రాజకీయాలలో నైతికతను ఒక రాజ్యాంగ విలువగా తీసుకురావడం కోసమే పదోషెడ్యూలు కింద ఫిరాయింపుల చట్టం అవతరించింది. జనతాప్రభుత్వం ఏర్పడిన తరువాత, ఆ తరువాత కాంగ్రెస్ తిరిగి గెలిచిన సందర్భంలోను జరిగిన ఫిరాయింపుల మీద ప్రజలలో ఏవగింపు పెరిగింది. తిరుగులేని మెజారిటీ సాధించిన, ధీమాలోనే రాజీవ్ గాంధీ హయాంలో ఫిరాయింపుల చట్టం వచ్చింది. ఆ నాటి నుంచి దాన్ని నిర్వీర్యం చేసి, పక్కదారులు వెదకడంలోనే రాజకీయపక్షాలు నిమగ్నమయ్యాయి. జాతీయ చట్టసభల దగ్గర నుంచి స్థానిక సంస్థల దాకా, ప్రజాభీష్టాన్ని అపహరించడానికి, తారుమారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

నైతిక హక్కు అనేది విచిత్రమైన పదార్థం.
ఆ మాట అనడానికి, ఆ విషయం అడగడానికి నీకు నైతిక హక్కు లేదు- అని అంటుంటారు. రాజ్యాంగంలో, చట్టాల్లో రాసుకున్న హక్కులకే గతిలేని స్థితిలో నైతికహక్కులను ఖాతరు చేసేదెవరు? మన సమాజంలో, ముఖ్యంగా, నిర్ణాయక వ్యవస్థలకు అంత నైతికత, నీతి భక్తి ఎక్కడ ఉన్నాయి? ఒక విషయం ఎవరో ఒకరు అడగడం ముఖ్యం కానీ, అడిగేవాడి యోగ్యతల గురించి పట్టింపు ఎవరికి? ఇవాళ తప్పు చేసినవాడే రేపు ప్రశ్నిస్తాడు. నిన్న ప్రశ్నించినవాడే ఇప్పుడు తప్పు చేస్తున్నాడు.
ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ మూడు నెలలలోగా నిర్ణయం తీసుకోవలసిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అక్టోబర్ 31 లోగా నిర్ణయం తీసుకోవాలి. ఫిరాయింపుదారుల మీద ఇక అనర్హత వేటు తప్పదని, ఉప ఎన్నికలు వస్తాయని ప్రతిపక్షం ఆశపడుతోంది. అంతేకాదు, ఇదొక గొప్ప విజయంగా సంబరపడుతోంది. ఫిరాయింపులను ప్రోత్సహించడంలో ఆరితేరిన పార్టీకి సుప్రీంకోర్టు తీర్పు మీద మాట్లాడే నైతికహక్కు లేదని పాలకపక్షం తీసిపారేస్తోంది.
ఆశ్చర్యకరంగా సామాన్య ప్రజలు కూడా ఈ అంశాన్ని అధికార, ప్రతిపక్షాల మధ్య తగాదాగా చూస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు అనర్హులైనా, కాంగ్రెస్ ప్రభుత్వానికి మెజారిటీలోటేమీ రాదు కానీ, రేవంత్ బృందబలం తగ్గిపోవచ్చు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవలేకపోతే, కప్పల తక్కెడ బిఆర్ఎస్ వైపు మొగ్గవచ్చు. నైతిక హక్కులు లేకపోయినా, నైతికవిజయాలు, నైతికపరాజయాలు రాజకీయ పరిణామాలలో ప్రభావం చూపిస్తాయి కాబట్టి, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అది నష్టం కలిగిస్తుంది. పరిశీలకులైనా, విశ్లేషకులైనా, రాజకీయాసక్త సామాన్యులైనా ఈ లెక్కలు వేసుకోవడమే తప్ప, ప్రజాస్వామ్యానికి, కలిగే నష్టం గురించి ఆలోచించకపోవడమే ఇక్కడ విషాదం.
రాజకీయాలలో నైతికతను ఒక రాజ్యాంగ విలువగా తీసుకురావడం కోసమే పదోషెడ్యూలు కింద ఫిరాయింపుల చట్టం అవతరించింది. జనతాప్రభుత్వం ఏర్పడిన తరువాత, ఆ తరువాత కాంగ్రెస్ తిరిగి గెలిచిన సందర్భంలోను జరిగిన ఫిరాయింపుల మీద ప్రజలలో ఏవగింపు పెరిగింది. తిరుగులేని మెజారిటీ సాధించిన, ధీమాలోనే రాజీవ్ గాంధీ హయాంలో ఫిరాయింపుల చట్టం వచ్చింది. ఆ నాటి నుంచి దాన్ని నిర్వీర్యం చేసి, పక్కదారులు వెదకడంలోనే రాజకీయపక్షాలు నిమగ్నమయ్యాయి. జాతీయ చట్టసభల దగ్గర నుంచి స్థానిక సంస్థల దాకా, ప్రజాభీష్టాన్ని అపహరించడానికి, తారుమారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.
