-వంగాల బిక్కేరు వాగును కొల్లగొడుతున్న అక్రమార్కులు
-గుండాల మండల అధికార పార్టీ నాయకులే దోపిడీదారులు
-మాఫియాతో కుమ్మక్కైన తహసిల్దార్…..?
-పట్టించుకోని భువనగిరి జిల్లా యంత్రాంగం
యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : రాష్ట్రంలో ఒకవైపు ఎన్నికల వేడి ముదురుతుంది. ఇదే అదునుగా భావించారేమో అక్రమార్కులు బరితెగించారు. తమను ఎవరు ఏమి చేయలేరని అనుకున్నారేమో. అధికార పార్టీ నాయకులే దోపిడీదారులుగా అవతారం ఎత్తారు. వీరికి తాసిల్దార్ జత కలిశారు. పోలీసులూ కర్తవ్యాన్ని మరిచారు. జిల్లా అధికార యంత్రాంగం కదలడం లేదు. ఇంకేముంది ఇసుక మాఫియా కోరలు చాచింది. యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండలం, వంగాల గ్రామంలో బిక్కేరు వాగు ఖాళీ అవుతుంది. రోజుకు వందల కొలది లారీల ఇసుక అక్రమంగా తరలి వెళ్తుంది. ఎన్నికల కోడ్ వస్తే అధికారులకు పూర్తిస్థాయి అధికారాలు ఉంటాయి. అక్రమార్కులకు అడ్డుకట్ట వేయడం వీరి చేతుల్లోనే ఉంటుంది. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండల అధికారులు మాత్రం అక్రమార్కుల పంచన చేరారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాలన్న తమ ఉద్యోగ ధర్మాన్ని సైతం మరిచారు. ఇక్కడి బిక్కేరు వాగులో స్వచ్ఛమైన ఇసుక ఉంటుంది. ఇది ఈ గ్రామ వాసులకు ఒక వరం. ఇందులో చేతి బోర్లు వేసుకొని రైతులు పంటలు పండించుకుంటారు. గ్రామంలోని 80 శాతం రైతాంగం దీనిపైనే ఆధారపడుతుంది. ఆపత్కాల సమయంలో ఈ వాగు నీరే గ్రామానికి త్రాగునీరు. అయితే ఈ గ్రామానికి ఇంతగా ప్రజో ఉపయోగకరమైన బిక్కేరు వాగులోని ఇసుకపై స్థానిక అధికార బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కన్ను పడింది. ప్రజలు ఏమైతే నేమి ఈ ఇసుక తరలింపు ద్వారా కొట్లాది రూపాయల సంపాదించుకోవాలన్న దుర్బుద్ధి వారిలో మెదిలింది. అనుకున్నదే తడువుగా కార్యాచరణకు దిగారు. దీనికి తోడు ఎన్నికల కోడ్ రావడం, అధికార యంత్రాంగం అందులో బిజీ కావడం వాళ్లకు కలిసి వచ్చింది. మండల ప్రజాపరిషత్ కు ఎన్నికైన ఓ ప్రజాప్రతినిధి ఈ అక్రమానికి సారధ్యం వహిస్తున్నారు. అంతే రాత్రి పగలు అని తేడా లేకుండా ప్రతిరోజు వందలాది లారీలు ఇసుక అక్రమంగా తరలి వెళ్తుంది. ఈ విషయమై గ్రామస్తులు అనేకమార్లు గుండాల మండల తాసిల్దార్ కు విన్నవించారు. ఆధారాలతో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. మరో విచిత్రం ఏమిటంటే గుండాల మండల పరిధిలో నుండి తరలిస్తున్న ఇసుక లారీలు సరాసరి మోత్కూరు పోలీస్ స్టేషన్ ముందు నుండి వెళతాయి. అయినప్పటికీ రెండు మండలాల పోలీసులు కిక్కిరిమనడం లేదు. దీనిని అడ్డుకోవడం తమ పని కాదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. సంపన్న వర్గాలకు, ప్రభుత్వ పెద్దలకు రాత్రింబవళ్లు ఊడిగం చేసే పోలీసులు కోట్లాది రూపాయల ఇసుక అక్రమంగా తరలి వెళ్తున్న స్పందించకపోవడంపై ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వాగు పరిసర గ్రామస్తులు తమ అవసరాలకు ఇసుక తరలిస్తే మాత్రం ఆగమేఘాల మీద కేసులు నమోదు చేసే పోలీసులు ఇప్పుడు కినుక వహించడం వెనుక అంతర్యం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడితోనే కాకుండా గ్రామస్తులు మైనింగ్ అధికారులతో పాటు ఆర్డిఓ, కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేశారు. అయినా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు లేదు. ఇసుక తరలింపు ఆగడం లేదు. దీంతో రోజు లక్షలాదిగా విలువ చేసే ప్రభుత్వ సంపద అక్రమార్కుల పాలవుతుంది. ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అన్నింటికి మించి వంగాల గ్రామ ప్రజల జీవితాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది. కావున ఇప్పటికైనా రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు స్పందించి ఇసుక అక్రమ తరలింపుదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఇసుక అక్రమ రవాణాలను అరికట్టి ప్రభుత్వ సంపదను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.




