జల వివాదాల కమిటీ మిధ్య యేనా?

తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్యనే కాదు వివిధ రాష్ట్రాల మధ్య గల వివాదాలను అవి పెరిగి మాను కాకుండా మొలక దశలోనే పరిష్కారం కనుగొనే వైఖరి కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. గడ్డ పారను నాన బెడతారు. ఇటీవల సంభవించిన పరిణామాలు పరిశీలించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి చూస్తే అసలు కమిటీ నియామకానికి మొగ్గు చూపుతారా? అనే అనుమానం కలుగుతోంది..
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గల జల వివాదాల పరిష్కారం కోసం నియమించదలచిన కమిటీ నియామకం కూడా కోల్డ్ స్టోరేజ్ చేరాయా? ఈ మధ్య కాలంలో ఎవ్వరూ ఈ కమిటీ ఊసే ఎత్తడం లేదు. జూలై నెల 16 వ తేదీ ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. 21 వ తేదీ కల్లా రెండు రాష్ట్రాల మధ్య గల జల వివాదాలకు పరిష్కారం కనుగొనేందుకు కేంద్ర జల వనరుల శాఖకు చెందిన వారితో కూడి రెండు రాష్ట్రాల అధికారులతో కమిటీ నియమించాలని తీర్మానించారు. కమిటీ సమాలోచనల అనంతరం అప్పటికీ మిగిలి పోయిన అంశాలు ముఖ్యమంత్రులకు నివేదించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
రెండు రాష్ట్రాల మధ్య గల జల వివాదాల్లో ఉద్రిక్తతలు తగ్గించడానికి కేంద్రం జల వనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేశారు. గమనార్హమైన అంశమేమంటే ఈ సమావేశంలో కేంద్ర మంత్రి ప్రేక్షక పాత్ర వహించారు. ముఖ్య మంత్రులే ఒకరు కమిటీ ప్రతి పాదన చేస్తే మరొక బలపరచి ఆమోదం పొందారు. అయితే ఇప్పటికి రెండు వారాలకు పైగా గడచి పోయినా పెద్దన్న పాత్ర వహించి కమిటీ నియామకం చూడ వలసిన కేంద్ర జల వనరుల శాఖ నుండి ఎట్టి స్పందన లేదు. అయితే ఆ సమావేశంలో కేంద్ర మంత్రి ప్రేక్షకుడుగా ఉన్నా  ఆ శాఖ కార్యదర్శి మాత్రం అప్పుడే కమిటీ నియామకానికి కొంత సమయం పడుతుందని చెప్పినట్లే కాలయాపన జరుగుతోంది . ఆంధ్ర ప్రదేశ్ మాత్రం కమిటీలో ఉండేందుకు ముగ్గురు పేర్లు ఖరారు చేసింది. తెలంగాణ వైపు నుండి ఆ ఊసే లేదు.
    తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్యనే కాదు వివిధ రాష్ట్రాల మధ్య గల వివాదాలను అవి పెరిగి మాను కాకుండా మొలక దశలోనే పరిష్కారం కనుగొనే వైఖరి కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. గడ్డ పారను నాన బెడతారు. ఇటీవల సంభవించిన పరిణామాలు పరిశీలించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి చూస్తే అసలు కమిటీ నియామకానికి మొగ్గు చూపుతారా? అనే అనుమానం కలుగుతోంది. ఈ లోపు తెలంగాణలో చక చకా కొన్ని పరిణామాలు సంభవించాయి. ముఖ్యమంత్రుల సమావేశానికి ముందు ఎజెండా నుండి బనకచర్ల అంశం తొలగించాలని కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో బనకచర్ల అనుసంధానం చర్చకు రావడం అందులో పాల్గొనడం జరిగింది. ముఖ్యమంత్రుల సమావేశం జరిగిన మరు రోజునే ఈ అంశంపై బిఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శనాస్త్రాలు సంధించి ఎదురు దాడికి దిగారు .
చంద్రబాబు నాయుడుతో కలసి ముఖ్యమంత్రి తెలంగాణకు అన్యాయం  చేస్తున్నారనే ప్రచారం తీవ్ర తరం చేశారు . తుదకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో బనకచర్ల అంశం లేక పోవడాన్ని జవాబుగా చెప్పుకోవలసి వచ్చింది. తాజాగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా రంగంలోకి దిగడంతో ఇప్పట్లో బనకచర్ల అనుసంధానం గురించే కాదు. బనకచర్ల అంశాన్ని ఎన్నికల ఎజెండాగా కేసీఆర్ ప్రకటించడంతో ఆంధ్ర ప్రదేశ్ తో ఎటువంటి చర్చలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొగ్గు చూపక పోవచ్చనే సందేహం కలుగుతోంది.
     తెలంగాణకు కొన్ని రాయితీలు ఇచ్చి బనకచర్ల అనుసంధానానికి ఆమోద ముద్ర వేసుకోవాలనే తపన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో ఉంది . అందులో భాగంగానే మీరు ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పాటికే ఆఫర్ ఇచ్చి ఉన్నారు. ఇక మిగిలినది నికర జలాల వాటా. తెలంగాణ కోరినట్లు నికర జలాలు 986 తెలంగాణ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాహసించక పోవచ్చు. ఏదైనా ఇప్పట్లో చర్చలు సాగే పరిస్థితి కనిపించడం లేదు. పైగా కాళేశ్వరం ప్రాజెక్టు పై ఘోష్ కమిషన్ రిపోర్టు ఇచ్చింది. ఈ రిపోర్టు ఒక వేళ కెసిఆర్ ను టార్గెట్ చేస్తే బిఆర్ఎస్ నేతలు ఎదురు దాడికి దిగే అవకాశం ఉంది . గతంలో చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డి కున్న సంబంధాల నేపథ్యాన్ని ఇంధనంగా ఉపయోగించడాన్ని తీవ్ర తరం చేయ వచ్చు.
మున్ముందు రెండు రాష్ట్రాల మధ్య ఎటువంటి చర్చలు ఏ స్థాయిలో జరిగినా పరస్పరం ఇచ్చి పుచ్చుకోక తప్పదు. అంతా తెలంగాణకు అనుకూలంగా ఉండదు కదా? ఏదో ఒక అంగీకారం కుదిరినా తెలంగాణ కూడా ఎంతో కొంత నష్ట పోక తప్పదు కదా? దాన్ని బిఆర్ఎస్ నేతలు గోరంత కొండంత చూపే అవకాశం లేకపోలేదు. దానికి తోడు కాంగ్రెస్ పార్టీలో ఉండే ముఠా తగాదాలు దీనిపై పడే అవకాశముంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాబోలు తెలంగాణ ప్రభుత్వం వైపు నుండి కమిటీ నియామకంలో సభ్యుల గురించి ఏలాంటి స్పందన లేదు. పైగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను కేంద్ర జల సంఘం తెలంగాణకు పంపితే తాము పూర్తిగా బనకచర్ల అనుసంధానానికి వ్యతిరేకమనే సమాధానం తిరిగి పంపింది. సంభవిస్తున్న పరిణామాలు పరిశీలించితే ఇప్పట్లో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై తుదకు చర్చలు కూడా జరిగే అవకాశం కనిపించడం లేదు.
-వి. శంకరయ్య 
విశ్రాంత పాత్రికేయులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *