“సామాజిక శాస్త్రంలో కులం గురించి వివరణలో పుట్టుక, వంశపారంపర్యవృత్తి వంటి లక్షణాలతో పాటు ఇతర కుల సమూహాలతో కంచం పొత్తు, మంచం పొత్తు లేకపోవడం అనే వివరణ కూడా ఉంది. సహపంక్తి భోజన సంబంధాలు, వైవాహిక సంబంధాలు అనే భావనలను కంచం, మంచం అని సరళం చేసి (బహుశా చౌకబారుగా మార్చి) రాసినవాళ్లున్నారు. సామాజిక, సామూహిక స్థాయిలో సులభమైన విశ్లేషణా పరికరంగా దానికదిగా ఆ మాట తప్పు కాకపోవచ్చు కూడా. కాని అది వ్యక్తిగతంగా ఒకరి మీద ఉపయోగించినప్పుడు తప్పనిసరిగా తప్పుడు అర్థానికి అవకాశం ఇస్తుంది. అవమానకరంగా, అనుచితంగా, అభ్యంతరకరంగా మారుతుంది. ఒక కులానికీ మరొక కులానికీ కంచం పొత్తు, మంచం పొత్తు లేదు అనడం ఒక సామాజిక శాస్త్ర వివరణ కావచ్చు, కాని ఒక వ్యక్తి విషయంలో ఆ మాట వాడడం కచ్చితంగా తప్పు.”
ఆలోచనలనూ అభిప్రాయాలనూ మనోభావాలనూ విధేయతలనూ అడ్డంగా నరికి ఆటో ఇటో పడేసి, ఐతే అటు – లేకపోతే ఇటు అనే ఎదురుబొదురు ప్రపంచాలలో నివసించక తప్పని దుస్థితిని కాలం నిర్దేశిస్తున్నప్పుడు ఎవరైనా ఏదైనా ఒక కచ్చితమైన అభిప్రాయం చెప్పడం కష్టమే. ‘మావైపు లేకపోతే వాళ్లవైపు ఉన్నట్టే’ అని, సమాజంలో మేమూ వాళ్లూ మాత్రమే ఉన్నామని, భిన్నాభిప్రాయాలు, బహుళాభిప్రాయాలు ఉండే అవకాశమే లేదని ఎప్పుడో ముప్పై ఏళ్ల కింద జార్జి బుష్ ఒక్కడే అన్నాడేమో గాని, ఇప్పుడు రాజ్యమేలుతున్నదంతా జార్జి బుష్ అభిప్రాయమే. ఇటీవలి ఏ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక చర్చ అయినా చూడండి, ఈ రెండుగా విభజించిన వ్యూహమే అధికారికంగా చలామణీ అవుతున్నది. ఒక చర్చలో ఇద్దరూ తప్పే అనడానికి అవకాశమే లేకుండా పోతున్నది. ‘ఒకరు తప్పు, మరొకరు కూడా తప్పే’ అనే వాక్యంలో మొదటి సగం కాగానే మిమ్మల్ని అవతలి శిబిరంలోకి తోసేసి, మీ అభిప్రాయం పూర్తిగా వినవలసిన అవసరం కూడా లేదన్నంత తీవ్రవాదం రాజ్యం చేస్తున్నది.
ఈ విభజిత విధేయతల, నిర్బంధ శిబిరాల సంస్కృతి ఒకప్పుడు రాజకీయాల్లో, అది కూడా ఎక్కడో ఒకచోట చెదురు మదురుగా ఉండేది గాని ఇప్పుడు సకల జీవిత రంగాలలోకీ, సమస్త స్థాయిలలోకీ ప్రవహించి అన్ని ప్రమాద సూచికలనూ దాటిపోతున్నది. మన సమాజంలో, సంస్కృతిలో ఉన్న భిన్నత్వాన్నంతా, బహుళత్వాన్నంతా పిసికి ముద్ద చేసి, భిన్నాభిప్రాయాల నోరు నొక్కి ఏకత్వంగా మార్చాలని ఒకవైపు సంఘ్ పరివార్ ప్రయత్నిస్తుంటే, మరొక వైపు ఆ ముద్దను రెండంటే రెండే ముక్కలు చేసి, మీ గొంతు నొక్కి మీకు ఇష్టం లేకపోయినా ఒక ముక్కలో భాగం చేసే దౌర్జన్యం కొనసాగుతున్నది. రాజకీయాలలో ప్రారంభమై, సమాజమంతా చుట్టుకున్న భజన సంస్కృతి ఇప్పుడు విభజన సంస్కృతిని కూడా తోడు తెచ్చుకుని ఆటో ఇటో రెండే అభిప్రాయాలుండాలి తప్ప మూడో అభిప్రాయం ఉండగూడదన్నట్టు శాసిస్తున్నది.
