ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 14 : తెలంగాణ రాష్ట్రంలో త్రాగునీటి కష్టాలు మిషన్ భగీరథ పథకం ద్వారా తీర్చబడ్డాయని తెలంగాణ మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ చంద్రమౌళి అన్నారు. శరవేగంగా పెరుగుతున్న కడ్తాల్ మండల కేంద్రంలో గురువారం స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి మరియు ఇతర అధికారులతో కలిసి మిషన్ భగీరథ పనితీరును పరిశీలించారు. కడ్తాల్ మండల కేంద్రంలో మిషన్ భగీరథ ద్వారా రోజుకి అందుతున్న రక్షిత తాగునీటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ రక్షిత మంచినీటి పథకం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మండల కేంద్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నందున ప్రతి రోజూ 4.8 లక్షల లీటర్ల సామర్థ్యంతో ప్రస్తుతం నీరు అందిస్తున్నామని మరొక లక్ష లీటర్ల నీటి ట్యాంకు త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు, అవసరాన్ని బట్టి మరొక లక్ష లీటర్ల నీటి ట్యాంకుకు నివేదికలు సమర్పించాలని సూచించారు. క్రమం తప్పకుండా మిషన్ భగీరథ త్రాగు నీరు అందే విధంగా సంబంధిత అధికారులు మరియు గ్రామపంచాయతీ చర్యలు తీసుకోవాలని సూచిస్తూ, అలసత్వం వహించరాదని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో డిమాండ్ ను బట్టి తాగునీరు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంటింగ్ ఇంజనీర్లు వెంకటరమణ, ఆంజనేయులు,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేష్, డివిజనల్ ఇంజనీర్లు మోహన్ రెడ్డి, సందీప్, అసిస్టెంట్ ఇంజనీర్లు ధీరజ్, జాహ్నవి నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.




