మునుగోడు భవితవ్యం మరో పది రోజుల్లో తేలనుంది. ఈ నియోజకవర్గంలోని దాదాపు రెండున్నర లక్షల మంది వోటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారన్నది వొచ్చే నెల మూడవ తేదీన తేలనుంది. ఇక్కడ నలభై ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ పోటీ మాత్రం ప్రధానంగా మూడు పార్టీల మధ్యే కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలోని వోటర్లలో దాదాపు డెబ్బై శాతం మంది వోటర్లు వెనుకబడిన తరగతులకు చెందినవారె. కానీ, పోటీలో అగ్రశ్రేణిలో ఉన్న ముగ్గురు కూడా ఉన్నత కులాలకు చెందిన వారే కాకుండా, వీరు ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. అయితే ఈ ఉప ఎన్నిక పోటీలో బిసి అభ్యర్థులు కూడా ఎక్కువగానే ఉన్నారు. వీరంతా స్థానికులే కాకుండా అంతో ఇంతో ప్రజలతో సత్సంబంధాలున్నవారున్నారు. వాస్తవంగా ఈ నియోజకవర్గానికి ఎనభై మందికి పైగా నామినేషన్లు వొచ్చినప్పటికీ 47 మంది మినహా మిగతా వారంతా విరమించుకున్న విషయం తెలిసిందే. అయితే పోటీ పడుతున్న వారిలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీల నుండి పోటీ పడుతున్నవారున్నారు.
వారిలో కూడా చెప్పుకోదగినవారు, బిఎస్పీ నుండి ఆందోజు శంకరాచారి, తెలంగాణ జనసమితి నుంచి పల్లె వినయ్ కుమార్‌లాంటి వారున్నారు. మునుగోడు ఎన్నికలకు ముందు నుండే బిఎస్పీ పార్టీ పక్షాన బడుగు బలహీన వర్గాల వారికే రాజ్యాధికారం ఉండాలని ఉద్యమిస్తున్న రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఇప్పటికే నియోజకవర్గమంతా చుట్టబెట్టారు. నియోజకవర్గంలో బిసి వోట్లే మెజార్టీలో ఉన్నందున వారంతా బిసి అభ్యర్థికి వోటు వేసి గెలిపించడం ద్వారా భవిష్యత్‌లో బిసిలకు అధికారం రావడానికి దోహద పడినవారవుతారంటూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. అలాగే టిజెఎస్ అధినాయకుడు ప్రొఫెసర్ కోదండరామ్ బిసికి చెందిన పల్లె వినయ్‌కుమార్‌ను గెలిపించాల్సిందిగా మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వోట్ల ద్వారా అప్రజాస్వామిక పాలనకు చరమగీతం పాడాలని ఆయన వారిని కోరుతున్నారు.
ఇదిలా ఉంటే వాస్తవంగా మూడు ప్రధాన పార్టీలకు మునుగోడు గెలుపు అత్యంత ప్రధానాంశంగా మారింది. ఇక్కడ జరుగుతున్నది ఉప ఎన్నికే అయినా ఇక్కడి గెలుపు ఓటములపైనే రానున్న శాసనసభ ఎన్నికల భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నది ఆ పార్టీలు భావిస్తున్నాయి. అందుకోసం భూమి ఆకాశాన్ని ఒకటి చేసైనా ఇక్కడ గెలుపు సాధించాలన్న పట్టుదలతో ముందుకు పోతున్నాయి. ఇక్కడ ఈసారి టిఆర్‌ఎస్ గెలిస్తే, రాష్ట్రంలో దూసుకు వొస్తున్న బిజెపికి చెక్ పెట్టినట్లు అవుతుంది. అంతేగాక బిజెపిపైన టిఆర్‌ఎస్ ఎక్కుపెట్టిన బాణానికి ప్రజల నుండి సంపూర్ణ మద్దతు లభించినట్లు అవుతుంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన బిఆర్‌ఎస్‌ను ప్రజలు ఈ ఎన్నిక ద్వారా సర్టిఫై చేసినట్లు ఉంటుందన్నది టిఆర్‌ఎస్ ఆశయం. అంతేగాక ఈ స్థానం ఇప్పుడున్న టిఆర్‌ఎస్ నియోజక వర్గాలకు అదనంగా లభించినట్లు అవుతుంది. ముఖ్యంగా ఈ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ నుండి గెలుచుకున్నట్లు అవుతుందన్నది ఆ పార్టీ ఆలోచన. ఎందుకంటే వాస్తవంగా మునుగోడు కాంగ్రెస్ స్థానమే అయినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బిజెపి నుండి పోటీలో ఉండడమే గాక, ప్రధాన పోటీ టిఆర్‌ఎస్, బిజెపిల మధ్యనే ఉంటుండడం వల్ల బిజెపిపై విజయం సాధించినట్లు అవుతుంది. బిజెపివల్లే ఈ ఉప ఎన్నిక రావడం కూడా అందుకు కారణం. ఆలాగే భారతీయ జనతా పార్టీయే ఈ ఉప ఎన్నికలో గెలిచినట్లు అయితే ఆ పార్టీ ఆలోచన ప్రకారం 2023లో తెలంగాణపై కాషాయ జండాను ఎగురవేయడానికి నాంది ప్రస్తావన జరిగినట్లే. అందుకే దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలకన్నా ఈ నియోజకవర్గంపైన ఆపార్టీకి చెందిన రాష్ట్ర, కేంద్ర నాయకులు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇక మూడవ ప్రధాన పార్టీ కాంగ్రెస్.
వాస్తవంగా మునుగోడు కాంగ్రెస్ స్థానం. ఇక్కడ నుండి గెలిచిన రాజగోపాల్‌రెడ్డి బిజెపిలోకి మారడంతో కాంగ్రెస్‌కున్న రెండు మూడు స్థానాల్లో ఒకటి మైనస్ అయింది. దీన్ని తిరిగి తమ హస్తగతం చేసుకోవడమన్నది హస్తం పార్టీకి అత్యంత ప్రధానమైనది.అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులతో కాంగ్రెస్ అభ్యర్థి ఏమేరకు పోటీలో నిలువగలరన్నది ప్రశ్న. మూడు పార్టీలు ఇక్కడ గెలుపుకోసం ఎవరూ ఊహించని రీతిలో కోట్లాది రూపాయలను మంచినీళ్ళ ప్రాయంగా వ్యయం చేస్తున్నప్పటికీ,టిఆర్‌ఎస్, బిజెపిని తట్టుకోవడం కాంగ్రెస్‌కు కష్టసాధ్యమే అన్నది స్పష్టమ వుతున్నది. పై రెండు పార్టీలే కాదు. ఆ పార్టీ అభ్యర్థుల పక్షాన ప్రచారం చేస్తున్న నాయకుల్లో చాలా మంది కోటీశ్వరులే. వారితో పోలిస్తే కాంగ్రెస్ అభ్యర్థికి ప్రజల మన్ననలే తప్ప ఆర్థిక వెసులుబాటు తక్కువే. పైగా డబ్బున్న వారిని చూసి వోటు రేటు కూడా పెరిగి పోతున్నది. ఒక్కో వోటుకు ఒక్కో ప్రాంతంలో ఒక రేటు పలుకుతున్నది. ఎంతలేదన్నా పది నుంచి ముప్పై వేలవరకు వోటర్లు డిమా ండ్ చేస్తున్నట్లు వార్తలు వొస్తున్నాయి. పైగా అభ్యర్థులను, ప్రచారకులను డబ్బుకోసం వారు నిలదీ స్తున్నట్లు కూడా వార్తలు వొస్తున్నాయి. మొత్తానికి మునుగోడు ఎన్నికన్నది డెబ్బై ఏండ్ల స్వాతం త్య్రానంతరం అత్యంత కాస్ట్లీ ఉప ఎన్నికగా మారింది. అభ్యర్థులు వెచ్చిస్తున్న డబ్బును అక్కడి ప్రజల సమస్యలపై వెచ్చిస్తే నియోజకవర్గమైనా బాగుపడేదన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి.




