కామారెడ్డి డిక్లరేషన్‌కు ఎందుకు కట్టుబడలేదు?

– బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్‌ డ్రామాలు
– ముస్లిం రిజర్వేషన్లతో బీసీిల కోటాకు గండి
– కేంద్రం, బీజేపీలపై నెపం నెట్టి తప్పించుకునే యత్నం
– ఇందిరాపార్కు వద్ద సభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2: రిజర్వేషన్‌లు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై బట్టకాల్చి విూద వేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం చూస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇది బీసీ రిజర్వేషన్ల కోసం కాదని.. ముస్లింలకు మేలు చేసేదని విమర్శించారు. గతంలో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ అని ఉద్ఘాటించారు. ఇందిరా పార్కు వద్ద జరిగిన ధర్నాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో వంద రోజుల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పిందని, కానీ ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు అవుతున్నా ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎంఐఎం చేతిలో కీలుబొమ్మగా ఉన్న కేసీఆర్‌ ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌లు అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారని గుర్తుచేశారు. బీసీ రిజర్వేషన్లను 22 శాతానికి కుదించారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ బీసీలను పీఎం, సీఎంలను చేసిందా అని ప్రశ్నించారు. బీసీలకు జనాభా సేకరణ తర్వాతే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. దిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆయన మాటలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టగా కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగిస్తూ గతంలో అమలైన 35 శాతం కంటే కూడా రెండు శాతం రిజర్వేషన్లు తగ్గించేలా కాంగ్రెస్‌ కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. 20శాతం ఇళ్లలోకి వెళ్లి ఎందుకు సర్వే చేయలేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలో జనాభా పెరిగిందని, బీసీల జనాభా తగ్గిందని లెక్కలు చెబుతున్నారని తెలిపారు. బీసీలకు న్యాయం చేసింది బీజేపీ మాత్రమేనని ఉద్ఘాటించారు. కులగణన చేయని కాంగ్రెస్‌ తరఫున రాహుల్‌ గాంధీ పార్లమెంటు ముందు ముక్కు నేలకు రాయాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విషయంలో మార్పు వచ్చిందో సమాధానం చెప్పాలని కిషన్‌రెడ్డి నిలదీశారు. ఇప్పటికే ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌లు కింద ముస్లిం, క్రిస్టియన్‌లకు రిజర్వేషన్‌లు కల్పిస్తోందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ విషయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ బీసీల పేరుతో రాజకీయం చేయాలని చూస్తోందని, వారికి ఎక్కడ ప్రాధాన్యమిచ్చిందని నిలదీశారు. ఎంపీ ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో అనేక అంశాలున్నాయని, స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగావకాశాల్లో బీసీలకు 42 శాతం ఇస్తామని హావిూ ఇచ్చారన్నారు. బీసీల కళ్లలో మట్టి కొట్టిన పార్టీ బీఆర్‌ఎస్‌ అని, ఆ పార్టీకి ఓబీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. రేవంత్‌ రెడ్డిని అర్థం చేసుకోలేకపోయామనీ, మోసపోయామని ప్రజలు అనుకుంటున్నారని ఈటల అన్నారు. బీసీ రిజర్వేషన్లపై కమిషన్‌ వేసిన రేవంత్‌ రెడ్డి ఆ కమిషన్‌ ఇచ్చిన రిపోర్టుకు చట్టబద్దత ఉంటదా అని ప్రశ్నించారు. రిజర్వేషన్లపై మొట్టమొదటి కమిషన్‌ వేసిన రాష్ట్రం తమిళనాడు. చట్టబద్దంగా 9వ షెడ్యూల్‌లో చేర్చుకొని రిజర్వేషన్లను సాధించుకున్నది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని కోర్టులు చెబుతున్నాయి. ఆర్టికల్‌ 340, కమిషన్‌ ఎంక్వరీ 1942 ప్రకారం రేవంత్‌ రెడ్డి ముందుకు వెళ్లాలి. బీసీ రిజర్వేషన్లు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి భరతం పడతామని ఈటల వ్యాఖ్యానించారు. ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ నామినేటెడ్‌ పోస్టుల్లో బీసీలను ఎందుకు నియమించలేదని మండిపడ్డారు. అవకాశం ఉన్నచోట ఇవ్వకుండా కాంగ్రెస్‌ డ్రామాలు ఆడుతోందని, దీనిని బీసీలు నమ్మరని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *