సమగ్ర పారిశ్రామికాభివృద్ధికి రోడ్‌మ్యాప్‌

ఎఫ్‌టీసీసీఐ కార్యక్రమంలో రామచందర్‌ రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 23: భారతదేశం ఒక వ్యవసాయ ప్రధాన దేశంగా, గ్రామీణ ఆధారిత దేశంగా గతంలో భావించేవారు.. అయితే కాలక్రమంలో ఎంత దూరం వచ్చిందో గమనిస్తే అందరికీ గర్వంగా అనిపిస్తోంది.. 1947లో స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు చూస్తే అభివృద్ధి మార్గంలో మన దేశం ఎంతో ముందుకు వెళ్లింది.. ఇంకా వెళ్తూనే ఉంది అని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు తెలిపారు. ఎఫ్‌టీసీసీఐ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 2047 నాటికి భారత్‌ను వికసిత భారత్‌గా తీర్చిదిద్దడమే ప్రధాన మంత్రి మోదీ కల అని అన్నారు. ఒకప్పుడు విదేశాల నుంచి సహాయం అడిగేవాళ్లం.. ఇప్పుడు మనమే వారికి సహాయం చేస్తున్నాం. పీఎల్‌ 480 అనే అమెరికా చట్టం ద్వారా అమెరికా మిగులు వ్యవసాయ వస్తువులు, పాలు, గోధుమలు సహాయంగా మనకు పంపించేదని, కానీ నేడు మనమే మంచి నాణ్యత గల ఆహార పదార్థాలు ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. కొన్ని పార్టీలు బిజెపిని సూట్‌బూట్‌ సర్కార్‌, కార్పొరేట్‌ సర్కార్‌ అంటూ విమర్శిస్తున్నాయి.. కానీ కార్పొరేట్‌ రంగం లేకుండా దేశాభివృద్ధి సాధ్యపడదని ఆయన స్పష్టం చేశారు. మనం సాంకేతికంగా, మానవ వనరుల పరంగా ఉన్నతస్థాయిలో ఉన్నామని, వాటిని ఉపయోగించుకోవాలని చెప్పారు. మన విద్యార్థులు, పరిశ్రమలు విదేశాలకు వెళ్లి విజయం సాధిస్తున్నారు. అమెరికాలో టాప్‌ సౖౖెంటిస్టులు, వ్యాపారవేత్తలు, డాక్టర్లు భారతీయులే. అమెరికాలో శాస్త్రవేత్తలు, డాక్టర్లు, వ్యాపారవేత్తలు టాప్‌లో భారతీయులేనని, ఆఫ్రికాలో 70% ఆర్థిక వ్యవస్థ భారతీయుల చేతిలోనే నడుస్తోందని, బ్రిటన్‌లో కూడా వ్యాపార రంగాన్ని భారతీయులు నడుపుతున్నారని వివరించారు. స్టార్టప్‌ ఇండియా, స్టాండప్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ ఇండియా, ఎంఎస్‌ఎంఇలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. ముద్రా లోన్లు, తక్కువ వడ్డీ రుణాలు లభిస్తున్నాయి. కానీ బ్యాంకులు రుణాలివ్వడంలో వెనుకబడుతున్నాయి. వాటిపై పర్యవేక్షణ అవసరమని అన్నారు. ఎంఎస్‌ఎంఈ రంగం అత్యధిక ఉపాధిని కలిగించేది. పెద్ద పరిశ్రమలకంటే ఎక్కువ ఉద్యోగావకాశాలు ఈ రంగం కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందని, కానీ పరిశ్రమలు నైపుణ్యం గల కార్మికుల కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నాయని రామచందర్‌రావు చెప్పారు. పాలసీలపై పునఃసమీక్ష అవసరమన్నారు. హైదరాబాదు చుట్టుపక్కల పరిశ్రమలకు అనుకూలంగా ఉంటుంది. కానీ అభివృద్ధి హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ఇతర పట్టణాలకూ వ్యాప్తిచెందాలని అభిప్రాయపడ్డారు. అలా అయితేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. వలసలను తగ్గించాలంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అవకాశాలు కల్పించాలని సూచించారు. కేంద్రం మద్దతుతో రీజనల్‌ రింగ్‌ రోడ్‌కి ప్రణాళికలు జరుగుతున్నాయని, హైదరాబాదు చుట్టూ సర్క్యులర్‌ రైలు లైన్‌తో అనేక ప్రాంతాలకు కనెక్టివిటీ ఏర్పడనుందని తెలిపారు. ఫార్మా రంగం కూడా మహబూబ్‌నగర్‌లో అభివృద్ధి చెందుతోందన్నారు. ఇదే సమయంలో యువత జాబ్‌ సీకర్‌గా కాకుండా జాబ్‌ గివర్‌గా మారాలని ప్రధాని మోదీ సందేశం ఇచ్చారన్నారు. స్టార్టప్‌లు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, సెమీకండక్టర్లు వంటి రంగాలలో అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, టాటా-బోయింగ్‌, సెల్‌ఫోన్‌ తయారీ, ఔషధ పరిశ్రమ ఇవన్నీ కేంద్ర విధానాల వల్ల సాధ్యమయ్యాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 12 నేషనల్‌ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలతో భూముల విలువలు పెరుగుతున్నాయన్నారు. హైదరాబాద్‌ ఫార్మసీ, హెల్త్‌ క్యాపిటల్‌గా మారిందన్నారు. ఇండస్ట్రియల్‌ రంగంలో కొన్ని ఆటంకాలు ఉండవచ్చు.. మీ సూచనలను స్వీకరించి తాము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పారిశ్రామికవేత్తలకు రామచందర్‌రావు హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *