మెరుగయిన సేవలు అందిస్తాం..
అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశాలు
హైదరబాద్, జూలై 26: అమీర్ పేట గాంధీ నేచర్ క్యూర్ హాస్పిటల్ ని అద్భుతంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు, వసతులు కల్పించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మంగవారం సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలలో నేచురోపతి (ప్రకృతి ) వైద్యం పైన పెరుగుతున ఆసక్తికి అనుగుణంగా నేచర్ క్యూర్ హాస్పిటల్ ని అభివృద్ధి చేసుకోవాలని మంత్రి తెలిపారు. అందుకు కావాల్సిన సదుపాయాలు వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రకృతి వైద్యం లో ప్రసిద్ధి పొందిన మంథని సత్యనారాయణ సలహాలు సూచనలు తీసుకోవాలని మంత్రి హరీష్ రావు అధికారులకు సూచించారు. నేచర్ క్యూర్ విభాగం నుండి ప్రత్యేక బృందాన్ని విజయవాడ లోని మంథని సత్యనారాయణ నేచురోపతి హాస్పటల్ ని సందర్శించాలని అక్కడ అందుతున్న సేవలు, భోజన డైట్, ఇతర సదుపాయాల గురించి పూర్తిగా అధ్యయనం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నేచర్ క్యూర్ హాస్పిటల్ లో నేచురోపతి ఒపి, ఐపి సేవలకు మరింత మెరుగుపరచి అందుకు అనుగుణంగా ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. ప్రకృతి వైద్యం కాబట్టి హాస్పిటల్ లో మంచి ఆహ్లాదకరమైన వాతావరణ ఉండేలా పచ్చదనాన్ని పెంచాలని మంత్రి సూచించారు.
అదేవిధంగా నేచురోపతి కి ప్రత్యేక భోజన డైట్ ఉంటుంది కాబట్టి వాటికి కావాల్సిన వంట గది, వంట గది సామగ్రి సమకూర్చాలన్నారు. వచ్చే రోగులకు సేవలు అందించేందుకు సరిపడా వైద్యుల ను సిబ్బందిని పెంచుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దేశంలో ఎంతో ప్రాముఖ్యత పొందిన గాంధీ నేచర్ క్యూర్ హాస్పిటల్ ని మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన ప్రకృతి వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. వైద్యులు అధికారులు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలి అని మంత్రి తెలిపారు.ఈ సమీక్షలో వైద్యారోగ్య శాఖ సెక్రెటరీ రిజ్వి, ఆయుష్ కమిషనర్ ప్రశాంతి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్, సీఎం ఓఎస్డి దేశపతి శ్రీనివాస్, ప్రకృతి వైద్య నిపుణులు మంథని సత్యనారాయణ పాల్గొన్నారు.



