- మొదటి విడతలో నాలుగున్నర లక్షల ఇళ్ల నిర్మాణం
- లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 4: ఇందిరమ్మ ఇళ్లలో అర్హులందరికీ న్యాయం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) హామీ ఇచ్చారు. నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను మొదటి విడతలో భాగంగా అందజేస్తున్నామని ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్లను ఇస్తున్న తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, పేదవారి పట్ల ప్రేమ అభిమానాలు ఉన్నాయని తెలిపారు. బుధవారం ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో గల సత్యనారాయణపురంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డియాతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. వచ్చే నాలుగు సంవత్సరాల్లో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. పాలేరు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఉండి అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తానని హా ఇచ్చారు. ప్రతి ఆడబిడ్డ, తమ్ముడి కళ్లల్లో ఆనందాన్ని చూస్తుంటే భావోద్వేగానికి లోనవుతున్నామని చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే మంచి పనిచేస్తే వారి నుంచి వొచ్చే స్పందన గొప్పగా ఉంటుందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేక పోయినా సన్నబియ్యం ఇస్తున్నామని వెల్లడించారు. పదేళ్లలో మాజీ సీఎం కేసీఆర్‌కి రేషన్ కార్డులు కూడా ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేదని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో 19 లక్షల మంది పేర్లను కొత్తగా రేషన్ కార్డులో జమ చేశామని ప్రకటించారు. ధనిక తెలంగాణ రాష్ట్రాన్నిగత కేసీఆర్ ప్రభుత్వంలో అప్పుల్లోకి నెట్టారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.
ధనిక రాష్ట్రంలో రూ.8 లక్షల 19 వేల కోట్ల అప్పు చేసి పోతే.. ప్రతి నెల రూ.6,500 కోట్ల వడ్డీని తమ ప్రభుత్వం కడుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకుల మాదిరిగా పేదోళ్ల గురించి మొసలి కన్నీరుని ఇందిరమ్మ ప్రభుత్వం కార్చబోదని చెప్పారు. ఇందిరమ్మ ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఊకదంపుడు ఉపన్యాసాలు, కాలయాపన చేసే కబుర్లు చెపితే ప్రజలు నమ్మరని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గత పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఆయన కుటు-ంబ సభ్యులు కట్టు-కున్న ప్యాలెస్‌లు, అధికారులు, ప్రజాప్రతినిధులు నివసించే బంగ్లాల మీద పెట్టిన ఖర్చు, శ్రద్ద పేదవారి ఇంటి మీద ఎందుకు పెట్టలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో రూపాయి ఖర్చు పెడితే రాజకీయంగా ఏం లాభం వస్తోందనే ఆలోచించారని అన్నారు. పేదవారికి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వారికి అందుతుందా లేదా అని కూడా కేసీఆర్ కనీసం ఆలోచించలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.




