- సంఘ సంస్కరణల చరిత్రలో రాజ్యాంగం గొప్పది
- రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో సిఎం జగన్
వచ్చే ఏడాది ఏప్రిల్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించ బోతున్నామని సిఎం జగన్ తెలిపారు. సంఘ సంస్కరణల చరిత్రలో రాజ్యాంగం అత్యంత గొప్పదని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిఅన్నారు. శనివారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సిఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి వారు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నామని జగన్ చెప్పారు. గ్రామ స్వరాజ్యానికి రూపకల్పన చేసిన ప్రభుత్వం తమదని.. సచివాలయాల వ్యవస్థతో సమూల మార్పులను తీసుకొచ్చామని అన్నారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు 50 శాతం ఇస్తున్నామని చెప్పారు. మంత్రి మండలిలో 70 శాతం మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలే ఉన్నారని తెలిపారు.
అసెంబ్లీ స్పీకర్ గా బీసీని, శాసనమండలి ఛైర్మన్‌గా ఎస్సీని, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మైనార్టీ వ్యక్తిని నియమించామని చెప్పారు. వేర్వేరు భాషలు, కులాలు, ప్రాంతాలు కలిగిన దేశానికి క్రమశిక్షణ నేర్పే రూల్‌బుక్, సామాజిక ప్రతీక రాజ్యాంగమన్నారు. దేశం మారడానికి, ప్రపంచంతో పోటీ పడటానికి రాజ్యాంగం రచించిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. రాజ్యాంగమే మన సంఘ సంస్కర్త కూడా అని తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విజయవాడలో అంబేడ్కర్ విగ్రహానికి ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు. ఆంగ్ల మాధ్యమం వద్దంటూ చేస్తున్న నయా అంటరానితనం నుంచి విద్యార్థులకు సీబీఎస్‌ఈ అమలు చేస్తున్నామన్నారు. సంస్కరణల ద్వారా దండయాత్ర చేస్తున్న ప్రభుత్వం తమదని స్పష్టం చేశారు. మహిళల ఆర్థిక సామాజిక అభ్యున్నతికి ప్రభుత్వం తోడ్పడుతుందని వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.