ఇటీవల జరిగిన ఒక ప్రముఖ ఘటన గురించి ఆలోచిస్తుంటే మన సమాజపు ఈ దుస్థితి కళ్లకు కడుతున్నది.
పెద్దల సభ సభ్యులు ఇద్దరు – పేర్లు అవసరం లేదు, ఎక్స్, వై అనుకుందాం – వారి పదవికి తగని రీతిలో ప్రవర్తించారు. వై గురించి ఎక్స్ అనుచితమైన, అభ్యంతరకరమైన, అసభ్యమైన, వ్యక్తిగతంగా అవమానకరమైన భాష వాడారు. ప్రతిస్పందనగా ఎక్స్ మీద భౌతిక దాడికి వై తన అనుచరులను పురికొల్పారు. లేదా అనుచరులు దాడికి వెళుతున్నారని తెలిసినా అరికట్టలేదు. ఈ రెండు ఘటనల అనంతరం ఆ ఘటనలను నిష్పక్షపాతంగా విశ్లేషించి తప్పొప్పులు గుర్తించి, ఇద్దరివీ తరతమ స్థాయి తప్పులే అని చెప్పగల అవకాశమే లేకుండా పోయింది. ఒకరిది తప్పు అంటే వేరొకరిది ఒప్పు అంటున్నట్టు అర్థం చెపుతున్నారు. ‘ఎక్స్ ఆ మాట అనవలసింది కాదు’ అంటే అదే మన సంస్కృతి అని ఎదురు దబాయిస్తున్నారు. ఆ మాట తప్పొప్పుల మీద చర్చించకుండా ఏడేడు తరాలు వెనక్కి చరిత్ర తవ్వి, అసందర్భపు ఉటంకకింపులు చూపించి, ‘ఇప్పుడీ మాట అనడంలో తప్పు లేదు’ అని కుతర్కం చేస్తున్నారు. ‘భౌతిక దాడి చేయవలసింది కాదు, ఘటనాస్థలి నెత్తుటి చిత్తడి అయినంత దౌర్జన్యం జరపవలసింది కాదు’ అంటే, వై సమర్థకులు ‘ఆ మాట మీ ఇంట్లో వాళ్లను అంటే కూడా ఏమీ చేయకుండా కూచుంటారా, అసలు దొరకలేదు గాని దొరికితే ఆ మాట అన్న నాలుకను కోసి ఉండేవాళ్లం’ అని తాము చేసిన నేరానికి సమర్థనలు బీరాలు పలుకుతున్నారు. తప్పా ఒప్పా, ఉచితమా అనుచితమా అని చూడకుండా ‘మనవాళ్లు చేసిందంతా ఒప్పు, అవతలివాళ్లు చేసిందంతా తప్పు’ అనే భజన, విభజన సంస్కృతి ప్రదర్శిస్తున్నారు. ఇదే తెలంగాణ సంస్కృతి అని తెలంగాణను అవమానిస్తున్నారు.
భిన్నాభిప్రాయాలనైనా ప్రశాంతంగా చర్చించుకునే వాతావరణమే కరువై పోతున్నది. పొరపాటున నాలిక జారో, ఉద్దేశపూర్వకంగానేనో ఒక తప్పు మాట అని, ఇతరులు ఎత్తి చూపాక సవరించుకునే, క్షమాపణ అడిగే హుందాతనం లేకుండా పోతున్నది. ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ, పాత కాలపు గ్రామాలలో చావడి దగ్గరో, చెరువు కట్ట మీదనో, గుడి ముందరో, బొడ్రాయి దగ్గరో జరిగే పంచాయతీలలో, పది మంది కూచుని ఒక్కొక్కరు తాతలు తండ్రుల దగ్గరి నుంచి తిట్లు దిగపారబోసుకుని కూడా, అది అయిపోగానే అలాయి బలాయి కలిసి తిరిగిన పాత అమాయకత్వపు గ్రామీణ వివేకం అయినా మిగులుతున్నట్టు లేదు. ఒకవైపు అవమానకరమైన మాటల దాడిని, మరొకవైపు రక్తసిక్తమైన భౌతిక దాడిని, ఈ రెండు ఘటనలకు భూమికగా ఉన్న దిగజారుతున్న రాజకీయ సంస్కృతిని కాస్త ఓపికగా పరిశీలిస్తే మొత్తంగా మన సామాజిక విలువలకు, సంస్కృతికి, చర్చా పద్ధతికి ఏమై పోతున్నదో అర్థమవుతుంది. భవిష్యత్తు మరెంతగా దిగజారనున్నదో భయం వేస్తుంది.
“కాని ప్రస్తుత సందర్భంలో హాస్యాస్పదమూ విచిత్రమూ విషాదకరమూ ఏమంటే ఈ వివాదంలో అవమానకర భాష మాట్లాడినవారూ, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని శిక్ష విధించడానికి ప్రయత్నించినవారూ ఇద్దరూ ఆ పాలనా వ్యవస్థలో భాగమైనవారే. చట్ట సభల సభ్యులే. చట్టాన్ని తయారుచేసే బాధ్యత ఉన్నవారే. రాజకీయ, సామాజిక రంగాలలో ప్రముఖులే. అయితే ఆ వ్యక్తులు అటువంటి భాష వాడినవారిలో మొదటివారూ కాదు, అటువంటి భౌతిక దాడికి దిగినవారిలోనూ మొదటివారు కాదు. మన రాజకీయ పరిభాషే గత కొన్ని దశాబ్దాలుగా అలా చౌకబారుగా మారిపోయింది. మన సమాజంలో అంగబలం, అర్థబలం, అధికారం ఉన్నవారే చట్టమంటే లెక్కలేకుండా ప్రవర్తిస్తున్నారు. ఏ రాజకీయ పక్షంలో ఉన్నారనే దానితో నిమిత్తం లేకుండా మన రాజకీయ నాయకులలో చాలా మంది అటువంటి అనుచిత భాష మాట్లాడుతూనే ఉన్నారు, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని అటువంటి భౌతిక దాడులు చేస్తూనే ఉన్నారు.”
మొట్టమొదట, ఒక మహిళను ఉద్దేశించి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు ‘మంచం పొత్తు’ అనే మాట వాడడం పూర్తిగా అభ్యంతరకరం, అనుచితం, అవమానకరం. ఒకవేళ మాటల ఉరవడిలో అటువంటి తప్పు మాట దొర్లినా, వెంటనే తనంతట తాను గుర్తించి, లేదా ఎవరైనా ఎత్తి చూపినప్పుడు గుర్తించి సవరించుకోవాలి. ఆ మాటను ఉపసంహరించుకోవాలి. ఆ మాట వల్ల గాయపడినవారికి క్షమాపణ చెప్పాలి. సమాజంలో తప్పనిసరిగా పాటించవలసిన మర్యాద అది. అలా కాకుండా, ‘ఇది మా సంస్కృతి’, ‘మన సంస్కృతి’, ‘ఫలానా పుస్తకంలో ఉన్నది’, ‘ప్రభుత్వం ప్రచురించిన ఆ పుస్తకానికి మీ అయ్యే ముందుమాట రాశాడు’ ‘ఇది కులానికి అవమానం’ వంటి సమర్థనలు మరింత అనుచితం, దుర్మార్గం.
‘కంచం పొత్తు – మంచం పొత్తు’ అనే మాట సమాజంలో ఉన్న మాటే. కొత్తగా సృష్టించినదేమీ కాదు. చైతన్యప్రకాశ్ సంపాదకత్వంలో తెలంగాణ సాహిత్య అకాడమీ 2017లో ప్రచురించిన ‘తెలంగాణ సామెతలు’లో ఉంది అని ఇప్పుడు సాక్ష్యం తెస్తున్నారు గాని, దానిలో మాత్రమే కాదు, ఎప్పుడో 1959లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురించిన ‘తెలుగు సామెతలు’ లోనూ, 1986లో డా. దివాకర్ల వేంకటావధాని, పి యశోదా రెడ్డి, మరుపూరు కోదండరామరెడ్డి సంపాదకులుగా తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిన ‘తెలుగు సామెతలు’ లోనూ, 2008లో గాజుల సత్యనారాయణ సంపాదకుడుగా వెలువడిన ‘సామెతలు – పొడుపుకథలు’ లోనూ ‘కంచం పొత్తే గాని మంచం పొత్తు లేనే లేదు’ అనే సామెత ఉంది. సామాజిక శాస్త్రంలో కులం గురించి వివరణలో పుట్టుక, వంశపారంపర్యవృత్తి వంటి లక్షణాలతో పాటు ఇతర కుల సమూహాలతో కంచం పొత్తు, మంచం పొత్తు లేకపోవడం అనే వివరణ కూడా ఉంది. సహపంక్తి భోజన సంబంధాలు, వైవాహిక సంబంధాలు అనే భావనలను కంచం, మంచం అని సరళం చేసి (బహుశా చౌకబారుగా మార్చి) రాసినవాళ్లున్నారు. సామాజిక, సామూహిక స్థాయిలో సులభమైన విశ్లేషణా పరికరంగా దానికదిగా ఆ మాట తప్పు కాకపోవచ్చు కూడా. కాని అది వ్యక్తిగతంగా ఒకరి మీద ఉపయోగించినప్పుడు తప్పనిసరిగా తప్పుడు అర్థానికి అవకాశం ఇస్తుంది. అవమానకరంగా, అనుచితంగా, అభ్యంతరకరంగా మారుతుంది. ఒక కులానికీ మరొక కులానికీ కంచం పొత్తు, మంచం పొత్తు లేదు అనడం ఒక సామాజిక శాస్త్ర వివరణ కావచ్చు, కాని ఒక వ్యక్తి విషయంలో ఆ మాట వాడడం కచ్చితంగా తప్పు.
సాధారణంగానే ప్రకృతిలో అయినా, సమాజంలో అయినా, వ్యక్తి విషయంలో అయినా స్థూలంగా సరి అయినవి సూక్ష్మ స్థాయిలో సరి కానక్కర లేదు. దూరపు కొండలు నునుపు. అడవి దగ్గరికి పోతే చెట్లు మాత్రమే ఉంటాయి. చిత్రపటం మీద రెండు ఊళ్ల మధ్య సరళరేఖగా కనిపించిన రోడ్డు వాస్తవంగా ఎన్నో మలుపులతో ఉంటుంది. అలాగే సమాజంలో కూడా స్థూలంగా, సామూహికంగా, సామాజికంగా సరైనవనిపించే భావనలు సూక్ష్మంగా, వ్యక్తిగతంగా వాడడం కష్టం. అందులోనూ చిన్నచూపుకు, అసమానతకు, అనుమానానికి, అవమానానికి, వివక్షకు గురయ్యే సమూహంలోని వ్యక్తి మీద వాడడం పూర్తిగా తప్పు. ప్రస్తుత వివాదంలోని మాట సామాజిక శాస్త్రంలో రెండు సమూహాల మధ్య సంబంధం గురించి స్థూలంగా వాడినప్పుడు సరైనదే కావచ్చు గాని, దాన్ని ఒక వ్యక్తి విషయంలో వాడడం తప్పు. ఆ మాట జాగ్రత్తగా వాడవలసినదే గాని, యథేచ్ఛగా వాడదగినది కాదు. ఇక ప్రత్యేకించి ఒక మహిళ మీద వాడడం పూర్తిగా తప్పు.
అలా ఒక తప్పు జరిగినప్పుడు, దాన్ని మరొక తప్పుతో సవరించలేం. ఆ తప్పు చేసిన వ్యక్తి స్వయంగా తానే గుర్తించేలా చేసే ప్రయత్నం చేయవచ్చు. ప్రజల దృష్టికి తెచ్చి ఆ తప్పును విస్తారంగా అందరూ ఖండించేలా, తద్వారా ఆ వ్యక్తి తప్పు దిద్దుకునేలా చేయవచ్చు. తప్పు చేసిన వ్యక్తి ముందర వ్యక్తిగతంగానో, సామూహికంగానో నిరసన ప్రకటించవచ్చు. ఒక మహిళ పట్ల అటువంటి అనుచితమైన మాట వాడడం చట్టప్రకారం కూడా నేరం గనుక చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అటువంటి అనేక పరిష్కార మార్గాలున్నాయి. నిజానికి ఏ పరిష్కారమూ నిజమైన పరిష్కారం కాదు. ఒకసారి అన్నమాట ఏమి చేసినా వెనక్కి పోదు. ఆ మాట వల్ల కలిగిన గాయం మానదు. కాని సభ్య సమాజంలో అటువంటి అనుచితమైన మాటలు అన్నవారి మీద విచారణకు, శిక్షకు క్షమాపణ కన్నా, చట్టపరమైన విచారణ తర్వాత శిక్ష కన్నా ఎక్కువ శిక్షలు ఇప్పటికైతే కనిపెట్టలేదు.
‘అలా సమాజం అంగీకరించిన, అందుబాటులో ఉన్న మార్గాలేవీ మాకు అవసరం లేదు, వ్యక్తిగత ప్రతీకారం తీసుకుంటాం, భౌతికంగా మేమే శిక్ష విధిస్తాం, కంటికి కన్ను, పంటికి పన్ను అనే ఆదిమ న్యాయసూత్రాన్నే పాటిస్తాం’ అని కూడా ఎవరైనా అనుకోవచ్చు. అనుకుంటున్నవాళ్లు మన చుట్టూ చాలమందే ఉన్నారు. కాని అది చట్టబద్ధమైన, నాగరికమైన ప్రవర్తన కాదు. అది సమస్యను మరింత జటిలం చేస్తుంది. బాధితులకు కూడా ‘కంటికి కన్ను – పంటికి పన్ను’ అనే హక్కు లేదని, వారి తరఫున రాజ్యమే విచారణ జరిపి చట్టం నిర్దేశించిన శిక్ష విధిస్తుందని, ఆధునిక పాలనలన్నీ చెపుతున్నాయి. కాని ప్రస్తుత సందర్భంలో హాస్యాస్పదమూ విచిత్రమూ విషాదకరమూ ఏమంటే ఈ వివాదంలో అవమానకర భాష మాట్లాడినవారూ, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని శిక్ష విధించడానికి ప్రయత్నించినవారూ ఇద్దరూ ఆ పాలనా వ్యవస్థలో భాగమైనవారే. చట్ట సభల సభ్యులే. చట్టాన్ని తయారుచేసే బాధ్యత ఉన్నవారే. రాజకీయ, సామాజిక రంగాలలో ప్రముఖులే. అయితే ఆ వ్యక్తులు అటువంటి భాష వాడినవారిలో మొదటివారూ కాదు, అటువంటి భౌతిక దాడికి దిగినవారిలోనూ మొదటివారు కాదు. మన రాజకీయ పరిభాషే గత కొన్ని దశాబ్దాలుగా అలా చౌకబారుగా మారిపోయింది. మన సమాజంలో అంగబలం, అర్థబలం, అధికారం ఉన్నవారే చట్టమంటే లెక్కలేకుండా ప్రవర్తిస్తున్నారు. ఏ రాజకీయ పక్షంలో ఉన్నారనే దానితో నిమిత్తం లేకుండా మన రాజకీయ నాయకులలో చాలా మంది అటువంటి అనుచిత భాష మాట్లాడుతూనే ఉన్నారు, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని అటువంటి భౌతిక దాడులు చేస్తూనే ఉన్నారు.
నిజానికి మన సమాజపు మౌలిక సమస్య అదే. చట్టసభల సభ్యులే, పాలకులే, రాజకీయ నాయకులే, సంపన్నులే, అధికారావర్గాలే మన సమాజంలో సకల అనర్థాలకూ, సకల అక్రమాలకూ, అనుచిత ప్రవర్తనలకూ కారణంగా ఉన్నారు. వాటిని పెంచి పోషిస్తున్నారు. సమాజాన్ని విభజించి, తమ చుట్టూ భజన మండలిని చేర్చుకుని తాము చెప్పేదే సత్యమూ, అవతలి వాళ్లదంతా అసత్యమూ అని బాకాలూదుతున్నారు. రెండు వైపులా ఊరేగుతున్న ఈ అసత్యాన్ని దిగలాగి సత్యాన్ని గెలిపించవలసిన బాధ్యత ప్రజలదే.





