బియ్యంపై క్రెడిట్‌ కొట్టేయడం తగదు

-బీసీ రిజర్వేషన్లలో మత రిజర్వేషన్లు చేర్చడం సరికాదు
– నల్గొండ పర్యటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

నల్గొండ, ప్రజాతంత్ర, జులై 14: రేషన్‌ కార్డులను పార్టీ కార్యకర్తలకే ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతున్నదన్న సమాచారం అందుతోంది.. అందువల్ల రేషన్‌ కార్డుల పంపిణీ కోసం తుంగతుర్తి వస్తున్న ముఖ్యమంత్రిని ఒకటే డిమాండ్‌ చేస్తున్నాం అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌ కార్డు ఇవ్వాలని.. రేషన్‌ ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యాన్ని ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద కేంద్రం ఉచితంగా అందిస్తుండగా రాష్ట్రం కేంద్రానికి కృతజ్ఞత చెప్పకుండా దాన్ని తమ క్రెడిట్‌గా చెప్పుకుంటోంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు విమర్శించారు. నల్గొండ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పేరిట 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం మతపరమైన కోటా చేర్చడం సరికాదన్నారు. మతపరమైన రిజర్వేషన్లను సుప్రీం కోర్టు కూడా నిరాకరించిందని తెలిపారు. మతపరమైన రిజర్వేషన్ల వల్ల నిజమైన బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. బీసీ వర్గాలు దీన్ని గమనించి ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కేంద్రంపై నిందలు వేస్తోందని, బీజేపీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు.. కానీ దాంట్లోని 10 శాతం మతపరమైన కోటాకు మాత్రం వ్యవతిరేకమని చెప్పారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్‌ బిల్లు తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.. దానిని అమలు చేయాల్సిన బాధ్యత కూడా వారిదేనని అన్నారు. జిల్లా రాజకీయ చైతన్యం కలిగింది.. అయితే ఇక్కడ కూడా కుటుంబ పాలన నడుస్తోందని విమర్శించారు. యువత, మహిళలు పెద్దఎత్తున బీజేపీలో చేరి కుటుంబ రాజకీయాలను అంతమొందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఎల్‌బీసీ, డిరడి ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ పనులు ఎందుకు నిలిచిపోయాయో స్పష్టతనివ్వాలని కోరారు. రేవంత్‌ ప్రభుత్వం కేంద్రాన్ని నిందించడం మానుకొని ముందుగా తాము ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని రామచందర్‌రావు డిమాండ్‌ చేశారు.

స్థానిక ఎన్నికల్లో అన్నింటా పోటీ

తాను పుట్టిన జిల్లా ఇదే కావడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన తొలి పర్యటనను నల్లగొండ జిల్లాలో చేయాలని కోరాను. పార్టీ కూడా అందుకు అనుమతినిచ్చిందని రామచందర్‌రావు చెప్పారు. గ్రామస్థాయి నుంచి జెడ్పీటీసీ స్థాయి వరకు బీజేపీ ప్రత్యక్షంగా పోటీ చేస్తుందఅన్నారు. చౌటుప్పల్‌ పర్యటనలో ఆయనకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గతంలో బీజేపీ స్థానిక ఎన్నికల్లో పెద్దగా పోటీ చేయలేదు.. కానీ ఈసారి బలంగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థి పరిషత్‌ నుంచి వచ్చిన కార్యకర్తగా తాము ప్రజల సమస్యలపై పోరాడుతున్నాం.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలను చూశారు. ఇప్పుడు బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి.. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో వికసిత తెలంగాణను సాధిస్తాం అని చెప్పారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని ఎంతోకాలంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు.. ఈ రోజు కార్యకర్తలు, ప్రజల్లో కనిపిస్తున్న ఉత్సాహమే దీనికి నిదర్శనమని చెప్పారు. నల్లగొండ జిల్లాలోని ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగరాలన్నారు. ప్రతి గ్రామంలో బీజేపీ గెలిచేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయనపి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడంతో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టిందని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతితోపాటు పాలనా వైఫల్యంతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా మారుస్తోందని అన్నారు. బీజేపీ మాత్రమే బంగారు తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ, వికసిత్‌ తెలంగాణ నిర్మించగలదు.. అందుకే ఆ రెండు పార్టీలకు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అని వివరించారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలందరూ ఐక్యతతో పార్టీని అధికారంలోకి వచ్చేలా కృషిచేయాలని రామచందర్‌రావు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *