తెలంగాణ ఉద్యమ స్వరం…

బహుజన చైతన్యానికి సజీవ రూపం…ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్
ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ – తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఓ మేధో దీప్తి, బహుజన హక్కుల కోసం నిరంతరం పోరాడిన మానవతా వాది. ఆయన జీవితం సాధారణమైనది కాదు; సామాజిక అసమానతల పట్ల ప్రశ్నించే దీక్షతో నిండినది. సామాజిక న్యాయమే ధ్యేయంగా, తెలంగాణలో వెనకబడిన కులలాను ఒకే వేదిక మీదికి రప్పించి, ఉద్యమం నిర్మాణం కోసం అహరహం శ్రమించిన సామాజిక సేవా తత్పరుడు, సామాజిక న్యాయ జె ఎ సి రాష్ట్ర అధ్యక్షుడు  ప్రొఫెసర్ ప్రభంజన్. కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగ హోదాల బంధాల నుండి బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమానికి, బహుజన చైతన్యానికి తన జీవితాన్ని అంకితంగా పెట్టిన ఆయన ఆచరణ వాది, తాత్విక నాయకుడు, సంఘ సంచాలకుడు. ఆయన మరణం తెలంగాణ ప్రజాస్వామ్య ఉద్యమానికి తీరని లోటుగా నిలిచింది.
ప్రభంజన్ యాదవ్ జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో జన్మించారు. బీసీ వర్గానికి చెందిన ఆయన విద్యాభ్యాసంలో మేధస్సుతో ముందంజ వేస్తూ కేంద్ర ప్రభుత్వంలోని ఆల్ ఇండియా రేడియో, తదుపరి ఢిల్లీలోని ప్లానింగ్ కమిషన్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పనిచేశారు. అయితే వ్యక్తిగత పురోగతికి తలవంచని ఆయన, సమాజంలోని వలసబాట పట్టిన వర్గాల శ్రేయస్సే తన ధ్యేయంగా భావించారు. పదవులు, హోదాలు వదిలిపెట్టి ప్రజా సేవకే తన జీవన యానం అంకితం చేశారు. ఆయన కార్యదీక్ష, అంకిత భావం, చిత్తశుద్ధి ఓ ఆదర్శ అద్భుత ఉదాహరణగా నిలుస్తుంది.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జోరందుకున్న కాలంలో ఆయన ధ్వని ప్రత్యేకంగా వినిపించేది. కేవలం ప్రాంతీయ భావోద్వేగానికి పరిమితం కాకుండా, తెలంగాణ ఉద్యమాన్ని బహుజన సమాజం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం చేసే సంక్లిష్ట పోరాటంగా ఆయన చూపించారు. తెలంగాణ కోసం ఎందుకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అనే ప్రశ్నకు సమాజ శాస్త్రపరమైన, చారిత్రక ఆధారాలపై నిలబడి సమగ్రమైన సమాధానాలు అందించిన అరుదైన ఆలోచనా నాయకుడు. తెలంగాణ బహుజన చరిత్ర, వారి సమస్యలు, అభ్యుదయ మార్గాలపై ఆయన అనేక వేదికల్లో ప్రసంగిస్తూ ప్రజల్లో చైతన్యం రగిలించారు.
ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ రచనా రంగంలోనూ తన మేధస్సును చాటి చెప్పారు. అనేక సామాజిక, రాజకీయ అంశాలపై ఆయన వ్యాసాలు, పుస్తకాలు వెలువరించారు. అంబేద్కర్, ఫూలే, పెరియార్, కంచె ఐలయ్యల తాత్విక దార్శనికత్వాన్ని అభ్యసించి, తనదైన విలక్షణ దృక్కోణంతో తెలంగాణ కదలికలకు మార్గనిర్దేశం చేశారు. ఆయన అభిప్రాయాల్లో స్పష్టత, తీక్షణత, మరియు ప్రజల పట్ల బాధ్యత కలగలసినవి. ఆయన మాట్లాడే ప్రతి మాటలో సమస్యల పట్ల తీవ్రత, పరిష్కారాల పట్ల ఆశాభావం ఉండేది.
prabhanjan
కళాశాలల్లో అధ్యాపకుడిగా ఉన్న సమయంలో ఆయన విద్యార్థుల్ని కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సమాజంపై ఆలోచించే యువతగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. విద్య ద్వారా సమాజాన్ని మారుస్తున్న తాత్విక దిశ ఆయన నమ్మకం. పలు తరం విద్యార్థులకు ఆయన మార్గదర్శిగా నిలిచారు. ఉద్యమాల తీరులో మార్పులు తెచ్చేందుకు విద్యారంగం నుంచే ప్రారంభించాలన్న సంకల్పంతో ఆయన సాగిన ప్రయాణం యువతలో విశేష స్పందనకు దారి తీసింది.
ప్రభంజన్ యాదవ్‌ సామాజిక అనుసంధానాలే కాకుండా, వ్యక్తిత్వం కూడా ఎంతో గౌరవనీయం. ఆయన వ్యక్తిగత జీవితంలో ఒంటరిగా నిలబడి ఉద్యమాన్ని నడిపిన తీరు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. నిస్వార్థ సేవా దృక్పథం, చిత్తశుద్ధితో కూడిన ఉద్యమ అనుభూతి ఆయనను నిస్సందేహంగా ఓ గొప్ప ప్రజా మేధావిగా నిలిపాయి. ఆయన బహుజన చైతన్యం కోసం చెప్పిన ప్రసంగాలు, రాసిన రచనలు, శ్రమించిన సంఘటనలు అన్ని కలిపి ఒక ఉద్యమోద్యమ పాఠశాలగా నిలిచాయి.
2025 జూలై 16న ఆయన హైదరాబాద్‌లో మృతి చెందారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ కూడా ప్రజల మధ్య ఉండే ప్రయత్నం చేశారు. ఆయన చివరి రోజుల్లో కూడా తను నమ్మిన సిద్ధాంతాలకే కట్టుబడి జీవించారు. ఆయన మృతిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ…తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టు మేధావిగా, యాక్టివిస్ట్‌గా ప్రభంజన్ యాదవ్ చేసిన కృషిని మరువలేనిదని అన్నారు. ప్రొఫెసర్ కంచె ఐలయ్య, ఇతర సాహితీవేత్తలు, విద్యావేత్తలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ‘ఇంత స్పష్టతతో మాట్లాడే బహుజన తాత్వికుడు నేడు తెలుగునాట అరుదు’ అనే మాటలు పలువురు అన్నారు.
ప్రభంజన్ యాదవ్ గారి జీవితం మనకు కొన్ని ముఖ్యమైన బోధనలు ఇస్తుంది. సమాజంలో మార్పు తెచ్చాలంటే మొదట మనమే మారాలి. భవిష్యత్ తరాలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించాలంటే త్యాగంతో కూడిన ఉద్యమ ధోరణి అవసరం. సమాజాన్ని నిద్రలేపే ధ్వని అవసరం. ఆయన ధ్వని అలా వినిపించిన గొంతు. తెలంగాణ ఉద్యమం ఆయనను స్ఫూర్తిగా తీసుకుని సాగితేనే ఆయన ఆశయాలకు సార్థకత చేకూరుతుంది. ఆయన జీవితం, రచన, ఉద్యమం – ఇవన్నీ కలిపి తెలుగు సమాజానికి ఓ గొప్ప వారసత్వంగా మిగిలిపోతాయి.
ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ వంటి మేధావులు సామాజిక పరివర్తనకు అంతులేని దీపాలు. వారు వెలిగించిన వెలుగు ఎన్నటికీ మింగి పోదు. వారు చూపిన మార్గం ఎన్నటికీ కనుమరుగవదు. తెలంగాణకు ఆయన ఒక విలువైన ఆస్తి. ఆయన చరిత్రను, తాత్వికతను భవిష్యత్ తరాలు గుర్తు పెట్టుకోవాలి. ఆయన నడిపిన దీక్షార్థాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి సామాజిక కార్యకర్తకు ఉంది. ఆయన పేరుని చెరగని అక్షరాలుగా లిఖించుకోవాలి. ఉద్యమం కొనసాగాలి… ఉద్యమ స్పూర్తి నిండాలి… ప్రభంజన్ యాదవ్ చూపించిన మార్గంలో ప్రజలు ముందుకెళ్లాలి.
 రామ కిష్టయ్య సంగన భట్ల,
సీనియర్ ఇండిపెండెంట్
 జర్నలిస్ట్ కాలమిస్ట్… 9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *