస

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 3: సాధారణ పౌరులకు ప్రమాదం లేకుండా ఆపరేషన్‌ సిందూర్‌ కేవలం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినదని, ఈ ఆపరేషన్‌ చేపట్టడం త్రివిధ దళాల ప్రతిభకు నిదర్శనమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ కొత్త చరిత్రను సృష్టించిందని ఉద్ఘాటించారు. 22 నిమిషాల్లోనే లక్ష్యాన్ని ఛేదించి సిందూర్‌, మహదేవ్‌ ఆపరేషన్‌లని ముగించడం అద్భుతమని ప్రశంసించారు. ఈ ఆపరేషన్లలో పాల్గొన్న త్రివిధ దళాలకు అభినందనలు తెలిపారు. భారతదేశం ఏ దేశం మీద కావాలని దాడి చేయదని.. ఆత్మరక్షణ కోసం మాత్రమే దాడి చేస్తుందని చెప్పారు. గచ్చిబౌలిలో వాయిస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ అకాడమీషియన్స్‌ ఆధ్వర్యంలో సెల్యూటింగ్‌ అవర్‌ హీరోస్‌ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ పహల్గాం దాడుల్లో అమరులైన వీరులను స్మరిస్తూ వాయిస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ అకాడమీషియన్స్‌ కార్యక్రమం నిర్వహించడం మంచి పరిణామమని కొనియాడారు. ఇండియాలో మళ్లీ టెర్రరిస్ట్‌ చర్యలు ఉంటే అది యుద్ధంగానే పరిగణిస్తామని భారత్‌ పాకిస్థాన్‌కు తేల్చి చెప్పిందని వివరించారు. తమ భూభాగంలోకి వచ్చే ధైర్యం ఎవరికీ లేదని పాకిస్థాన్‌ ఇన్నాళ్లు విర్రవీగిందని, కానీ ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పాకిస్థాన్‌ లోపలికి చొచ్చుకెళ్లి వాళ్ల ఎయిర్‌బెస్‌లను నాశనం చేసిందని చెప్పారు. మన సైనికులు, డిఫెన్స్‌ శాస్త్రవేత్తల వల్లే ఆపరేషన్‌ సిందూర్‌ సాధ్యమైందని వెంకయ్యనాయుడు తెలిపారు. కేవలం మూడు దేశాలను తప్ప ప్రపంచంలోని అన్ని దేశాలను టెర్రరిజానికి వ్యతిరేకంగా భారత్‌ ఏకం చేసిందనిన్నారు. ఇండియా ఎకానమీ పడిపోతుందని కొందరు అంటున్నారు.. మన దేశ ఎకానమి పెరుగుతుందని వాళ్లకు తెలిసినప్పటికీ ఏదో మాట్లాడాలని అలా అంటున్నారన్నారు. వాళ్లకు కూడా త్వరలోనే అర్ధం అవుతుంది మనం ఎక్కడున్నామో అని ఆయన అన్నారు. కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని వాడుకొని లబ్ధి పొందాలని కొందరు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కులాన్ని, మతాన్ని, భాషను, వర్గాన్ని ఉపయోగించి కొన్ని సంస్థలు గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. నీరు, నింగి, నేల.. ప్రతి దానికీ శక్తి ఉందని, అలాగే భారత దేశానికి పోరాడే శక్తి ఉందని.. భారత ప్రభుత్వం ఎప్పటికీ మన దేశ పౌరుల కోసం మాత్రమే పనిచేస్తుందని.. ఇతర దేశాల ఒత్తిడికి లొంగదని ఉద్ఘాటించారు. ఎవరి పని వాళ్లు చిత్తశుద్ధితో చేస్తే అదే దేశ భక్తి అవుతుందని సూచించారు. ఏబీఆర్‌ఎస్‌ఎం అనేది ఒక టీచర్స్‌ యూనియన్‌ అని, అయినప్పటికీ ఈ సంస్థ దేశ భక్తి కోసం కృషి చేయడం అభినందనీయమని వెంకయ్య అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *