– అపెక్స్ కమిటీ కాదు కనక ప్రస్తావించలే
– కృష్ణా, గోదావరి జలాలపై ఉన్నతస్థాయి కమిటీ
– టెలిమెట్రీల ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు అంగీకారం
– సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూలై16: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాల అంశంలో ఉన్న సమస్యలపై చర్చించడానికి అధికారులు, ఇంజినీర్లతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ కమిటీ నివేదిక మేరకు తదుపరి చర్యలు ఉంటాయన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తిశాఖ నిర్వహించిన సమావేశం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డియా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఏపీ ప్రభుత్వం నుంచి గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు కడతామన్న ప్రతిపాదన చర్చకు రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అజెండాలో వారు కడతామనే ప్రతిపాదనే చర్చకు రానప్పుడు ఆపాలన్న చర్చే ఉండదన్నారు. ఇది అపెక్స్ కమిటీ భేటీ కాదని చెప్పారు. తెలంగాణ హక్కులను కేసీఆర్ గతంలో ఏపీకి ధారాదత్తం చేశారు. ఆయన చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వం కేవలం నిర్వాహక పాత్రే పోషించింది. కేంద్రం ఎవరివైపూ మాట్లాడలేదని రేవంత్‌రెడ్డి అన్నారు. అంతకుముందు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. అన్ని రిజర్వాయర్లు, కెనాల్స్ వద్ద యుద్ధప్రాతిపదికన టెలీమెట్రీలు ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. కృష్ణా నదీజలాల వాడకం లెక్కలపై అనుమానాలున్నాయి. టెలీమెట్రీలు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాం. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా రాష్ట్రమే నిధులు కేటాయిస్తుందని చెప్పాం. వీటి ఏర్పాటుపై గత ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించింది. ఈ భేటీ సందర్భంగా టెలీమెట్రీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.