ఎన్నికైన ప్రజాప్రతినిధిపార్టీ ఫిరాయింపు చేయడం అంటే, పార్టీ విధేయతను అతిక్రమించడం మాత్రమే కాదు. ప్రజలు కట్టబెట్టిన ఆమోదాన్ని గుండుగుత్తగా, ఆ ఆమోదానికి వ్యతిరేకంగా బదలాయించడం. అటువంటి సందర్భాలలో, ప్రజలకు దాన్ని అడ్డుకోవడానికి చట్టపరమైన ఆస్కారమే లేదు. పార్టీ మారినప్పుడు, పార్టీ పేరుతో సాధించుకున్న స్థానాన్ని వదులుకోవాలన్నది ఒక కనీస విలువ. 2023 తెలంగాణ ఎన్నికలలో ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. బిఆర్‌ఎస్ ను ప్రతిపక్ష స్థానంలో కూర్చోమని చెప్పి, గణనీయమైన సంఖ్యలోనే విజయాలు కూడా ఇచ్చారు. కానీ, కొందరు సభ్యులు తమ ప్రయోజనాలకు ఆ తీర్పు భంగకరమని, అధికారానికి దూరంగా ఉండలేమని భావించి, రకరకాల పద్ధతులలో గోడదూకారు. సాంకేతికంగా ఒక పార్టీలో ఉంటూనే, దానికి వ్యతిరేకంగా, మరో పార్టీకి అనుకూలంగా మాట్లాడారు. ఫిరాయించిన పార్టీ నుంచి రకరకాల పద్ధతులలో ప్రయోజనాలు తీసుకున్నారు. దీనికి అధికారపార్టీ ప్రోత్సాహం ఎంత కారణమో, అంతకు ఎక్కువగా ఫిరాయింపుదారుల అనైతికత కూడా కారణం.
చట్టసభలకు, న్యాయస్థానాలకు సభావివాదాల పరిధుల విషయంలో ఒక స్పర్థ నడుస్తూ ఉన్నది. చట్టసభలు చేసిన నిర్ణయాలకు న్యాయస్థానాలు అడ్డుతగులుతున్నాయని రాజ్యాంగ పదవులలో ఉన్నవారు సైతం బాహాటంగానే ప్రచారాలు చేస్తున్నారు. తమిళనాడు బిల్లుల ఆమోదం విషయంలో సుప్రీంకోర్టుచేసిన నిర్ణయం మీద కేంద్రం తీవ్రమైన అసహనాన్ని రకరకాల పద్ధతులలో వ్యక్తం చేసింది. వివిధ రాజ్యాంగ వ్యవస్థల సరిహద్దుల విషయంలో జాగ్రత్తగా ఉండవలసి వస్తోందన్న అర్థంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఇటీవల వ్యాఖ్యానించారు. రాజ్యాంగ మౌలిక చట్రానికి భంగం కలిగే సవరణలకు వీలులేదన్న కేశవానంద భారతి తీర్పు మీద కూడా ప్రతికూల ప్రచారం జరుగుతూ వస్తోంది.
ఇటువంటి పనులే గతంలో రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్, చంద్రశేఖరరావు హయాంలో బిఆర్ఎస్ చేయలేదా అంటే చేశాయి. అప్పటి ప్రతిపక్షాలు దాన్ని ఖండించాయి కూడా. స్పీకర్ల సాచివేతను వ్యతిరేకించాయి. న్యాయస్థానాలను ఆశ్రయించాయి. కానీ, అప్పుడు ఎటువంటి నిర్ణయాత్మకమైన ఫలితాలూ రాలేదు. అది విచారకరమే. ఇప్పుడు సుప్రీంకోర్టు పట్టింపు చూపింది. కేవలం తెలంగాణ సందర్భంలోనే కాదు, మొత్తంగా ఫిరాయింపుల సమస్య, స్పీకర్ల పాత్ర విషయంలోనే సూచనలు చేసింది. సభ్యుల అనర్హత వంటి సున్నితమైన, కీలకమైన విషయాల్లో స్పీకర్‌కు నిర్ణయాత్మకత ఉండడం సబబు కాదేమోనని, ట్రిబ్యునల్ వంటి ప్రత్యామ్నాయ స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు గురించి ఆలోచించాలని పార్లమెంటుకు సూచించింది. గత రెండు లోక్‌సభలలో అధికారపార్టీకి భధ్రమైన బలం ఉన్నప్పుడు ఈ తీర్పు వచ్చి ఉంటే, సుప్రీంకోర్టు సూచనను అమలుచేసి ఆ ఘనతను చాటుకునేవారేమో కానీ, ఇప్పుడైతే ఆ అవకాశం లేదు. దేశంలో అధికారంలో ఉన్న పార్టీ గతంలో కర్ణాటకలో, మహారాష్ట్రలో ఎటువంటి పద్ధతులు అనుసరించిందో అందరికీ తెలిసిందే.
చట్టసభలకు, న్యాయస్థానాలకు సభావివాదాల పరిధుల విషయంలో ఒక స్పర్థ నడుస్తూ ఉన్నది. చట్టసభలు చేసిన నిర్ణయాలకు న్యాయస్థానాలు అడ్డుతగులుతున్నాయని రాజ్యాంగ పదవులలో ఉన్నవారు సైతం బాహాటంగానే ప్రచారాలు చేస్తున్నారు. తమిళనాడు బిల్లుల ఆమోదం విషయంలో సుప్రీంకోర్టుచేసిన నిర్ణయం మీద కేంద్రం తీవ్రమైన అసహనాన్ని రకరకాల పద్ధతులలో వ్యక్తం చేసింది. వివిధ రాజ్యాంగ వ్యవస్థల సరిహద్దుల విషయంలో జాగ్రత్తగా ఉండవలసి వస్తోందన్న అర్థంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఇటీవల వ్యాఖ్యానించారు. రాజ్యాంగ మౌలిక చట్రానికి భంగం కలిగే సవరణలకు వీలులేదన్న కేశవానంద భారతి తీర్పు మీద కూడా ప్రతికూల ప్రచారం జరుగుతూ వస్తోంది.
వివిధ వ్యవస్థల మధ్య ఒక సమతూకం, పరస్పర కట్టడి ఉండేట్టుగా రాజ్యాంగ నిర్మాతలు జాగ్రత్త పడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకునే చట్టసభలకే అత్యున్నత పరిగణన ఉండాలన్నది నిజమే అయినప్పటికీ, చట్టాలు, పరిపాలన రాజ్యాంగ నిర్దేశించిన విధివిధానాలకే లోబడి ఉండాలనేది కూడా ప్రజాస్వామ్యసంప్రదాయంగా ప్రపంచ వ్యాప్తంగా సుస్థాపితమైంది. న్యాయస్థానాల స్వతంత్రత ఏ పాటిది అన్న ప్రశ్న ప్రజలలోను వస్తున్నది, స్వతంత్రంగా వ్యవహరించగలిగే అవకాశాలను తగ్గించడానికి న్యాయమూర్తుల నైతికతను ప్రశ్నార్థకం చేసే ప్రయత్నాలూ ఇతరత్రా జరుగుతున్నాయి. ఎంతగా నిరుత్సాహపరుస్తున్నప్పటికీ, ఇప్పటికీ బాధితులకు అంతిమ ఆశ్రయంగా న్యాయవ్యవస్థే ఉన్నదన్నది వాస్తవం. న్యాయవ్యవస్థలో నియామకాలు, అమెరికాలో జరుగుతున్న మాదిరిగా పార్టీల అనుకూలతల ఆధారంగా జరగకూడదని, ఒక పారదర్శక వ్యవస్థ ఉండాలని, అటువంటి ప్రక్రియలో ఎంపికైన న్యాయమూర్తులు న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడుకోవడానికి స్థిరనిశ్చయంతో పనిచేయాలని ప్రజాస్వామికవాదులు ఆశిస్తారు. ఫిరాయింపుల చట్టం స్ఫూర్తిని సభాపతులే గౌరవించనప్పుడు, ఫిర్యాదు చేయగలిగే వ్యవస్థ కూడా ఒకటి ఉండాలి. దశాబ్దాల పాటు అపరిష్కృతంగా ఉన్న ‘సభాపతి విచక్షణ’ సమస్యకు , కనీసం రాష్ట్ర చట్టసభల విషయంలో అయినా ఇప్పుడు ఒక చొరవ కనిపించింది.
మొత్తంగా రాజకీయవ్యవస్థ అంతా కూడబలుక్కుని ఫిరాయింపులను నిరోధించే చట్టవ్యవస్థను నీరుగారుస్తోంది. అది వాస్తవం. ఇప్పుడు మూడునెలల గడువులోపు నిర్ణయం వస్తుందో లేదో తెలియదు. న్యాయస్థానాల అధికారపరిధిని సభాపతులు ఇప్పుడు కూడా ప్రశ్నించి, ఒక సుదీర్ఘ వివాదానికి తెరతీయవచ్చు. లేదా, నిర్ణయం తీసుకోమన్నారు కానీ, ఆ నిర్ణయం అనర్హత వేటు మాత్రమే కానక్కరలేదు కదా, అనర్హతల అభ్యర్థనను తిరస్కరిస్తూ కూడా నిర్ణయంరావచ్చు, తిరగి ఆ నిర్ణయం ఉన్నతన్యాయస్థానం సమీక్షకు వెళ్లవచ్చు. కానీ, ఈ విషయాన్ని ఒక కొలిక్కి తెచ్చి, ఒక సత్సంప్రదాయాన్నినెలకొల్పాలని అందరూ అనుకుంటే, అందుకు అనుగుణమైన నిర్ణయం రావచ్చు.
దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ రెండు పార్టీలు లేదా కూటములు వంతులవారీగా అధికారంలోకి వస్తుంటాయి. ఎవరు అధికారంలో ఉంటే వారు అవతలిపక్షం నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంటారు. వారు ప్రతిపక్షంలోకి రాగానే, అధికారపక్షం ఫిరాయింపులను విమర్శిస్తుంటారు. ఇందులో ఏ పక్షానికీ నైతికహక్కులు, నైతికతా లేని మాట నిజమే. కానీ, ప్రజలకు గత్యంతరమేమిటి? కాంగ్రెస్ ప్రోత్సహించిన ఫిరాయింపులను విమర్శించే నైతిక హక్కు బిఆర్ఎస్‌కు లేదంటే, ఆ అప్రజాస్వామికత మీద గొంతెత్తగలిగే బలమైన పక్షం అయితే ఒకటి ఉండాలి కదా? వాళ్లకు చిత్తశుద్ధి లేదు నిజమే కానీ, మాటవరసకో, రాజకీయ పోరాటంలో భాగంగానో ఒకరిపై ఒకరు పోరాడుతుంటే అందులోనే ప్రజల ప్రయోజనాలు కూడా కలగలసి ఉంటాయి కదా? ఒక పార్టీ అధికార శక్తితో చెడ్డపనులు చేస్తుంటే, మరోపార్టీ తన గత చరిత్ర కారణంగా నోరెత్తకుండా ఉంటే, ఇక నిష్కృతి ఏది? ‘ఉపా’ గురించి దాని సృష్టికర్త కాంగ్రెస్ పార్టీ మాట్లాడవద్దంటే, బాధితులకు ఇక ఆలంబన ఏముంటుంది? వాళ్ల ద్వంద్వత్వాన్ని లేదా నైతికరాహిత్యాన్నిఆయా పక్షాలవారు ఎట్లా సమర్థించుకుంటాయో, ఆత్మవంచన చేసుకుంటాయో వారిష్టం. పెదవులపై నుంచో, మనసులోనుంచో ఒక ప్రజాస్వామిక వ్యక్తీకరణ చేసేవారుండడం మాత్రం అవసరం.
మొత్తంగా రాజకీయవ్యవస్థ అంతా కూడబలుక్కుని ఫిరాయింపులను నిరోధించే చట్టవ్యవస్థను నీరుగారుస్తోంది. అది వాస్తవం. ఇప్పుడు మూడునెలల గడువులోపు నిర్ణయం వస్తుందో లేదో తెలియదు. న్యాయస్థానాల అధికారపరిధిని సభాపతులు ఇప్పుడు కూడా ప్రశ్నించి, ఒక సుదీర్ఘ వివాదానికి తెరతీయవచ్చు. లేదా, నిర్ణయం తీసుకోమన్నారు కానీ, ఆ నిర్ణయం అనర్హత వేటు మాత్రమే కానక్కరలేదు కదా, అనర్హతల అభ్యర్థనను తిరస్కరిస్తూ కూడా నిర్ణయంరావచ్చు, తిరగి ఆ నిర్ణయం ఉన్నతన్యాయస్థానం సమీక్షకు వెళ్లవచ్చు. కానీ, ఈ విషయాన్ని ఒక కొలిక్కి తెచ్చి, ఒక సత్సంప్రదాయాన్నినెలకొల్పాలని అందరూ అనుకుంటే, అందుకు అనుగుణమైన నిర్ణయం రావచ్చు.
ఒక పార్టీకి రాజకీయ ఆయుధంగా, మరో పార్టీకి రాజకీయనష్టంగా మాత్రమే ఈ సంచలన తీర్పును చూడడం ఒక పద్ధతి. రాజకీయాలలో విలువలను, నీతిని ఆశించడం ప్రజల ప్రజాస్వామిక హక్కు, నైతికహక్కు అని గుర్తించి సానుకూల పరిణామంగా చూడడం మరో పద్ధతి.