– మూడేళ్ల లో పూర్తి స్థాయి నిర్మాణం
– ఆగస్టులో సిఎం చేతుల మీదుగా ప్రారంభం
– యూజీ, పీజీ కోర్సులు ప్రారంభం
– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూలై 23: ప్రపంచం గర్వించదగ్గ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. పాల్వంచలో బుధవారం యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి సంబంధించి నిర్వహించిన సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహించారు. యూనివర్సిటీ ప్రారంభానికి సంబంధించి అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వివిధ శాఖల ఉన్నతాధికారుల సూచనలతో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలో ప్రవేశపెట్టాల్సిన కోర్సులు, మౌలిక సదుపాయాలు, భవనాల నిర్మాణం, నిధుల సమీకరణ తదితర అంశాలపై సమీక్ష జరిపారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుంచే యూజీ, పీజీ స్థాయిలో బిఎస్సీ జియాలజీ, బిఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఎమ్మెస్సీ జువాలజీ, ఎమ్మెస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ కోర్సులు ప్రారంభించేలా తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కు సూచించారు. రాబోయే మూడేళ్ళలో పూర్తి స్థాయి విశ్వవిద్యాలయ నిర్మాణం కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి, విదేశాలలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలను అభ్యాసం చేసి అక్కడి అనుభవాల ఆధారంగా కోర్సుల రూపకల్పన చేయాలని నిర్ణయించారు. ఆర్యూఎస్ఎ నిబంధనల ప్రకారం నిధుల సమీకరణ చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా రంగానికి సంబంధించిన కీలక అధికారులంతా సమావేశంలో పాల్గొని, ప్రపంచంలో మొట్టమొదటి ఎర్త్ సైన్స్‌కు ప్రత్యేకమైన యూనివర్సిటీ స్థాపనకు అవసరమైన చర్యలు, కోర్సులు, విద్యార్థుల సంఖ్య వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. ప్రతిపాదనను సిఎం ఆమోదంతో ఆగస్టులో యూనివర్సిటీ ప్రారంభిస్తామని వెల్లడిరచారు. ఉద్యమ కాలంలోనే ఈ యూనివర్సిటీకి సంబంధించిన సంకల్పం తీసుకున్నట్లు గుర్తు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖనిజ సంపదకు కేంద్రంగా నిలుస్తుందని, జిల్లాలోని ఖనిజ వనరులను సమర్థవంతంగా వినియోగించేందుకు ప్రత్యేక ప్రణాళిక అవసరమని పేర్కొన్నారు. కలెక్టర్ ఇప్పటికే ఒక నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా జియాలజీ, భూవిజ్ఞానానికి సంబంధించిన విశ్వవిద్యాలయాలు ఉన్నా, పూర్తిగా ఎర్త్ సైన్స్‌కు అంకితమైన విశ్వవిద్యాలయం ఇదే మొదటిదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం కేటాయించిన 300 ఎకరాల భూమిలో మూడు సంవత్సరాలలో శాశ్వత భవనాలు, అవసరమైన వసతులతో కూడిన యూనివర్సిటీగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. అంతిమంగా ముఖ్యమంత్రి ఆలోచన మేరకు భారత మాజీ ప్రధానమంత్రి, ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరుతో ఈ విశ్వవిద్యాలయాన్ని డా.మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీగా నామకరణం చేయాలని మంత్రివర్గం ఆమోదించిన విషయాన్ని మంత్రి తెలియజేశారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుంచి యూజీ పీజీ కోర్సులలో ప్రవేశాలు మొదలవుతాయని, రాబోయే మూడు సంవత్సరాలలో విశ్వవిద్యాలయంలో కావలసిన అన్ని కోర్సులు ప్రవేశపెడతామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు భూమిపై అవగాహన, భూమికి సంబంధించి అన్ని పరిశోధనలకు సంబంధించిన అన్ని కోర్సులు ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలో విద్యార్థులకు సౌకర్యాలు, వివిధ రకాల కోర్సులు తదితర సదుపాయాలు కల్పనకు వివిధ దేశాల విశ్వవిద్యాలయాల సమన్వయంతో రూపొందిస్తామన్నారు. దీనికిగాను మూడు కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. కమిషనర్ కాలేజ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ దేవసేన మాట్లాడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ వంటి గొప్ప వ్యక్తి పేరు మీద ఎర్త్ సైన్స్ వర్సిటీ ప్రారంభించటం రాష్ట్రానికే గర్వకారణం అన్నారు. రాముడు కాలు మోపిన ఈ భూమిలో అద్భుతమైన యూనివర్సిటీ స్థాపించడంలో దేశంలోనే వివిధ రంగాలలో నిపుణులను కమిటీలో సభ్యులుగా చేయడం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తిస్థాయి ఎర్త్ సైన్స్ వర్సిటీ స్థాపనకు కృషి చేస్తామన్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ ప్రపంచంలోనే జియో లాజికల్ మ్యూజియంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉందన్నారు. అద్భుతమైన కనీస సంపద, గోదావరి పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ఈ జిల్లాలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ స్థాపన ద్వారా మారుమూల గిరిజన ప్రాంతాల విద్యార్థుల తో పాటు పాటు దేశంలోని విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తాను ఒక మారుమూల ప్రాంతం నుండి ఐఐటి చదివి ఈ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ స్థాపనలో పాలుపంచుకోవడం ఎంతో గర్వ కారణంగా ఉందని తెలియజేశారు. అనంతరం మంత్రి తుమ్మల ఇల్లందు క్రాస్ రోడ్ లోని టూరిజం హోటల్‌ను పరిశీలించారు. హోటల్ నిర్మాణ పనులను త్వరితగతిని పూర్తి చేయాలని, ఆగస్టులో సిఎం ఎర్త్ సైన్స్ వర్సిటీ , టూరిజం హోటల్‌ను ప్రారంభించే విధంగా అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి చైర్మన్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రొఫెసర్ ప్రతాపరెడ్డి వైస్ ఛాన్స్లర్ కాకతీయ యూనివర్సిటీ, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వైస్ ఛాన్స్లర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ శ్రీ రామ్ వెంకటేష్ సెక్రటరీ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, ప్రొఫెసర్ వి రామచంద్రన్ రిజిస్ట్రార్ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ, సౌందర్య జోసెఫ్ రూసా ప్రతినిధి సంబంధిత శాఖల అధికారులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి, ఇతర విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.




