- సూమారు 250 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం
- సీఎం ఆదేశాల మేరకు ప్రణాళికలు సిద్దం చేయండి..
- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30 : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దేశంలోనే నెం.1 ఉండే విధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను కోహెడ వద్ద నిర్మించేందుకు తగు ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో కోహెడ మార్కెట్ (Koheda Integrated Market ) పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక శ్రద్ధ వహించి దేశంలో ఒక రోల్ మోడల్ మార్కెట్ ను నిర్మించాలని నిర్ణయించారని సి.ఎస్ తెలిపారు. వారి ఆదేశాల మేరకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో సూమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ఒక పెద్ద మార్కెట్ ను నిర్మించాలని, ఆధునిక వసతులతో కూడిన నిర్మాణాలు, కోల్డ్ స్టోరేజ్‌లు, షెడ్లు, విశాలమైన రోడ్లు తదితర సౌకర్యాలతో మార్కెట్ ను నిర్మించాలని సూచించారని సిఎస్ పేర్కొన్నారు.
దేశంలోనే ఒక డ్రీమ్ ప్రాజెక్టుగా కోహెడ మార్కెట్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో విస్తారంగా పండే పండ్లు, కూరగాయలు, ఇతర ఉత్పత్తులు, ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా ఈ మార్కెట్ ను నిర్మించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మామిడి, బత్తాయి, పండ్ల తోటలు విరివిగా ఉంటాయిని ఆ స్థాయిలో రైతులు, వినియోగదారులకు మార్కెటింగ్ సదుపాయం అందించాలని ముఖ్యమంత్రి అభిలాశించారని ఆ స్థాయిలో అధికారులు తగు ప్రణాళికలు, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కోహెడ మార్కెట్ ఏర్పాటుకు సూమారు ప్రాజెక్టు వ్యయం రూ.2890 కోట్లు అవసరమవుతుందని అధికారులు సి.ఎస్ కు తెలిపారు. మౌళిక వసతులు, భూ సేకరణ, రోడ్ల నిర్మాణం, ఆధునిక షెడ్ల నిర్మాణం, సోలార్ రూఫ్ టాప్ ల ఏర్పాటు, కోల్డ్ స్టోరేజ్ ల నిర్మాణం కోసం నిధులు కావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలకు సరిపడే విధంగా ఈ మార్కెట్ ను నిర్మించాలని సి.ఎస్ తెలిపారు. ఈ సమావేశంలో కమిషనర్, వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ సురేంద్ర మోహన్, మార్కెటింగ్ శాఖ అదనపు డైరెక్టర్ లక్ష్మీ బాయి, మార్కెటింగ్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.





